షాబాద్ : ఆధునాతన పంట విధానాలతో ( Modern cropping) రైతులు అధిక దిగుబడులు సాధించవచ్చని వ్యవసాయ శాస్త్రవేత్తలు (Agricultural scientists ) డాక్టర్ ప్రియా, సుధీర్, శ్రీకృష్ణ, దిలీప్ అన్నారు. శనివారం షాబాద్ మండల పరిధిలోని తిమ్మారెడ్డిగూడ గ్రామంలో కృషి విజ్ఞాన కేంద్రం, కేంద్రీయ మెట్ట వ్యవసాయ పరిశోధనా సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో వికసిత కృషి సంకల్ప అభియాన్‌పై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు మాట్లాడుతూ ప్రధానంగా రైతులలో అభివృద్ధి చెందిన వ్యవసాయ సాంకేతికత, స్థిరమైన వ్యవసాయ విధానాల ద్వారా దిగుబడిని, ఆదాయాన్ని పెంచవచ్చని వివరించారు. అధిక దిగుబడి, అధిక లాభం కలిగించే తోటల సాంకేతికతలు, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, రోబోటిక్స్, కృత్రిమ మేధస్సు, ఆటోమేషన్ వంటి ఆధునిక సాంకేతికత ప్రయోగాలపై రైతులకు వివరించారు.
వ్యవసాయం, వనరుల సమర్థ వినియోగం, పంట ఆరోగ్యంపై నిఘా, ఆటోమేటెడ్ నీటి పారుదల వ్యవస్థలు, మెరుగైన వ్యవసాయ విధానాల గురించి నిపుణులు వివరించారు. ఇందులో ముఖ్యంగా రైతుల పొలాల నుంచి మట్టి నమునాలను శాస్త్రీయంగా సేకరించామన్నారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయశాఖ అధికారి వెంకటేశం, ఏఈవో గీత, ఉద్యానవన శాఖ అధికారి కీర్తికృష్ణ, రైతులు, తదితరులు పాల్గొన్నారు.