కుభీర్ : ఇటీవల కురిసిన వర్షాలకు పసుపు పంటలో పసుపు పంటకు ( Turmeric Crop ) దుంప కుళ్లు, తాటాకు మచ్చ తెగులు ఆశిస్తోందని వ్యవసాయ విస్తీర్ణ అధికారి ఎం. నారాయణ ( AEO Narayana ) పేర్కొన్నారు. నిర్మల్ జిల్లా కుభీర్ మండలంలోని జంగం పార్డి (కే) తదితర గ్రామాల్లో పంటలు సాగు చేసిన వ్యవసాయ క్షేత్రాలను స్థానిక రైతులతో కలిసి పరిశీలించారు.
పసుపు పంట ఆకులపై అక్కడక్కడా పెద్ద మచ్చలు ఏర్పడడంతో పాటు ముదురు గోధుమ రంగులోని మచ్చల చుట్టూ పసుపు రంగు వలయం ఏర్పడుతుందన్నారు. రైతులు పసుపు పంటలు సస్యరక్షణ చర్యలను చేపట్టడంతో పాటు ఇటీవల కురిసిన వర్షాల వల్ల పసుపు పంటలో నిల్వ ఉన్న నీటిని వెంటనే తొలగించాలని సూచించారు. ఈ తెగుళ్ల నివారణకు మచ్చలు ఉన్న, ఎండిన ఆకులను తొలగించి కాల్చివేయాలని పేర్కొన్నారు. లీటరు నీటిలో ఒక గ్రాము కార్బెండజిం లేదా 2.5 గ్రాముల మాంకోజెట్, 0.5 మి.లీ. సబ్బు నీరు లేదా ఒక గ్రామ్ థయోఫానేట్ మిథైల్ కలిపి 15 రోజుల వ్యవధిలో పిచికారీ చేయాలన్నారు.
ఇనుప ధాతు లోపం భూమిలో చౌడు, సున్నం, భాస్వరం ఎక్కువగా, సేంద్రియ పదార్థం తక్కువగా ఉన్న భూముల్లో ఇనుప ధాతులోపం కనిపిస్తుందన్నారు. దీనివల్ల ఆకులు తెల్లగా మారుతాయి. ఆకు పరిమాణం తగ్గి అంచుల కణజాలం దెబ్బతింటుంది. పంట చేతికొచ్చే సమయంలో దుంపలు, కొమ్ములు చిన్నవిగా తయారై నాణ్యత లోపిస్తుందని తెలిపారు.
దీని నివారణకు మడిలో మురుగునీరు పోయే సౌకర్యం కల్పించడంతో పాటు లీటరు నీటిలో 5 గ్రాముల ఫెర్రస్ సల్ఫేట్ లేదా 10 గ్రాముల అన్నభేది, ఒక గ్రాము నిమ్మ ఉప్పు కలిపి పైరుపై 15 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేసుకోవాలని సూచించారు. అనంతరం పలు రైతుల సోయా, పత్తి క్షేత్రాలను పరిశీలించి తగు సూచనలు సలహాలను అందజేశారు. ఆయా గ్రామాల్లో ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఎన్రోల్మెంట్ను ఆన్లైన్లో నమోదు చేశారు.