e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, October 22, 2021
Home వ్యవసాయం పిచికారీలో.. ఉపకారి!

పిచికారీలో.. ఉపకారి!

అందివస్తున్న ఆధునిక సాంకేతికత.. అన్నదాతకు ఆసరా అవుతున్నది. సినిమా చిత్రీకరణను, ఫొటోగ్రఫీని కొత్తపుంతలు తొక్కించిన ‘డ్రోన్‌’.. ఇప్పుడు సాగులోనూ యపడుతున్నది.వ్యవసాయంలో అత్యంత ప్రమాదకరమైన పనిగా చెప్పుకొనే ‘పురుగు మందుల పిచికారీ’ని తన రెక్కలపైకి ఎత్తుకొంటున్నది. రైతన్నకు ఖర్చుతోపాటు కూలీల తిప్పలూ తప్పిస్తున్నది.

తెలంగాణ ప్రభుత్వ సానుకూల నిర్ణయాలతో వ్యవసాయం పండుగలా మారింది. ఫలితంగా రాష్ట్రంలో ఏటేటా సాగు విస్తీర్ణం పెరుగుతున్నది. ఇదే సమయంలో ఇతర రంగాల్లోనూ ఉపాధి దొరుకుతున్నది. వెరసి, వ్యవసాయంలో కూలీల కొరత తీవ్రమవుతున్నది. ముఖ్యంగా ‘పురుగు మందుల పిచికారీ’కి మనిషి దొరకడం గగనమే అవుతున్నది. దొరికినవారికి కూడా రెట్టింపు కూలీ ఇవ్వాల్సి వస్తున్నది. అయితే, ఆధునిక సాంకేతికత ఈ సమస్యకు చెక్‌ పెడుతున్నది.

ఇదే పెద్ద ఇబ్బంది..

- Advertisement -

వ్యవసాయంలో చీడపీడల నివారణే పెద్ద సమస్య. సమయానికి పురుగు మందు చల్లకపోతే, తీవ్ర నష్టం తప్పదు. ఎక్కువ విస్తీర్ణంలో పంటలు సాగవుతుండటంతో పిచికారీ చేసే కూలీలు దొరకడం లేదు. దీంతో రైతులే సొంతంగా స్ప్రేయింగ్‌ పరికరాలు సమకూర్చుకొని, పనులు చేసుకోవాల్సి వస్తున్నది. చిన్న, సన్నకారు రైతులకు ఈ పరికరాల కొనుగోలు తలకు మించిన భారమవుతున్నది. ఎక్కువ భూమి ఉన్నవారికి కూడా ఇబ్బందులు తప్పడం లేదు. కూలీల రేట్లు పెరగడం, సమయానికి కూలీలు దొరక్కపోవడంలాంటి సమస్యలు వారిని వేధిస్తున్నాయి. దీంతోపాటు, పిచికారీ చేసిన వ్యక్తులపై పురుగు మందుల ప్రభావం పడుతుండటం కూడా ఆందోళన కలిగిస్తున్నది. ముఖ్యంగా పత్తిచేన్లలో రసాయన పిచికారీ సందర్భంగా ఊపిరాడక కూలీలు చనిపోయిన సందర్భాలూ ఉన్నాయి.

‘డ్రోన్‌’తో చెక్‌..

ఈ సమస్యలన్నిటికీ ఇప్పుడు డ్రోన్లు చెక్‌ పెడుతున్నాయి. ఒకప్పుడు రక్షణ శాఖలో ఆ తర్వాత సినిమాల చిత్రీకరణ, ఫొటోగ్రఫీలో పాలుపంచుకొన్న డ్రోన్లు.. ఇప్పుడు వ్యవసాయంలోనూ అడుగుపెట్టాయి. ముఖ్యంగా పురుగు మందుల పిచికారీలో ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి. వీటి వినియోగంపై వ్యవసాయ శాఖ ప్రయోగాలు విజయవంతమయ్యాయి. వీటి అవసరాన్ని గుర్తించిన పలు సంస్థలు వ్యవసాయ డ్రోన్ల తయారీని ప్రారంభించాయి. సంస్థను బట్టి ఒక్కో డ్రోన్‌ రూ.5 లక్షల నుంచి రూ.8 లక్షల వరకూ పలుకుతున్నది. కొందరు యువకులు వీటిని కొనుగోలు చేసి, అద్దె ప్రాతిపదికన సేవలను అందిస్తున్నారు. ఇందుకోసం ఎకరానికి రూ.400 నుంచి రూ.600 వరకూ తీసుకొంటున్నారు. మామూలు కూలీలతో పోలిస్తే ఈ మొత్తం తక్కువే కావడంతో, రైతులు కూడా డ్రోన్లవైపే మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా, ఓవైపు నిరుద్యోగ యువతకు ఉపాధి దొరకడంతోపాటు రైతులకూ మేలు చేకూరుతున్నది. పంటల సస్యరక్షణ పరంగానూ డ్రోన్ల వినియోగం ఎంతో మంచిదని వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులూ చెబుతున్నారు.

‘నిట్‌’లో డ్రోన్‌ టెక్నాలజీ..

అన్ని రంగాల్లోనూ డ్రోన్ల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో, భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా వీటిని అభివృద్ధి చేసేలా చర్యలు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా వరంగల్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(నిట్‌)లో ‘డ్రోన్‌ టెక్నాలజీ డెవలప్‌మెంట్‌ సెంటర్‌’ ఏర్పాటు కానున్నది. ఈ ప్రాజెక్టుకు ఇప్పటికే కేంద్ర మానవ వనరుల శాఖ ఆమోదం తెలిపింది. వరంగల్‌ నిట్‌లోని సీఎస్‌ఈ, ఈసీఈ బ్రాంచ్‌ల సమన్వయంతో సివిల్‌ ఇంజినీరింగ్‌ విభాగం ఆధ్వర్యంలో ‘డ్రోన్‌ టెక్నాలజీ డెవలప్‌మెంట్‌ సెంటర్‌’ స్థాపన పనులు చకచకా జరుగుతున్నాయి. హైదరాబాద్‌ ఐఐటీలోనూ డ్రోన్‌ టెక్నాలజీ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ ఏర్పాటు ప్రక్రియ గతేడాదే మొదలైంది. ప్రజల అవసరాలకు తగ్గట్టుగా డ్రోన్లను డిజైన్‌ చేసేలా ‘డ్రోన్‌ టెక్నాలజీ డెవలప్‌మెంట్‌ సెంటర్‌’ను తీర్చిదిద్దుతున్నట్లు నిట్‌ డైరెక్టర్‌ ఎన్‌.వి.రమణారావు తెలిపారు. అందుకు అనుగుణంగా వరంగల్‌ నిట్‌లో పరిశోధనలనూ పెంచుతామని చెప్పారు.

తేడాలు.. లాభాలు..

  • బురద పొలాల్లో పురుగు మందులను పిచికారీ చేయడం కష్టం. డ్రోన్‌తోనైతే మడిలో అడుగు పెట్టకుండానే పని పూర్తవుతుంది.
  • ప్రస్తుతం స్ప్రేయింగ్‌ పనికోసం ఒక కూలీకి రూ.600 నుంచి రూ.850 వరకు చెల్లించాల్సి వస్తున్నది. పంపులో నీరు పోసేందుకు మరో కూలీ కావాలి. అదే, డ్రోన్‌తో రూ.500తోనే ఎకరానికి పురుగుమందు పిచికారీ అయిపోతుంది.
  • మామూలు పంపుతో ఎకరం పొలానికి పిచికారీ చేయడానికి 160 లీటర్ల నీరు అవసరమవుతుంది. డ్రోన్‌తో అయితే 15 లీటర్ల నీటితోనే పూర్తవుతుంది.
  • బ్యాటరీ పంపుతో మూడు గంటలయ్యే పనిని, డ్రోన్‌తో ఏడు నిమిషాల్లో పూర్తి చేయవచ్చు. అది కూడా అదనపు మనిషి అవసరం లేకుండానే!
  • మామూలు పంపులతో పిచికారీ చేసిన వ్యక్తిపై పురుగు మందుల ప్రభావం ఉంటుంది. డ్రోన్‌ వల్ల ఈ సమస్య ఉండదు.

ఖర్చు తక్కువే

మొదటిసారి నా పొలంలో డ్రోన్‌తో పురుగు మందు పిచికారీ చేయించిన. కూలీలతో పోలిస్తే ఖర్చు తక్కువే అయ్యింది. బ్యాటరీ పంపు కంటే తక్కువ మందు పట్టింది. పొలానికి కూడా మంచిగ పట్టింది. రైతులకు ఇది అవసరమే. తక్కువ సమయంలోనే మందు కొట్టుడు అయిపోయింది. ఇంతకుముందైతే రోజంత పట్టేది. పొద్దంత తిప్పలు పడేది. ఇప్పుడు ఏ సమస్యా లేదు.
కొమ్మిడి పెరుమాళ్‌రెడ్డి, ఎల్కతుర్తి, హనుమకొండ జిల్లా.

ఉపాధినిచ్చింది..

డిగ్రీ తర్వాత డ్రోన్‌ను కొనుగోలు చేసి, స్వయం ఉపాధిని పొందుతున్నా. ఏ పంట అయినా, రోజుకు 15 ఎకరాల వరకూ స్ప్రే చేయవచ్చు. చెట్లు, స్తంభాలు లేకపోతే 20 ఎకరాల వరకూ పురుగు మందులు కొట్టొచ్చు. మందు కూడా పొలానికి బాగా పడుతుంది. డ్రోన్‌ కొనుగోలుకు రూ.6.50 లక్షల దాకా అవుతుంది. అయినా, డిమాండ్‌ ఉన్నది కాబట్టి పెట్టుబడి త్వరలోనే తిరిగి వచ్చేస్తుంది.
ఎ.సంతోష్‌ రావు, డ్రోన్‌ నిర్వాహకులు

పిన్నింటి గోపాల్‌/ గూడూరి కొండల్‌ రెడ్డి

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement