నిర్మల్ చైన్గేట్, జూలై 26 : స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం సన్నాహాలు చేస్తున్నది. సెప్టెంబర్ 30వ తేదీలోగా ఎన్నికల ప్రక్రియ చేపట్టాలని హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులతో ప్రభుత్వం ఈ ప్రక్రియను ముమ్మరం చేసింది. జిల్లా ప్రజా పరిషత్, జడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ స్థానాలు ఖరారు అయ్యాయి. నిర్మల్ జిల్లాలో 18 జడ్పీటీసీ స్థానాలు, 157 ఎంపీటీసీ స్థానాలు ఉండగా.. ఇందులో గతంలో పోల్చితే ఒక ఎంపీటీసీ స్థానం పెరిగింది. మొత్తం పోలింగ్ కేంద్రాలు 892 ఏర్పాటు చేశారు.
ఈసారి బ్యాలెట్లో నోటాకు చోటు
రాబోయే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను బ్యాలెట్ ద్వారా నిర్వహించనున్నారు. ఇందులో నోటా ముద్రించేందుకు ఎన్నికల సం ఘం ఆదేశించింది. ఇప్పటికే జిల్లా స్థాయి అధికారులు ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ఒకేసారి నిర్వహించనున్నారు. జడ్పీటీసీ బ్యాలెట్ పేపరు తెలుపు రంగు, ఎంపీటీసీ బ్యాలెట్ పేపరు గులాబీ రంగులో ముద్రించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇప్పటికే జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలపై స్పష్టత రావడంతో వాటి నియోజకవర్గాలవారీగా ఓటర్ల విభజన పూర్తి చేశారు. స్థానాలు ఖరారు కావడంతో అధికారులు రిజర్వేషన్ల ఏర్పాటుపై దృష్టి సారిస్తున్నారు. 42 శాతం బీసీలకు రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రభుత్వం ఆర్డినెన్సు చేసి గవర్నర్ ఆమోదం కోసం పంపింది. ఆమోదం అనంతరం రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తి చేయనున్నారు.