కుమ్రం భీం ఆసిఫాబాద్, మే 18 (నమ స్తే తెలంగాణ) : ఆసిఫాబాద్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో జడ్పీ చైర్మన్ కోనేరు కృష్ణారావు అధ్యక్షతన.. కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే, అదనపు కలెక్టర్ దీపక్ తివారీ ఆధ్వర్యంలో శనివారం జరిగిన జడ్పీ సమావేశం గరం గరంగా సాగింది. ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, హరీశ్‌బా బు, సభ్యులు అధికారుల తీరుపై మండిపడ్డారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రజా సమస్యలు పరిష్కారం కావడం లేదని, అభివృద్ధి ఆగిపోతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు అధికారులు సమాధానాలు చెప్పలేపోయారు. ముఖ్యంగా అటవీ, పంచాయతీరాజ్, మైనింగ్, వైద్యాధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. అటవీ అధికారుల దురుసు ప్రవర్తన వల్ల గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారని, గ్రామాలకు రోడ్లు వేయకుండా, కనీసం తాగునీటికి బోర్లు వేయకుండా అడ్డుకుంటున్నారని చెప్పుకొచ్చారు.
ఇక ఇంజినీరింగ్ అధికారుల వైఖరితో అభివృద్ధి పనులు ఆగిపోతున్నాయన్నారు. టెండర్లు జరిగినా పనులు ప్రారంభించడం లేదని తెలిపారు. జిల్లా లో ఇసుక మాఫియా చెలరేగిపోతున్నదని, మైనింగ్ అధికారుల అవినీతి వల్లే రోజూ వందల లారీల్లో ఇసుక తరలిపోతుందని, రాత్రి వేళల్లో ఆదిలాబాద్ ప్రాంతానికి తీసుకెళ్లి విక్రయిస్తున్నారని, అనుమతి లేకుండా ఇసుక తరలిస్తుంటే మైనింగ్ అధికారులు ఎందుకు స్పందించడం లేదని సభ్యులు ప్ర శ్నించారు. మెడికల్ కళాశాలలో ఔట్ సో ర్సింగ్ ఉద్యోగాలు ఏ ప్రాతిపదికన ఇచ్చారని ప్రశ్నించారు.
జిల్లాతో సంబంధం లేని వ్యక్తికి ఔట్ సోర్సింగ్ ఏజెన్సీని అప్పజెప్పటం వల్ల ఇష్టానుసారంగా నియమాకాలు జరుగుతున్నాయన్నారు. ఐదుగురు సభ్యుల కమిటీతో ఔట్సోర్సింగ్ ఉద్యోగులను భర్తీచేయాల్సి ఉండగా, ఏజెన్సీ వాళ్లు ఇష్టానుసారంగా పో స్టులను భర్తీచేశారని ఆరోపించారు. దీనిపై వి చారణ జరిపించాలని డిమాండ్ చేశారు. రోడ్డు పనులు చేపడుతున్న కాంట్రాక్టర్లు మ ధ్యలోనే ఆపేస్తున్నారని, ఒక్కో కాంట్రాక్టర్ పదుల సంఖ్యలో పనులు తీసుకుంటున్నారని, పనులు త్వరగా పూర్తిచేసేలా కాంట్రాక్టర్లపై ఒత్తిడి తీసుకువచ్చే పరిస్థితి కూడా అధికారుల్లో లేదన్నారు. పనులను అర్ధాంతరంగా నిలిపివేసిన కాంట్రాక్టర్లను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టాలని సభ్యులు డిమాండ్ చేశారు.
ఆసిఫాబాద్ అటవీ డివిజన్ అధికారి అప్పల కొండను సరెండర్ చేసేందుకు స భ్యులు తీర్మానించారు. ఆసిఫాబాద్ డివిజన్లో జరుగుతున్న అభివృద్ధి పనులను అడ్డుకునేలా వ్యవహరిస్తున్నారని, తరతరాలుగా అడవుల్లో ఉంటున్న గ్రామాలకు రోడ్లు వేయకుండా, కనీసం తాగునీటి వసతి కల్పించకుండా అడ్డుకోవడమేమిటని మండిపడ్డారు. పట్టాలు కలిగిన భూముల్లో కూడా వ్యవసా యం చేయకుండా అడ్డుకుంటున్నారని ఆసిఫాబాద్ ఎమ్మెల్యేతో పాటు ఇతర సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆసిఫాబాద్ డివిజనల్ అటవీ అధికారిని సరెండర్ చేయాలని సభ్యులు తీర్మానించారు.
అటవీ అధికారుల తీరుతో అదివాసీలకు తీరని అన్యాయం జరుగుతోంది. కనీసం తాగునీటి కోసం బోర్లు కూడా గిరిజన గ్రామాల్లో వేయలేని పరిస్థితి వచ్చింది. అటవీ హక్కుల పట్టాలున్న భూముల్లో కూడా గిరిజనులు సాగు చేసుకోలేక పోతున్నారు. డీఎఫ్‌వోకు ఫోన్ చేస్తే స్పందించడం లేదు. వందేళ్ల క్రితం నుంచి అడవుల్లో ఉంటున్న గిరిజన గ్రామాలకు కూడా రోడ్డు వేయలేని పరిస్థితి ఎందుకొస్తుంది. ముఖ్యంగా ఆసిఫాబాద్ అటవీ డివిజన్ అధికారి తీరుతో ఆదివాసీలు అనేక ఇబ్బందులు పడుతున్నారు.
అడవుల్లో చేపట్టే పనులకు అడ్డురాని చట్టాలు ఆదివాసీల గ్రామాలకు రోడ్డువేస్తే ఎందుకు అడ్డువస్తున్నాయి. ఇటీవల రెబ్బెన మండలం తుంగెడ గ్రామ శివారులో పట్టా భూముల్లో సాగుచేసుకుంటున్న గిరిజనులపై అటవీ అధికారులు దాడులు చేసి కేసులు పెట్టారు. తిర్యాణి మండలం గుండాల గిరిజనులు దవాఖానకు వెళ్లడానికి కూడా దారిలేకుండా చేశారు. పెన్షన్ తీసుకోవడానికి కూడా 30 కిలోమీటర్లు నడిచి వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది. ఆదివాసీలు తిరగబడితే అటవీ అధికారులు అడవుల్లో తిరుగ గలరా. అడవుల్లో స్మగ్లింగ్ చేస్తున్న అసలు దొంగలు అటవీ అధికారులే. డీఎఫ్‌వో అప్పల కొండని సరెండర్ చేయాలి.
– కోవ లక్ష్మి, ఎమ్మెల్యే, ఆసిఫాబాద్
ధాన్యం కొనుగోళ్లపై వ్యవసాయ, మార్కెటింగ్ అధికారులు నిర్లక్ష్యంగా వహిస్తున్నారు. జిల్లాల్లో 31 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా ఉంటే, ఇప్పటి వరకు కేవలం 2 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మాత్రమే సేకరించారు. మిగతా ధాన్యం ఇంకెప్పుడు సేకరిస్తారు. మరో 20 రోజుల్లో వర్షాల వస్తాయి. అధికారుల తీరువల్ల ప్రైవేట్ వ్యాపారులకు ధాన్యాన్ని అమ్ముకోవాల్సి వస్తుంది. కొనుగోలు కేంద్రాల్లో తూకాల్లో కూడా భారీ మోసాలు జరుగుతున్నాయి.
దహెగాంలోని ఒడ్డుగూడ కొనుకొగోలు కేంద్రంలో తూకంలో మోసాలకు పాల్పడ్డ వారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలి. ఇప్పటికైనా అధికారులు కొనుగోలు కేంద్రాలను పెంచి ధాన్యం త్వరగా కొనుగోలు చేయాలి. కాగజ్‌నగర్‌లో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారాయి. 288 ఇండ్లను త్వరగా లబ్ధిదారులకు ఇవ్వాలి. అటవీ అధికారుల వల్ల నిలిచిపోయిన రోడ్ల పనులు తిరిగి ప్రారంభించాలి. ఆర్అండ్బీ అధికారులకు సాధ్యం కాకపోతే పనుల బాధ్యతలను తమకు అప్పగించాలి. – హరీశ్‌బాబు, ఎమ్మెల్యే, సిర్పూర్