నార్నూర్ : ములిగే నక్కపై తాడిపండు పడ్డచందంగా తయారైంది రైతన్న దుస్థితి. వర్షాభావ పరిస్థితుల్లో ఎడతెరిపి లేని వర్షాలతో పత్తి ( Cotton ) పంటకు తెగుళ్లు ముసురుకొని ఆశించిన దిగుబడి ప్రశ్నార్థకంగా మారింది. పత్తి విక్రయించాలనే పత్తి రైతుల పరిస్థితి అగమ్య గోచారంగా మారింది.
ఆదిలాబాద్ ( Adilabad ) జిల్లా నార్నూర్, గాదిగూడ, లోకారి కే.మేడిగూడ, తాడిహత్నూర్ మార్కెట్లలో పత్తి కొనుగోలు బహిరంగంగానే చిల్లర కాంట వ్యాపారం జోరందుకుంది. జీరో దందా( Zero business ) బహిరంగ విచ్చలవిడిగా సాగుతున్న మార్కెటింగ్ అధికారులు, ప్రజా ప్రతినిధులు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. లైసెన్సు కలిగిన వ్యాపారస్తులు కనీసం మార్కెట్ యార్డులో పంట కొనుగోలు చేయలని ఆదేశించిన దాఖాలాలు కనిపించడం లేదు.

జీరో దందా చేసే వ్యాపారస్తులు మామూళ్లతో నోరు కట్టేస్తున్నట్లు విమర్శలు వెలువెత్తు తున్నాయి. నాణ్యత కలిగిన క్వింటాలు పత్తికి రూ.8,110 ప్రభుత్వం చెల్లిస్తుంది. ప్రైవేటులో దళారులు రూ.6 వేల నుంచి రూ. 6,100 వరకు చెల్లిస్తున్నారు. దీంతో రైతు క్వింటాలుకు రెండు వేలు నష్టపోయే పరిస్థితి. కనీసం పత్తి తేమ శాతాన్ని పరిశీలించడం లేదని, ప్రశ్నిస్తే తేమ సాకుతో పాటు తడిసిన పత్తి అంటూ నమ్మిస్తున్నారని రైతులు వాపోయారు. లేదంటే పత్తిని తీసుకెళ్లడంటూ దళారులు చెప్పుతుండడంతో రైతులు దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.
చేసేది ఏమీ లేక తప్పని పరిస్థితుల్లో దళారులకే విక్రయిస్తున్నారు. ఇక్కడ కొనుగోలు చేసినా మార్కెట్లో కొనుగోలు చేసిన పత్తిని మహారాష్ట్రకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. రైతులకు పక్కా బిల్లులకు బదులు చిట్టి పై రాసిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నత అధికారులు స్పందించి పత్తి పంటను మార్కెట్ యార్డులోనే కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటే కనీసం రైతులకు మేలు జరిగే అవకాశం ఉంటుందని ఉమ్మడి మండలం రైతులు పేర్కొన్నారు.