మందమర్రి రూరల్, ఆగస్టు 23 : సింగరేణి అభివృద్ధి కొత్తగా ఉద్యోగంలో చేరే యువతీ, యువకులపైనే ఆధారపడి ఉన్నదని మందమర్రి జీఎం చింతల శ్రీనివాస్ అన్నారు. జీఎం కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం 26 మందికి కారుణ్య నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ ఇప్పటి వరకు ఏరియాలో 1433 మందికి కారుణ్య నియామకాలు ఇచ్చినట్లు చెప్పారు. సీఎం కేసీఆర్ కృషి ఫలితంగా ఉద్యోగాలు పొందుతున్నామన్న విషయాన్ని మరువద్దని సూచించారు. ఉద్యోగం పొందడం అదృష్టంగా భావించాలన్నారు. ఈ కార్యక్రమంలో పీఎం వరప్రసాద్, టీబీజీకేఎస్ ఏరియా ఉపాధ్యక్షుడు మేడిపల్లి సంపత్, ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి సలేంద్ర సత్యనారాయణ, డీవై పీఎం శ్యామ్ సుందర్, సీనియర్ పీవో సత్యబోసు, వోఎస్ రాయలింగు తదితరులు పాల్గొన్నారు.
ఆర్జీ-1లో 23 మందికి..
గోదావరిఖని, ఆగస్టు 23 : పెద్దపల్లి జిల్లా ఆర్జీ-1 ఏరియాలోని జీఎం కార్యాలయంలో జీఎం కే నారాయణ 23 మందికి కారుణ్య నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సింగరేణిలో కొత్తగా చేరిన యువ ఉద్యోగులు కంపెనీ పురోభివృద్ధికి కృషిచేయాలని సూచించారు. ఇందులో నలుగురు మహిళలు, 19 మంది పురుషులు ఉండగా, అందరికీ ఆర్జీ-1 ఏరియాలోనే పోస్టింగ్ ఇచ్చినట్లు తెలిపారు. సంస్థ భవిష్యత్ యువ ఉద్యోగుల చేతుల్లోనే ఉన్నదన్నారు. ప్రతి ఒక్కరూ పనిని ప్రత్యక్ష దైవంగా భావించి విధులకు హాజరవ్వాలని, అలాగే ఉద్యోగావకాశం కల్పించిన తల్లిదండ్రులను గౌరవించాలని సూచించారు. ఇక్కడ సీఎంవోఏఐ అధ్యక్షుడు పొనగోటి శ్రీనివాస్, డీజీఎం పర్సనల్ లక్ష్మీనారాయణ, టీబీజీకేఎస్ నాయకులు ఇందూరి సత్యనారాయణ, ఎస్వో వీరారెడ్డి, పర్సనల్ అధికారి శ్రావణ్, సూపరింటెండెంట్ మల్లీశ్వర్ తదితరులు ఉన్నారు.