 
                                                            సోన్, అక్టోబర్ 30 : నిర్మల్ జిల్లా సోన్ మండలంలోని న్యూవెల్మల్ గ్రామానికి చెందిన ప్రవీణ్‌కుమార్(35) రహదారులపై ఆరబోసిన సోయా కుప్పల పైనుంచి పడి మృత్యువాత పడ్డాడు. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. నిర్మల్ జిల్లా సోన్ మండలంలోని న్యూవెల్మల్ గ్రామానికి చెందిన ప్రవీణ్‌కుమార్ నిర్మల్ పట్టణంలోని ఓ ప్రైవేటు దవాఖానలో విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో బుధవారం రాత్రి విధులకు వెళ్తున్నాడు.
నిర్మల్ మండలంలోని అక్కాపూర్ వద్ద రైతులు రోడ్లపై సోయా పంట ఉత్పత్తులను ఆరబోశారు. వర్షం పడుతుండడంతో వాటిపై నల్లని టార్పాలిన్లను కప్పారు. ప్రవీణ్ వెళ్తున్న ద్విచక్ర వాహనం సోయా ఉత్పత్తులపై నుంచి వెళ్లడంతో అదుపు తప్పి తారు రోడ్డుపై ఎగిరి పడ్డాడు. దీంతో తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ప్రవీణ్ భార్య హారిక ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. ప్రవీణ్‌కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.
 
                            