కేంద్ర ఎన్నికల సంఘం(సీఈసీ) ఓటర్ల జాబితాను విడుదల చేసింది. నిర్మల్ జిల్లావ్యాప్తంగా 7,11,190 మంది ఉండగా.. ఇందులో పురుష ఓటర్లు 3,44,458 మంది, మహిళలు 3,66,683, ఎన్ఆర్ఐలు 17, థర్డ్ జెండర్స్ 49, సర్వీస్ ఓటర్లు 930 మంది ఉన్నారు. ప్రధానంగా కొత్తగా ఓటు నమోదు చేసుకున్న వారి నుంచి 39 ఏండ్లలోపు వారు 3,78,533 మంది ఉన్నారు. మహిళలతోపాటు యువత కూడా అధికంగా ఉండడంతో అభ్యర్థుల భవితవ్యం వీరి చేతుల్లోనే ఉంది. వీరే రాజకీయ నేతల తలరాతను మార్చనున్నారు. మహిళల, యువత మద్దతును కూడ గట్టుకునేందుకు అన్ని పార్టీలు పోటీ పడుతున్నప్పటికీ, బీఆర్ఎస్ పార్టీ ముందు వరుసలో ఉంది. కాగా.. కొత్త ఓటరు నమోదుకు ఈనెల 31 వరకు గడువు ఉండగా.. నామినేషన్ల స్వీకరణకు పది రోజుల ముందు వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ఫలితంగా యువ ఓటర్ల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
– నిర్మల్, అక్టోబర్ 21(నమస్తే తెలంగాణ)
నిర్మల్, అక్టోబర్ 21(నమస్తే తెలంగాణ) : వచ్చే శాసనసభ ఎన్నికల్లో యువత, మహిళా ఓట్లే కీలకం కానున్నాయి. ఈ ఎన్నికల్లో అభ్యర్థుల భవిత వారిపైనే ఆధారపడి ఉంది. దీంతో కొత్తగా ఓటు హక్కు నమోదు చేసుకున్న వారి నుంచి 39 ఏండ్లలోపు ఉన్న వారిపై అభ్యర్థులు ప్రత్యేక దృష్టి సారించారు. మూడు నియోజకవర్గాల్లోనూ పురుషుల కంటే మహిళా ఓటర్లే అధిక సంఖ్యలో ఉన్నారు. దీంతో ఇప్పుడు అందరి దృష్టి వీరిపైనే ఉంది. ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం(సీఈసీ) విడుదల చేసిన తుది ఓటరు జాబితా ప్రకారం జిల్లాలో మొత్తం ఓటర్లు 7,11,190 మంది ఉండగా, 18 నుంచి 39 ఏండ్లలోపు వారు 3,78,533 మంది ఉన్నారు. మరోవైపు మహిళలు నిర్ణయాత్మక పాత్ర పోషించనున్నారు. జిల్లా వ్యాప్తంగా పురుష ఓటర్లు 3,44,458 మంది ఉండగా, మహిళా ఓటర్లు 3,66,683 మంది ఉన్నారు.
ఎన్ఆర్ఐ ఓటర్లు 17 మంది, థర్డ్ జెండర్ ఓటర్లు 49 ఉండగా, సర్వీస్ ఓటర్లు 930 మంది ఉన్నారు. జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లోనూ పురుషుల కంటే మహిళా ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉన్నది. ఖానాపూర్ నియోజకవర్గంలో పురుష ఓటర్లు 1,06,985 మంది ఉండగా, మహిళా ఓటర్లు 1,10,667 మంది ఉన్నారు. అలాగే నిర్మల్ నియోజకవర్గంలో పురుషులు 1,17,563 మంది ఉండగా, మహిళలు 1,29,914 మంది ఉన్నారు. ముథోల్ నియోజకవర్గంలో పురుష ఓటర్లు 1,19,910 మంది ఉండగా, మహిళా ఓటర్లు 1,26,102 మంది ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయా పార్టీలు యువతతోపాటు మహిళలను ప్రసన్నం చేసుకోవడంపై దృష్టి సారించాయి. వీరే రాజకీయ నేతల తలరాతను మార్చనున్నారు. కీలకమైన మహిళలు, యువత మద్దతు తమకే అంటూ అన్ని పార్టీలు చెప్పుకుంటున్నప్పటికీ, బీఆర్ఎస్ అందరి కంటే ముందున్నది.
వచ్చే నెల 30న జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం తుది జాబితాను విడుదల చేసింది. ఇందులో జిల్లాలోని మూడు నియోజకవర్గాల పరిధిలో మొత్తం 7,11,190 మంది ఓటర్లు ఉన్నారు. కొత్త ఓటర్లు ఓటు హక్కు నమోదు చేసుకునేందుకు ఈ నెల 31 వరకు గడువు ఉంది. నామినేషన్ల స్వీకరణకు పది రోజుల ముందు వరకు ఓటర్లు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. దీంతో యువ ఓటర్ల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
నిర్మల్ జిల్లాలోని యువ ఓటర్లపైనే ప్రస్తుతం అందరి దృష్టి కేంద్రీకృతమైంది. జిల్లావ్యాప్తంగా మొత్తం 3,78,533 మంది యువ ఓటర్లు ఉన్నారు. 18 నుంచి 29 ఏండ్ల వయసు ఉన్న ఓటర్లు 1,81,306 మంది ఉన్నారు. వీరిలో పురుష ఓటర్లు 95,293 మంది ఉండగా, మహిళా ఓటర్లు 86,013 మంది ఉన్నారు. అలాగే 30 నుంచి 39 ఏండ్ల వయసు ఉన్న ఓటర్లు 1,97,227 ఉన్నారు. వీరిలో పురుష ఓటర్లు 96,509 మంది ఉండగా, మహిళా ఓటర్లు 1,00,718 మంది ఉన్నారు. జిల్లాలో మొత్తం 3,78,533 మంది యువ ఓటర్లు ఉన్నారు. కాగా జిల్లాలోని నిర్మల్, ముథోల్ నియోజకవర్గాల్లో ఎక్కువగా యువ ఓటర్లు ఉన్నారు. ముథోల్లో అత్యధికంగా 1,31,292 మంది ఉండగా, నిర్మల్లో 1,26,391 మంది ఉన్నారు. అలాగే ఖానాపూర్ నియోజకవర్గంలో 1,20,850 మంది యువ ఓటర్లు ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని నియోజకవర్గాల్లో భారీ సంఖ్యలో ఉన్న ఈ యువ ఓటర్లను తమవైపు ఎలా తిప్పుకోవాలని ఇప్పటి నుంచే రాజకీయ పార్టీలు కసరత్తు చేస్తున్నాయి.