కుమ్రం భీం ఆసిఫాబాద్(నమస్తే తెలంగాణ)/ బెజ్జూర్, మార్చి 9 : కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని బెజ్జూర్ మండల కేంద్రానికి 15 కిలోమీటర్ల దూరంలోనున్న జీవనది ప్రాణహిత ఏడాదంతా ప్రవహిస్తూనే ఉం టుంది. పక్కనే ప్రాణహిత ఉన్నా పొలాలకు మాత్రం నీటి చుక్క అందడం లేదు.
బెజ్జూర్ మండలంలో దాదా పు 30 మంది రైతులు 100కు పైగా బోర్లు వేశారు. 300-400 అడుగుల లోతుకు వేసినప్పటికీ ఒక్క బోరులో కూడా నీటి చుక్క కనిపించడం లేదు. తమ ప్రాంతంలో సారవంతమైన భూములున్నప్పటికీ భూగర్భ జలాలు అడుగంటి కేవలం వర్షాధార పంటలకు మాత్రమే పరిమితం అవుతున్నామని రైతులు పేర్కొంటున్నారు. మండలంలో గొల్లబాయి చెరువు, స్ప్రింగానికల్ మత్తడి ఉన్నప్ప టికీ వీటి ద్వారా కూడా వర్షాకాలంలో తప్పా మిగతా కాలంలో నీరు అందడం లేదు.
నాకు ఎల్కపల్లి శివారులో రెండున్నర ఎకరాలు ఉంది. ఈ ఏడాది మూడు బోర్లు వేసిన. ఒక్కదాంట్లో కూడా నీళ్లు పడ్డది లేదు. ఒక్కో బోరును దాదాపు 300 ఫీట్ల నుంచి 350 ఫీట్ల వరకు వేయించిన. అయినా నీళ్లు పడలేదు. బోర్లు వేయడానికే దాదాపు రూ. 2 లక్షల వరకు ఖర్చు చేసిన. నాకు తెలిసి చుట్టుపక్కల ఉన్న 30 మంది రైతులు బోర్లు వేసిన్రు. ఒక్కరికీ నీళ్లు పడలేదు.
– కాంట్రంగి భీమయ్య, ఎల్కపల్లి, బెజ్జూర్
ఈ చిత్రంలో కనిపిస్తున్న రైతు పేరు ఏలేశ్వరం వెంకటయ్య. బెజ్జూర్ గ్రామం. తనకున్న ఐదెకరాల్లో ఇప్పటి వరకు మూడు బోర్లు వేశాడు. ఒక్క బోరులో కూడా నీరు పడలేదు. బోర్ల కోసం దాదాపు రూ. 3 లక్షలు ఖర్చుచేశాడు. చివరకు చేసేదేమి లేక వర్షాధార పంటపైనే ఆధారపడుతున్నాడు. సారవంతమైన భూమి, గత ప్రభుత్వం తన పొలంలో నుంచి వేసిన ఉచిత విద్యుత్ లేన ఉన్నా యాసంగి పంట పండించుకోలేని దుస్థితిలో ఉన్నాడు.