ఆదిలాబాద్ రూరల్, జూన్ 25 : గత ప్రభుత్వాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమాన్ని విస్మరించాయని, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. ఆదిలాబాద్ రూరల్ మండలంలోని చాందా(టీ) గ్రామంలో నూతనంగా నిర్మించిన ఎస్సీ కమ్యూనిటీ హాల్‌ను ఎమ్మెల్యే జోగు రామన్న ఆదివారం ప్రారంభించారు. అనంతరం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నూతన విగ్రహా ఏర్పాటుకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 55 ఏళ్లలో గత ప్రభుత్వాలు చేయలేని అభివృద్ధి, మార్పును సీఎం కేసీఆర్ నాయకత్వంలో తీసుకు రాగలిగామని చెప్పారు. అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం దేశానికి దిక్సూచిగా నిలుస్తున్నదన్నారు.
బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రజల సొమ్మును కార్పొరేట్లకు ధారాదత్తం చేశాయని మండిపడ్డారు. ప్రజల సంక్షేమాన్ని విస్మరించాయని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమానికి పెద్దపీట వేసిన ఏకైక నాయకుడు సీఎం కేసీఆర్ మాత్రమేనని తెలిపారు.కేంద్రంలోని బీజేపీ ప్రభు త్వంలో ఒక్క బీసీ మంత్రి కూడా లేకపోవడం ఆ పార్టీ చిత్తశుద్ధికి నిదర్శనమి విమర్శించారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, ఎంపీపీ గండ్రత్ రమేశ్, జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షుడు రోకండ రమేశ్, మాజీ మార్కెట్ చైర్మన్ మెట్టు ప్రహ్లాద్, ఆరె నరేశ్ పాల్గొన్నారు.
రక్తదానం ప్రాణదానంతో సమానం
ఎదులాపురం,జూన్25: రక్తదానం ప్రాణదానంతో సమానమని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. రిమ్స్ ఆడిటోరియంలో కిరాణం అండ్ జనరల్ వర్కర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం మెగారక్తదాన శిబిరం ఏర్పాటు చేయగా ఎమ్మెల్యే ప్రారంభించారు. రక్తదాతలను అభినందించారు. వారికి సర్టిఫికెట్లు అందించారు. డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, డీఎంహెచ్‌వో నరేందర్ రాథోడ్, వైద్యుడు తిప్పస్వామి, దుర్గం ట్రస్ట్ చైర్మన్ దుర్గం శేఖర్, కిరణం అండ్ జనరల్ వర్కర్స్ అసోసియేషన్ వ్యవస్థాపకుడు దాదాసాహెబ్ జబాడే, అధ్యక్షుడు గణేశ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మెట్టుప్రహ్లాద్ ఉన్నారు.
సమస్యల పరిష్కారానికి చర్యలు
లారీ ఓనర్లు, డ్రైవర్ల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే జోగు రామన్న స్పష్టం చేశారు. ఇటీవల ఆదిలాబాద్ లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యవర్గాన్ని ఎన్నుకోగా ఆదివారం ప్రమాణ స్వీకారమహోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికైన మహ్మద్ అక్బర్, జనరల్ సెక్రటరీ పట్వాన్ సర్దార్ సింగ్‌తో పాటు సభ్యులను సన్మానించి నియామకపత్రాలు అందజేశారు. ఎమ్మెల్యేను సైతం నిర్వాహకులు సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లారీ ఓనర్ల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. రానున్న ఎన్నికల్లో గులాబీ జెండా ఎగుర వేయడం ఖాయమని దీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నాయకులు, సాజిద్ ఉద్దీన్, అష్రఫ్ పాల్గొన్నారు.