నర్సాపూర్(జీ), జూలై 14: అడవిబిడ్డల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని రాష్ట్ర అటవీ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. శుక్రవారం నిర్మల్ జిల్లా నర్సాపూర్(జీ)లో నూతనంగా ఏర్పాటు చేసిన హరితనిధి మోడల్ నర్సరీ, అటవీ శాఖ భవనాన్ని ఆయన ప్రారంభించారు. అటవీ శాఖ ఆద్వర్యంలో నాటిన మొక్కలను పరిశీలించి, మొక్కలు నాటారు. రూ.2కోట్ల 30లక్షలలో నిర్మించే స్దానిక కేజీబీవీ కళాశాల భవన నిర్మాణం, రూ.52 లక్షలతో ప్రహరీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కేజీబీవీని పరిశీలించారు. అనంతరం బూర్గుపల్లి, అంజనితండా, గొల్లమాడ గ్రామాల 62 మంది లబ్ధిదారులకు పోడుభూముల పట్టాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 37,000 మందికి పోడు పట్టాల ద్వారా లబ్ధి చేకూరుతుందని తెలిపారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా 24 గంటల ఉచిత కరంట్, రైతుబందు, బీమా లాంటి సంక్షేమ పథకాలు అందిస్తున్నది తెలంగాణ ప్రభుత్వం మాత్రమేనని అన్నారు. కాంగ్రెస్ నాయకులు చెబుతున్నట్లు 3 గంటల కరంట్ సరిపోతుందా అని రైతులను ప్రశ్నించారు. ఉచిత కరంట్ సౌకర్యంతోనే జిల్లాలో రైతులు 300కోట్ల విలువైన వరిని పండించారని పేర్కొన్నారు. కార్యక్రమంలో ముథోల్ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి, తెలంగాణ ఐడీసీ చైర్మన్ సముద్రాల వేణుగోపాలాచారి, ఆర్డీవో స్రవంతి, డీఈవో రవీందర్ రెడ్డి, ఎంపీపీ కొండ్ర రేఖ, వైస్‌ఎంపీపీ లక్ష్మి, జడ్పీటీసీ చిన్న రామయ్య, సర్పంచ్ రాంరెడ్డి, ఆర్బీఎస్ జిల్లా సభ్యులు కొండ్ర రమేశ్, గంగారెడ్డి, గంగారాం, బీఆర్ఎస్ మండల కన్వీనర్ రాజేశ్వర్, ఎంపీటీసీలు మల్లేశ్, రవి, డీఎఫ్‌వో సునీల్, ఎఫ్ఎస్వో అలేఖ్య, అనుపమ పాల్గొన్నారు.
తెలంగాణ వచ్చాకే వ్యవసాయాభివృద్ధి
నిర్మల్ టౌన్, జూలై 14: తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే వ్యవసాయరంగం వృద్ధి చెందిందని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. నిర్మల్‌లోని వ్యవసాయ మార్కెట్ యార్డులో రూ. 60లక్షలతో చేపడుతున్న వ్యాపార సముదాయానికి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో కలెక్టర్ వరుణ్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక రమణ, మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, ఎంపీపీ రామేశ్వర్‌రెడ్డి, ఎఫ్ఏసీఎస్ చైర్మన్ ధర్మాజి రాజేందర్, ఎఫ్ఏసీఎస్ మాజీ చైర్మన్ రాంకిషన్‌రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్‌చైర్మన్ శ్రీకాంత్‌యాదవ్, బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు మారుగొండ రాము, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
భీమారెడ్డి, రాంరెడ్డిల జీవితాలు ఆదర్శప్రాయం
లక్ష్మణచాంద, జూలై 14: నల్ల భీమారెడ్డి, నల్ల రాంరెడ్డిల జీవితాలు ఆదర్శప్రాయమని మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని వడ్యాల్ గ్రామంలో నల్ల భీంరెడ్డి, నల్ల రాంరెడ్డిల విగ్రహాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నల్ల భీంరెడ్డి నిర్మల్ సమితి ప్రెసిడెంట్‌గా జిల్లాకు ఎన్నో సేవలందించారని కొనియాడారు. భీంరెడ్డి బాటలోనే ఆయన కుమారుడు నల్లా రాంరెడ్డి వడ్యాల్ గ్రామాభివృద్ధికి ఎంతో కృషి చేశారన్నారు. వారి జీవితాలు యువతకు ఆదర్శప్రాయమన్నారు. కార్యక్రమంలో నిర్మల్ మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, నిర్మల్ ఎంపీపీ రామేశ్వర్‌రెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మెన్ రాంకిషన్ రెడ్డి, వైస్‌చైర్మన్ రఘునందన్ రెడ్డి, బీఆర్ఎస్ మండల ఇన్చార్జి అల్లోల సురేందర్ రెడ్డి, బీఆర్ఎస్ మండల కన్వీనర్ కొరిపెల్లి కృష్ణారెడ్డి, సర్పంచ్ అట్ల లలిత, వైస్ ఎంపీపీ నల్లా కల్పనారాంరెడ్డి, మాజీ ఎంపీపీ నల్లా నరేందర్ రెడ్డి, నాయకులు నరేశ్ రెడ్డి, అట్ల రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
బాలల సంరక్షణ అందరి బాధ్యత
నిర్మల్ అర్బన్, జూలై 14 : బాలల సంరక్షణ అందరి బాధ్యత అని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్‌లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో వరల్డ్ విజన్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో బాలల సంరక్షణ వారోత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన ప్రచార రథాన్ని శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాల కార్మికులను పనిలో పెట్టుకోకూడదని, ప్రమాదకరమైన పనుల్లో ఉంచుకున్నట్లయితే యజమానులకు కఠిన శిక్ష ప్రభుత్వం అమలు చేస్తుందని తెలిపారు.అధికారులే కాకుండా ప్రజలు సైతం బాలలను సంరక్షించాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, ఎంపీపీ రామేశ్వర్ రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి సత్యనారాయణ, వరల్డ్ విజన్ స్వచ్ఛంద సంస్థ సభ్యులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.