శ్రీరాంపూర్, ఏప్రిల్ 24 : భానుడి భగభగలతో కోల్బెల్ట్ ప్రాంతం నిప్పుల కొలిమిలా మారింది. శ్రీరాంపూర్, బెల్లంపల్లి, మందమర్రి ఏరియాలతో పాటు జైపూర్ విద్యుత్ కేంద్రం, సిరామిక్స్, సిమెంట్ పరిశ్రమల ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఉపరితల గనుల్లో బొగ్గును వెలికి తీయడానికి ప్రతిరోజూ టన్నులకొద్ది పేలుడు పదార్థాలు వినియోగిస్తుంటారు.
ఫలితంగా గాలి వేడెకి సాధారణం కన్నా ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఆయా ప్రాంతాల్లో నిల్వ చేసే బొగ్గు ప్రభావం కూడా వాతావరణంపై పడుతుంది. ఇక గనుల్లో పనిచేసే కార్మికులు వేడిమికి తట్టుకోలేక విలవిల్లాడుతున్నారు. విధులు నిర్వహించలేని పరిస్థితి ఉందని, విధుల సమయాలు మార్చాలని డిమాండ్ చేస్తున్నారు.