మందమర్రిరూరల్, జూన్ 27 : డబుల్ బెడ్ రూం ఇండ్ల తుది జాబితా నుంచి తన పేరు తొలగించారంటూ ఓ మహిళ మంచిర్యాల జిల్లా మందమర్రి తహసీల్దార్ కార్యాలయం ఎదుట శుక్రవారం పెట్రోల్ సీసాతో ఆందోళన చేసింది. క్యాతనపల్లి మున్సిపాలిటీకి చెందిన పూరెల్లి లక్ష్మి పేరు డబుల్ బెడ్ రూం ఇండ్ల జాబితాలో వచ్చింది. ఆపై తన పేరు తొలగించారని ఆరోపిస్తూ పెట్రోల్ సీసాతో తహసీల్దార్ కార్యాలయం వద్దకు చేరుకుంది. తనకు డబుల్బెడ్రూం ఇల్లు మంజూరు చేయాలని తహసీల్దార్‌కు వినతి పత్రం అందించింది.
దరఖాస్తు పరిశీలించిన ఆయన అర్హత ఉంటే తప్పకుండా ఇల్లు మంజూరవుతుందని సమాధానం ఇచ్చారు. ఆపై తహసీల్దార్ చాంబర్‌నుంచి బయటకు వచ్చిన ఆమె వెంటనే ఇల్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఒంటిపై పెట్రోల్ పోసుకుంది. అక్కడున్న కార్యాలయం సిబ్బంది అప్రమత్తమై ఆమెను నిలువరించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆమెను సముదాయించి ఇంటికి పంపించారు. ఈ ఘటనపై స్పందించిన తహసీల్దార్ శనివారం క్షేత్రస్ధాయిలో విచారణ జరిపి లక్ష్మికి న్యాయం జరిగేలా చూస్తానని తెలిపారు.