కుభీర్ : నిర్మల్ ( Nirmal) జిల్లా కుభీర్ మండలం రంజని తండా సమీప శివారు గుట్టల్లో భారీ అగ్నిప్రమాదం (Wildfires ) సంభవించి గుట్టలోని చెట్లు, పొదలు, మేత అటవీ సంపద అగ్నికి ఆహుతి అవుతోంది. ప్రమాదవశాత్తూ జరిగిందా లేక ఎవరైనా అడవిలో నిప్పంటించారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
అడవిలో మంటలు చెలరేగడంతో గుట్టపై ఉన్న చెట్లు, పొదలు భారీగా కాలిబూడిదయ్యాయి. ఎండల తీవ్రత దృష్ట్యా మంటలు వేగంగా వ్యాపిస్తూ అటవీ సంపదకు తీవ్ర నష్టం కలిగిస్తున్నాయని అటవీ అధికారులు పట్టించుకోవడంలేదని గ్రామస్థులు పేర్కొన్నారు.
గుట్టపై ఉన్న విలువైన వృక్షాలు, పశువుల మేత అంతా అగ్నికి ఆహుతవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. మంటలు అదుపులోకి రాకపోవడంతో పరిసర ప్రాంత ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వెంటనే అటవీ శాఖ అధికారులు స్పందించి, మంటలను అదుపు చేసేందుకు చర్యలు చేపట్టాలని, అటవీ సంపదను కాపాడాలని రంజని తండా వాసులు కోరుతున్నారు.