మంచిర్యాల, డిసెంబర్ 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : జిల్లా ఎమ్మెల్యేలైన గడ్డం బ్రదర్స్ తమ రాజకీయ జీవితంలో ఎన్నడూ లేని విధంగా మాల సామాజిక వర్గంపై అమితమైన ప్రేమ ఒలకబోస్తుండడంపై అనేక రకాలుగా ప్రచారం జరుగుతున్నది. ముఖ్యంగా వివేక్ మంత్రి పదవి కోసమే ఆ సామాజిక వర్గాన్ని వాడుకుంటున్నారన్న విమర్శలు వెల్లువెత్తు తుండగా, స్థానికంగా చర్చనీయాంశమవుతున్నది. ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించి న మాలల సింహగర్జన సభలో ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా వివేక్ మాట్లాడారం టూ మాదిగ సామాజికవర్గం అగ్గి మీద గుగ్గిలమవుతున్నది. రాజకీయ స్వార్థం కోసమే ఏబీసీడీల వర్గీకరణను ఆపాలని చూస్తున్నారంటూ మండిపడుతున్నది. ఈ నేపథ్యంలో కొన్ని రోజులుగా మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా మాదిగల నుంచి నిరసన వ్యక్తమవుతున్నది. మంత్రి పదవి కోసం దళిత సోదరుల మధ్య చిచ్చుపెడుతున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది.
ఎంపీ ఎన్నికల సమయంలో పెద్దపల్లి పార్లమెంట్ టికెట్‌ను గడ్డం వంశీకి ఇవ్వడాన్ని దళిత ఐక్య వేదిక నాయకులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ నియోజకవర్గంలో మాదిగలకు మూడు లక్షల ఓట్లు ఉన్నాయని, అందుకే టికెట్ మాదిగ సామాజిక వర్గానికి చెందిన నాయకులకే ఇవ్వాలంటూ పట్టుపట్టారు. ప్రెస్మీట్లు పెట్టడం, నిరసనలకు దిగడంతో ఎట్టకేలకే గడ్డం కుటుంబం దిగిరావాల్సి వచ్చింది. ఆ సమయంలో మాదిగ సామాజిక వర్గం నాయకులను పిలిపించుకొని మాట్లాడి మరీ వారి మద్దతు కూడగట్టుకున్నారు. ఎంపీగా వంశీ గెలిచాక మాదిగల అవసరమే తమకు లేదన్నట్లు వివేక్ మాట్లాడుతున్నారంటూ ఆ సామాజిక వర్గం నాయకులు అంటున్నారు.
రాజకీయంగా అవసరం ఉన్నప్పుడు ఒకలా.. అవసరం తీరిపోయాక మరోలా వ్యవహరించడం గడ్డం ఫ్యామిలీకి అలవాటైపోయిందని మండిపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి మాదిగలు ముందు నుంచి అనుకూలంగా ఉంటూ వచ్చారని.. వర్గీకరణ కోసం ఎన్నో ఏళ్లుగా పోరాటాలు చేస్తున్నారని గుర్తించాలంటున్నారు. మాదిగ వ్యతిరేకిగా మారిపోయిన గడ్డం ఫ్యామిలీకి మంత్రి పదవి ఇస్తే ఊరుకునేదే లేదంటూ హెచ్చరిస్తున్నారు.
ఈ వ్యవహారం ఎమ్మెల్యే వివేక్‌కు తలనొప్పిగా మారింది. చెన్నూర్ నియోజకవర్గంలోని మాదిగ సామాజిక వర్గం నాయకులంతా ఆయన వ్యవహారశైలిపై మండిపడుతున్నారు. గడ్డం వెంకట స్వామి దళితులందరినీ ఒకటిగా చూశారు తప్పితే ఎప్పుడూ వేరు చేసి మాట్లాడ లేదని, వివేక్ తీరుతో మాదిగ సోదరులకు సమాధానం చెప్పలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడూ లేనిది మాలల మీద ఉన్నఫలంగా ఎందుకంత ప్రేమ పుట్టుకొచ్చిందో వివేక్ చెప్పాలంటూ ప్రశ్నిస్తున్నారు. కేవలం మంత్రి పదవి కోసమే సామాజిక వర్గాన్ని వాడుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. మాలలు దగ్గరైతే మంచిదే కానీ మాదిగలకు అన్యాయం చేయాల్సిన అవసరం వివేక్ ఏమిటని ప్రశ్నిస్తున్నారు.
చిలికి చిలికి గాలి వాన అయినట్లు మాలల వ్యవహారం వివేక్‌కు ఇప్పుడు పెద్ద తలనొప్పిగా మారింది. సామాజిక వర్గంలో తన బలం చూపించుకుంటే మంత్రి పదవి వస్తుందనుకున్నారో.. లేకపోతే ఇది ఇంత సీరియస్ అవుతుందని ముందే గుర్తించలేకపోయారో ఏమో కానీ వివేక్ పేరు చెబితేనే జిల్లాలోని మాదిగలు మండిపడుతున్నారు. ఎస్సీ వర్గీకరణ సాధించుకుంటామని, వివేక్ ఏం చేసినా వర్గీకరణను ఆపలేరంటూ రోజుకో దగ్గర నిరసనలు తెలుపుతూ, పత్రికా ప్రకటనలు విడుదల చేస్తుండడం జిల్లాలో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
సోదరుల్లా కలిసిమెలిసి ఉంటున్న మాల, మాదిగల మధ్య చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ గొడవలు సృష్టి స్తున్నారు. కేవలం మంత్రి పదవి కోసమే మాలలను వాడుకుం టున్నారు. ఏ ఒక్క మాల కుటుం బానికైనా ఆయన న్యాయం చేశారా ఆత్మవిమర్శ చేసుకోవాలి. సుప్రీం కోర్టు తీర్పునే త ప్పుపట్టేంత అవసరం ఏమొచ్చింది. ఎస్సీ వర్గీకరణను అడ్డు కోవడం ఎవరితోనూ కాదు. వచ్చే ఎన్నికల్లో మాదిగ జాతి వివేక్‌కు తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధం అవుతున్నది.
– కలగూర రాజ్‌కుమార్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు, భీమారం
వివేక్‌కు మాలల మీద నిజమైన ప్రేమ ఉంటే ఇన్ని రోజులు వాళ్లు ఎందుకు గుర్తుకురాలేదు. అద్దంకి దయాకర్‌కు టికెట్ ఇవ్వనప్పుడు ఎందుకు మౌనం వహించారు. ఏ రకంగా ఎస్సీల ఏబీసీడీ వర్గీకరణనకు అడ్డుకుంటారు. కేవలం మంత్రి పదవి కోసమే వివేక్ ఈ కుట్రలు, పన్నాగాలు పన్నుతున్నారు. మా జనాభా దామాషాను అనుసరించి హక్కుల కోసం పోరాడుతున్నాం. మాలలకు.. మాకు ఎలాంటి శత్రుత్వం లేదు. చెన్నూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిచి ఏడాది కాలంలో చేసింది ఏం లేదు. ప్రజలు ఆ విషయంలో ఎక్కడ నిలదీస్తారో అన్న భయంతోనే కొత్తడ్రామా ఆడుతూ మాదిగ జాతికి అన్యాయం చేయాలని చూస్తున్నరు. ఈ విషయాలన్నీ మాల, మాదిగ మేధావులు ఆలోచించాలి. దళితుల మధ్య చిచ్చుపెట్టే కుట్రలను ఖండించాలి.
– ఆసంపెల్లి సంపత్‌కుమార్, దళిత నాయకుడు