నిర్మల్ అర్బన్, పిబ్రవరి 23 : యాదాద్రి తరహాలో దక్షిణ భారత దేశంలో ప్రసిద్ధిగాంచిన బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ అమ్మవారి ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ప్రధాన ఆలయ పునర్నిర్మాణ ప్రక్రియ చేపట్టాలని సీఎం కేసీఆర్ దిశా నిర్దేశం చేశారు. ఈ నేపథ్యంలో మంత్రి అల్లోల ఆదేశానుసారం బాసర ఆలయ బృందం శృంగేరి పీఠాధిపతుల మార్గదర్శనం, ఆగమ నిర్దేశం కోసం వెళ్లింది. ఈ బృందం ఇటీవల బాసరకు తిరిగి రాగా, గురువారం శాస్త్రినగర్‌లో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముందుగా ఆలయ అభివృద్ధి, విస్తరణ ప్లాన్‌తో పాటు, ప్రతిపాదనలను పీఠాధిపతి విదుశేఖర భారతీ స్వామి ముందు ఉంచినట్లు మంత్రికి బృందం తెలిపింది.
అనంతరం ఇప్పుడున్న గర్భాలయాన్ని కృష్ణశిలలతో అద్భుతంగా నిర్మించడం, సరస్వతీ అమ్మవారి దర్శనం అనంతరం పక్కనే ఉన్న మహాలక్ష్మి అమ్మవారి ప్రతిమ కనిపించేలా ప్రత్యేక నిర్మాణం, మహంకాలీ అమ్మవారి ప్రతిమ వెనుక ప్రాకార మండపం, లోపల శివాలయ పునఃప్రతిష్ట, దత్తాత్రేయ స్థల మార్పిడి నలుదిక్కులా రాజగోపురాల నిర్మాణం, ధ్వజ స్తంభం ఏర్పాటు, ఆలయ ప్రాంగణంలోనే యాగశాల ఏర్పాటు వంటి వాటిపై పీఠాధిపతి పలు మార్పులు, చేర్పులు చేసి, సూచనలు అందించారని వివరించింది. కాగా, మంత్రి మాట్లాడుతూ.. పీఠాధిపతి సూచనలు పాటించాలని, అందుకు అనుగుణంగా ఆలయ పునర్నిర్మాణం ప్లాన్ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే క్యూ కాంప్లెక్స్, కార్యనిర్వాహక అధికారి కార్యాలయం, 100 గదుల చౌల్ట్రీ, దాతల సాయంతో నిర్మించే 50 వసతి గదులు, ఇతర నిర్మాణాలకు సంబంధించిన ప్రత్యేక మాస్టర్ ప్లాన్ రూపొందించాలని సూచించారు.
ఆలయ పునర్నిర్మాణం ప్లాన్‌తో పాటు, మాస్టర్ ప్లాన్‌ను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఆయన ఆదేశాల మేరకు పనులు చేపడుతామని వెల్లడించారు. సమీక్షలో ఈవో విజయ రమారావు, స్థపతి వల్లి నాయగం, ఎస్ఈ మల్లికార్జున్ రెడ్డి, ఆలయ చైర్మన్ శరత్ పాఠక్, స్థానాచార్యులు, పూజారులు తదితరులున్నారు.