ఠచెన్నూర్, డిసెంబర్ 1: తమకు కనీస వసతులు కల్పిస్తేనే పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద గల ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌కు వెళ్లి కూరగాయలు విక్రయిస్తామని వ్యాపారులు, మహిళలు ఆందోళన చేపట్టారు. ఈ మేరకు సోమవారం చెన్నూర్ మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించి నిరసన తెలిపారు. చెన్నూర్ పట్టణంలోని జగన్నాథస్వామి ఆలయం ముందు గల కూడలిలో రహదారి పక్కన కూరగాయల మార్కెట్‌ను నిర్వహిస్తున్నారు. కొన్నేళ్లుగా ఆ రోడ్డుకు ఇరువైపులా కూర్చొని వ్యాపారులు కూరగాయలను విక్రయిస్తున్నారు.
వీరి కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అప్పటి ప్రభుత్వ విప్ బాల్క సుమన్ కృషితో పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద ఇంటిగ్రేటెడ్ మార్కెట్ భవన నిర్మాణాన్ని చేపట్టారు. గత అసెంబ్లీ ఎన్నికల వరకు ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణ పనులు శరవేగంగా సాగగా, ఎన్నికల అనంతరం కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో పనులు నిలిచిపోయాయి. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ భవనం అసంపూర్తిగా మిగిలిపోయింది. ఈ భవనంలోనే కూరగాయలు విక్రయించాలని రోడ్ల పక్కన కూర్చోవద్దని వ్యాపారులను రెండు రోజుల క్రితం మున్సిపాలిటీ కమిషనర్ మురళీకృష్ణ ఆదేశించారు. లేదంటే కూరగాయలను చెత్త బండ్లలో వేసి డంప్ యార్డుకు తరలిస్తామని హెచ్చరించారు. అసంపూర్తి భవనాన్ని ఎలా కేటాయిస్తారని వ్యాపారులు మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించి ఆందోళన చేశారు.
ఈ సందర్భంగా కూరగాయల వ్యాపారులు మాట్లాడుతూ కనీస వసతులు కల్పించకుండా ఇంటిగ్రేటెడ్ మార్కెట్లో విక్రయించాలని మున్సిపాలిటీ కమిషనర్ మురళీకృష్ణ తమను ఆదేశించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. వ్యాపారాలు చేసుకోకుండా తమను మున్సిపల్ కమిషనర్ ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటిగ్రేటెడ్ మార్కెట్లో కనీస వసతులు కల్పిస్తేనే తాము వెళ్తామని, ఇబ్బందులకు గురిచేస్తే ఆందోళనలు ఉధృతం చేస్తామన్నారు.