మంచిర్యాల అర్బన్, జూన్ 18 : కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ కార్యకర్తల జోలికి వస్తే ఊరుకునేదేలేదని బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య హెచ్చరించారు. మంగళవారం బెల్లంపల్లిలో జరిగిన భూ వివాదంలో గాయపడి మంచిర్యాల ప్రభుత్వ దవాఖానలో చికిత్సపొందుతున్న పాత బెల్లంపల్లికి చెందిన పనాస గణేశ్, పనాస లక్ష్మిని ఆయన పరమార్శించారు. గొడవకు సంబంధించిన పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ మంచిర్యాల జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ నాయకుల ఆగడాలు రోజు రోజుకీ మితిమీరిపోతున్నాయన్నారు. గడ్డం ఫ్యామిలీకి మంత్రి పదవి ఇచ్చిన తర్వాత చెన్నూర్, బెల్లంపల్లి నియోజకవర్గంలో దాడులు ఎకువయ్యాయన్నారు. బెల్లంపల్లి నియోజకవర్గంలోని కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే వినోద్ అండ చూసుకొని బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త పనాస గణేశ్.. అతడి కుటుంబసభ్యులపై మంగళవారం రాత్రి కాంగ్రెస్ గూండాలు, మాజీ జడ్పీటీసీ రాంచందర్ అనుచరులు ఆయుధాలతో దాడి చేశారన్నారు.
కన్నెపల్లి, వేమనపల్లి మండలాల్లో సైతం బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని, అక్కడి పోలీస్ వ్యవస్థ ప్రేక్షకపాత్ర వహిస్తున్నదని, వాళ్లే దాడులు చేసి వాళ్లే కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. గత 30 ఏండ్లుగా రాజకీయాల్లో ఉన్నానని, ఎన్నో పార్టీలు, ఎన్నో ప్రభుత్వాలు మారాయని, ఏ ప్రభుత్వంలో ఉన్నా.. అధికారులు 60 శాతం ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తే.. 40 శాతం న్యాయానికి సపోర్ట్ చేస్తారన్నారు. కానీ, ఇప్పుడున్న పరిస్థితులు.. ఎప్పుడూ చూడలేదని.. ప్రభుత్వ అధికారులు కాంగ్రెస్ వాళ్లు ఏది చెబితే.. అదే చేస్తున్నారు తప్ప చట్టం, న్యాయం, ధర్మం చూడడం లేదని అవేదన వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఇదే పద్ధతి తాము చేసుంటే కాంగ్రెస్ వాళ్లు ఎవ్వరూ ఉండేవారు కాదని, కనీసం బొకలగుట్ట దాటే వారు కాదని వెల్లడించారు. రాష్ట్రంలో రాక్షసపాలన నడుస్తున్నదని, బీఆర్ఎస్ నాయకత్వంపై ఈడీ కేసులు పెట్టించి, నోటీసులిచ్చి ఇబ్బందుల పాలు చేస్తున్నారని, అదే పద్ధతిలో నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అరాచకం చేస్తున్నారని, ఇదంతా ప్రజలు గమనిస్తున్నారన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించి.. కాంగ్రెస్ అభ్యర్థులను పాతాల లోకంలో పాతిపెట్టాలని పిలుపునిచ్చారు. రామగుండం సీపీ ఈ ఘటనపై విచారణ జరిపించి దోషులపై చట్టపరంగా చర్యలు తీసుకొని బాధితులకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ మారెట్ చైర్మన్ పల్లె భూమేశ్, మంచిర్యాల పట్టణ అధ్యక్షుడు గాదె సత్యం, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.