సీసీసీ నస్పూర్, ఏప్రిల్ 21: కార్మిక సమస్యలు పరిష్కరించే వరకూ పోరాడుతామని టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి కే సురేందర్‌రెడ్డి, ఏరియా ఉపాధ్యక్షుడు పెట్టం లక్ష్మణ్ అన్నారు. సింగరేణిలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి చేపట్టే ఆందోళన కార్యక్రమాలకు సంబంధించిన పోస్టర్‌తో పాటు ఈ నెల 27న వరంగల్‌లో నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభ పోస్టర్లను సోమవారం నస్పూర్-శ్రీరాంపూర్ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు విడుదల చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బొగ్గు గనుల వేలం, సింగరేణి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా, కార్మికులకు మెరుగైన వసతుల కోసం మంగళవారం గనులు, ఓసీపీల్లో అధికారులకు వినతిపత్రాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. 25న జీఎం కార్యాలయాల ఎదుట ధ ర్నా చేపట్టనున్నట్లు తెలిపారు. అండర్‌గ్రౌండ్, ఓపెన్‌కాస్ట్ గనుల్లో ప్రైవేటీకరణను పూర్తిగా నిలిపివేయాలని, సింగరేణి గనులను వేలం ప్రక్రియను నిలిపివేసి, గుజరాత్లో కేటాయించినట్లుగా నామినేషన్ పద్ధతిలో సింగరేణికి గనులను కేటాయించాలన్నారు. ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ అనేక వాగ్ధానాలు చేసి ఒక్కటి కూడా నెరవేర్చలేదన్నారు.
టీబీజీకేఎస్ హయాంలో రాష్ట్ర తొలి సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో కారుణ్య నియామకాలు, ఇంటర్నల్, ఎక్స్టర్నల్ ద్వారా వేలాది మందికి ఉద్యోగాలు కల్పించినట్లు చెప్పారు. యూనియన్ బలోపేతం, రజతోత్సవ సభ సక్సెస్‌పై ఈ నెల 23న గోదావరిఖని కేంద్ర కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశామని, ఈ సమావేశానికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హాజరు కానున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో నాయకులు పానుగంటి సత్తయ్య, పొగాకు రమేశ్, అన్వేష్‌రెడ్డి, ఎండీ లాలా, బానోతు రాజునాయక్, గడ్డం మహిపాల్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, సాదుల భాస్కర్, గోపాల్, తోట నరేశ్, జైపాల్‌రెడ్డి, సతీశ్‌యాదవ్, సల్మాన్, తిరుపతిరెడ్డి, కిరణ్, తదితరులు పాల్గొన్నారు.
ఆర్కే న్యూటెక్ గనిపై ప్రచారం
శ్రీరాంపూర్, ఏప్రిల్ 21 : ఈ నెల 27న బీఆర్ఎస్ రజతోత్సవ సభపై ‘చలో వరంగల్’ పోస్టర్లను అంటించి సోమవారం శ్రీరాంపూర్ ఆర్కే న్యూటెక్ గనిపై టీబీజీకేఎస్ నాయకులు గని పిట్ కార్యదర్శి ఉప్పాల సంపత్, కేంద్ర కమిటీ సభ్యుడు బుద్ది ప్రసాద్, జనరల్ షిప్ట్ ఇన్చార్జి ఆడ్లూరి అనిల్, నాయకుడు జయకృష్ణ ప్రచారం చేశారు. సింగరేణిలో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ నెల 25 టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో అన్ని జీఎం ఆఫీస్‌ల ఎదుట ధర్నాలకు సంబంధించిన పోస్టర్ల కూడా అంటించారు. సింగరేణి కార్మికులకు కేసీఆర్ అనేక హక్కులు కల్పించారని గుర్తు చేశారు.