బెల్లంపల్లి : పెంచిన బస్ చార్జీలను(Bus Fare) , బస్ పాసులను (Bus Pass) తగ్గించకపోతే బస్ భవన్‌ను ముట్టడిస్తామని ఎంసీపీఐయూ ( MCPIU) పార్టీ, ఏఐఎఫ్డీఎస్ నాయకులు ( AIFDS Leaders) సబ్బని రాజేంద్రప్రసాద్, పసు లేటి వెంకటేష్ హెచ్చరించారు. బస్సు చార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ బుధవారం బెల్లంపల్లి ఆర్డీవో కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ గురవయ్యకు వినతి పత్రం సమర్పించారు.
అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణలో కల్లబొల్లి మాటలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల్ని మోసం చేయడమే ఎజెండాగా పెట్టుకొని, మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు చందంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. ఆర్థిక భారంతో సతమతమవుతున్న సామాన్య ప్రజలు, విద్యార్థులపై, చార్జీల భారాన్ని మోపుతూ తీవ్ర ఇబ్బందులకు, మనోవేదనకు గురి చేస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. అరకొర జీతాలతో ఇతర ప్రాంతాలకు వెళ్తూ వస్తు కుటుంబం పోషించుకుంటున్న సామాన్య ప్రజలపై ఈ బస్ చార్జీల భారాన్ని మోపడం దారుణమని ఆరోపించారు.
బస్సులలో రద్దీని తగ్గించే విధంగాబస్సులను పెంచే ఆలోచన ప్రభుత్వం చేయాలి కానీ బస్ చార్జీల పెంపు పేరుతో బస్సులలో రద్దీని తగ్గించడం అనేది ప్రభుత్వ అనాలోచిత విధానానికి నిదర్శనమని విమర్శించారు. విద్యాలయాలు ప్రారంభం కానున్న తరుణంలో విద్యార్థుల బస్‌పాస్ చార్జీలను పెంచడంతో విద్యార్థులు విద్యకు దూరం అయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బెల్లంపల్లి పట్టణ కార్యదర్శి ఆరేపల్లి రమేష్, సబ్బని రాజశేఖర్, తోగరి రాహుల్, తదితరులు పాల్గొన్నారు .