మంచిర్యాల అర్బన్ : రాజకీయాలకు అతీతంగా మున్నూరు కాపు ( Munnuru Kapu ) సామాజిక వర్గం అభివృద్ధికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సర్దార్ పుట్టం పురుషోత్తం రావు పటేల్( Purushotham Rao Patel) పిలుపునిచ్చారు. ఆదివారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని నార్త్ఇన్ హోటల్లో నిర్వహించిన మున్నూరు కాపు సంక్షేమ సంఘం సమావేశంలో ఆయన మాట్లాడారు.
రాష్ట్రంలో మున్నూరు కాపుల జనాభా గణనీయంగా ఉన్నప్పటికీ, వారికి తగిన రాజకీయ, సామాజిక, ఆర్థిక అవకాశాలు మరింత పెరగాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన మున్నూరు కాపు కార్పొరేషన్ ద్వారా విద్య, ఉపాధి, స్వయం ఉపాధి, సంక్షేమ పథకాలు సమర్థవంతంగా అమలు కావాలని కోరారు. సంఘం బలోపేతానికి ప్రతి ఒక్కరూ ఐక్యంగా పనిచేయాలని, పార్టీలు, వ్యక్తిగత విభేదాలకు అతీతంగా సమాజ అభివృద్ధినే ప్రధాన లక్ష్యంగా పెట్టుకోవాలని సూచించారు.
రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన జనగణన సర్వే లో మున్నూరు కాపుల సంఖ్యను తక్కువ చూపెట్టారని రాష్ట్ర స్థాయి నుంచి జిల్లా, పట్టణ, గ్రామ స్థాయిలో ప్రత్యేక సర్వే నిర్వహించి మున్నూరు కాపుల సంఖ్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని పేర్కొన్నారు. మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి పటేల్ మాట్లాడుతూ ప్రతి జిల్లాలో మున్నూరు కాపుల కోసం ఆత్మగౌరవ భవనాలు నిర్మించాలని, హైదరాబాద్లో రాష్ట్ర స్థాయి భవనం ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఈ కార్యక్రమంలో మంచిర్యాల మేయర్ ధరణి మధుకర్, రాష్ట్ర కార్యదర్శి, ఆసిఫాబాద్ జిల్లా ఇన్చార్జి గాదె సత్యం, జిల్లా ఇన్చార్జి ఇందురి తిరుపతి, జిల్లా అధ్యక్షుడు చిట్ల సత్యనారాయణ, రాష్ట్ర ఉపాధ్యక్షుడు అంబులపు శ్రీనివాస్, నియోజకవర్గ వర్కింగ్ ప్రెసిడెంట్ తూముల నరేష్, కరీంనగర్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సొత్తు మల్లేశ్, రాష్ట్ర కార్యనిర్వహక తదితరులు పాల్గొన్నారు.