కుమ్రం భీం ఆసిఫాబాద్, జూలై 30 (నమస్తే తెలంగాణ) : కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు అడవుల్లోని జలపాతాలు కనువిందు చేస్తున్నాయి. చుట్టూ దట్టమైన అడవి.. ఎత్తైన కొండల పై నుంచి పాల నురగలవలే జాలువారే నీటి ధారలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. గుండాల, చింతలమాదార, మిట్టె, మద్దిగూడ జలపాతాలు ఆహ్లాదం పంచుతుండగా, రాష్ట్ర నలుమూలల నుంచి తరలివస్తున్న సందర్శకులతో ఆయా ప్రాంతాలు సందడిగా కనిపిస్తున్నాయి. కాగా, ప్రస్తుతం వానలు పడుతుండగా, ఆయా ప్రాంతాల్లో ప్రమాదాలు జరిగే అవకాశాలుండగా అధికారులు హెచ్చరిస్తున్నారు.
తిర్యాణి మండలంలోని గుండాల జలపాతం సరికొత్త అందాలకు వేదికైంది. దాదాపు 60 అడుగుల ఎత్తు నుంచి కిందకు దూకే పాల నురగల్లాంటి ధారలు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. జిల్లా కేంద్రం నుంచి సుమారు 60 కిలోమీటర్ల దూరంలోనున్న తిర్యాణి మండల కేంద్రానికి వెళ్లాలి. అక్కడి నుంచి గుండాల జలపాతం దాదాపు 19 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. తిర్యాణి మండల కేంద్ర నుంచి 10 కిలో మీటర్ల దూరంలో ఉన్న రోంపపల్లి గ్రామం వరకు బస్సులో వెళ్లవచ్చు. అక్కడి నుంచి దాదాపు 9 కిలోమీటర్ల కాలినడకన వెళ్లాల్సి ఉంటుంది.
తిర్యాణి మండలంలోని పండిగి మాదార జలపాతం 60 అడుగుల పై నుంచి బండపరుపులపై దుంకుతూ.. ఆపై కిందకు ప్రవహిస్తూ ఉంటుంది. జిల్లా కేంద్రం నుంచి దాదాపు 60 కిలోమీటర్ల దూరంలోనున్న తిర్యాణి మండల కేంద్రానికి చేరుకోవాలి. అక్కడి నుంచి 15 కిలోమీటర్లు బస్సులోగాని, ఇతర ప్రైవేటు వాహనాల్లోగాని మాదారం గ్రామం వరకు వెళ్లవచ్చు. అక్కడి నుంచి మూడు కిలోమీటర్లు కాలినడకన వెళ్తే ఈ జలపాతాన్ని చూడవచ్చు.
లింగాపూర్ అడవుల్లో ఉన్న మిట్టె జలపాతాలను.. సప్త గుండాలు అని కూడా పిలుస్తుంటారు. ఇక్కడి అడవుల్లో ఒకదాని తర్వాత ఒకటి.. ఇలా ఏడు జలపాతాలు ఉన్నాయి. దట్టమైన అటవీప్రాంతం వల్ల రెండు జలపాతాలను మాత్రమే చూసే అవకాశముంది. జిల్లా కేంద్రం నుంచి సుమారు 80 కిలోమీటర్ల దూరంలోనున్న లింగాపూర్ మండల కేంద్రానికి బస్సులో చేరుకోవచ్చు. అక్కడి నుంచి పిట్టగూడ వరకు ప్రైవేట్ వాహనాల్లో వెళ్లే వీలుంది. ఈ గ్రామం నుంచి దాదాపు మూడు కిలోమీటర్లు నడిస్తే మొదట పెద్ద మిట్టె వస్తుంది. సుమారు 10 అడుగుల ఎత్తు నుంచి నీరు జాలువారుతుంది. ఇక్కడి నుంచి కొంత ముందుకెళ్తే రెండో మిట్టె కనిపిస్తుంది. 80 అడుగుల నుంచి కిందకు దూకే ఈ జలధార ఆకట్టుకుంటుంది.
కాసిపేట, జూలై 30 : మంచిర్యాల జిల్లాలోని కాసిపేట మండలం మద్దిమాడలో సహజసిద్ధంగా ఏర్పడిన వాటర్ ఫాల్స్ పరవళ్లు తొక్కుతుంది. మద్దిమాడ గ్రామం నుంచి కిలో మీటర్లోపే ర్యాలీగఢ్పూర్ దారిలోని అటవీ ప్రాంతంలో ఈ వాటర్ ఫాల్స్ ఉన్నాయి. నెమలి గుండు అనే పేరుతో ఒక కొండ ప్రాంతం ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.