మంచిర్యాల, మార్చి 8(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. గడిచిన నాలుగేళ్లలో ఎప్పుడూ లేని స్థాయిలో నీటి వనరులు అధఃపాతాళానికి పడిపోయాయి. గతేడాది ఈ సమయంలో మంచిర్యాల జిల్లాలో 6.26 అడుగుల నీటిమట్టం ఉంటే.. ఇప్పుడు 6.63 మీటర్ల లోతులో ఉన్నాయి.
ఆదిలాబాద్ జిల్లాలో గతేడాది 7.40 మీటర్ల నీరు ఉండగా ఈ ఏడాది 8.54 మీటర్లకు చేరాయి. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో గతేడాది 7.13 మీటర్లు ఉండగా.. ప్రస్తుతం 7.35 మీటర్లు, నిర్మల్ జిల్లాలో గతేడాది 7.87 మీటర్ల లోతులో నీరుండగా ఈ ఏడాది 9.07 మీటర్లకు నీటిమట్టం పడిపోయింది. వేసవి ప్రారంభానికి ముందే ఈ పరిస్థితి ఉంటే ఏప్రిల్, మే నెలల్లో పరిస్థితి మరింత దారుణంగా మారొచ్చని అధికారులు అంటున్నారు.
గతంతో పోలిస్తే ఈ ఏడాది జిల్లాలో వర్షాలు సమృద్ధిగానే కురిశాయి. ఆదిలాబాద్ జిల్లా సాత్నాల, నిర్మల్ జిల్లాలో గడ్డెన్న వాగు, కడెం ప్రాజెక్ట్‌లతోపాటు మంచిర్యాల శివారు పెద్దపల్లి జిల్లా పరిధిలోకి వచ్చే ఎల్లంపల్లి ప్రాజెక్ట్, ఆసిపాబాద్ జిల్లాలోని కుమ్రం భీం ప్రాజెక్ట్‌లోకి భారీగా నీరు చేరింది. కానీ.. రెండేళ్ల క్రితం మాదిరి వరదల సమయంలో చెరువులను నింపకపోవడం కొంత ఇబ్బందిగా మారింది. అటు ప్రాజెక్టుల్లో నీరు దగ్గరపడడం, ఇటు చెరువులు ఎండిపోవడంతో భూగర్భ జలాలు అడుగంటిపోయాయి.
ఐదు మండలాల్లో పాతాళానికి..
మంచిర్యాల జిల్లాలో ప్రస్తుతం సగటున 6.63 మీ టర్ల లోతులో భూగర్భ జలాలు ఉండగా ఐదు మం డలాల్లో పరిస్థితి మరీ దారుణంగా మారింది. జైపూ ర్ మండలంలో 18.19, కోటపల్లిలో 16.59, తాం డూర్లో 15.12, బెల్లంపల్లిలో 15.03, మందమర్రిలో 12.73 మీటర్ల లోతులో భూగర్భ జలమట్టా లు ఉన్నట్లు భూగర్భ గనుల శాఖ తాజా నివేదిక స్పష్టం చేస్తున్నది. మిగిలిన మండలాల్లో పరిస్థితి కాస్తా మెరుగ్గా ఉంది. గడిచిన రెండేళ్లలో భూగర్భ జలాలు దారుణంగా పడిపోయాయి. 2022 సంవత్సరంలో ఈ సమయానికి 5.96 మీటర్ల లోతులో భూగర్భ జలాలు ఉండగా, 2023లో 5.95 మీటర్లు ఉన్నాయి. 2024లో ఒక్కసారిగా 6.26 మీటర్లకు పడిపోయిన జలమట్టం ప్రస్తుతం 6.63 మీటర్లకు దిగజారింది. మండు వేసవిలో మరింత లోలోతుకు జలమట్టం పడిపోయే అవకాశాలు ఉన్నాయి.
చివరి ఆయకట్టు రైతులకు నీటి కష్టాలు
కడెం చివరి ఆయకట్టుగా ఉన్న మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని పలు గ్రామాల్లో సాగు నీటి ఇక్కట్లు మొదలయ్యాయి. దండేపల్లి మండలంలోని ముక్కాసిగూడలో ఇప్పటికే 50 ఎకరాల దాకా వరి పంట నీరు లేక ఎండిపోతున్నది. కడెం డిస్ట్రిబ్యూటరీ కాలువల నీరు జన్నారం మండలంలోని తపాల్పూర్ దాకే వస్తున్నది. దండేపల్లి మండలంలోని చాలా గ్రామాలకు ఆ నీరు రావడం లేదు. నిర్మల్ జిల్లా గడ్డెనవాగు ప్రాజెక్ట్ ప్రధాన కాలువ నిర్మాణం ఇంకా పూర్తికాలేదు. కేసీఆర్ సర్కారు రూ.6 కోట్లతో 20 కిలోమీటర్ల మేర కాలువ నిర్మాణం పూర్తి చేయించింది. మరో 8 కిలోమీటర్ల మేర కాలువ నిర్మాణ పనులు పెండింగ్‌లో ఉండడంతో భైంసా, లోకేశ్వరం మండలాల్లోని పొలాలకు నీరు అందని పరిస్థితి నెలకున్నది.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే వరి అధికంగా సాగు చేసే జిల్లాలైన మంచిర్యాల, నిర్మల్ జిల్లాల రైతులు అటు ప్రాజెక్టుల నీరు రాక, ఇటు చెరువుల్లో నీరు లేక ఎక్కువగా బోర్లపైనే ఆధారపడుతున్నారు. పదేళ్ల క్రితం ఎలాగైతే బోర్లపై ఆధారపడి సాగు చేశామో ఇప్పుడు అదే పరిస్థితి వచ్చిందని చెప్తున్నారు. బోర్లు లేని రైతులు కొత్తగా బోర్లు వేసేందుకు సిద్ధం అవుతున్నారు. ఈ నేపథ్యంలో భూగర్భంలోనూ నీటిమట్టాలు అడుగంటిపోతుండడం రైతులకు కష్టంగా మారనుంది. గతంలో 100 ఫీట్లకు బోరు పడిన చోట ఇప్పుడు 150 ఫీట్ల నుంచి 200 ఫీట్ల వరకు బోరు వేయాల్సి వస్తుంది. దీంతో రైతులపై అదనపు భారం పడుతున్నది. అదృష్టం బాగుండి బోరు పడితే పర్లేదు.. కానీ కర్మకాలి బోర్ ఫెయిలయ్యిందా రైతులపై లక్షల రూపాయల అదనపు భారం పడుతుంది.
Dd