మంచిర్యాల, ఏప్రిల్ 2 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): మంచిర్యాల జిల్లాలో ఇప్పటికే కొంత సాగునీటి కష్టాలు మొదలయ్యాయి. అటు కడెం ప్రాజెక్టు చివరి ఆయకట్టుగా ఉన్న దండేపల్లి మండలంలోని ముక్కాసిగూడెం, నాగసముద్రం చుట్టు పక్కల గ్రామాల్లో సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయి. కాస్తో కూస్తో గూడెం లిఫ్ట్ నీళ్లయినా వస్తున్నాయనుకుంటే ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌లో నీటిమట్టం వేగంగా పడిపోతున్నది. ఏప్రిల్, మే నెలల్లో ఎండలు తీవ్రత ఎక్కువగా ఉండనున్న నేపథ్యంలో ఎల్లంపల్లి నీటికి కేవలం తాగునీటికే కేటాయిస్తే గూడెం లిఫ్ట్‌నే నమ్ముకున్న దండేపల్లి, హజీపూర్, లక్షెట్టిపేట మండలాల్లోని రైతులకు ఇబ్బందులు తప్పవు. అలాగని గూడెం లిఫ్ట్ నుంచి సాగునీటిని నిలిపివేసి కేవలం తాగునీటికే ఎల్లంపల్లి నీరు వాడినా అవి ఎంత మేరకు సరిపోతాయేనన్న అనుమానాలు నెలకొన్నాయి. గతేడాది సంవత్సరం దాదాపు ఇదే పరిస్థితి నెలకొన్నప్పుడు మంచిర్యాలకు తాగునీటి ఇబ్బందుల రాకుండా చర్యలు తీసుకున్నారు. ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ నుంచి ప్రత్యేక కాలువలు తీసి పంప్‌హౌస్‌కు నీటి కొరత లేకుండా చూశారు. కానీ ఈ సారి అలాంటి జాగ్రత్తలు ఏవీ తీసుకోకపోవడం ఆందోళనలు రేకెత్తిస్తున్నాయి.
మంచిర్యాల జిల్లాకు కల్పతరువులా ఉన్న శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో రోజురోజుకూ నీటి నిల్వలు పడిపోతున్నాయి. ప్రాజెక్ట్ మొత్తం కెపాసిటీ 20.17 టీఎంసీలు కాగా బుధవారం నాటికి 9.71 టీఎంసీల నీరు ఉంది. మార్చి 22వ తేదీన 11.16 టీఎంసీల నీరు ఉంటే పది రోజుల్లోనే దాదాపు రెండు టీఎంసీలు తగ్గింది. ఎల్లంపల్లి నుంచి హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లయ్ స్కీమ్‌కు 315 క్యూసెక్కులు, ఎన్టీపీసీకి 242 క్యూసెక్కులు, అలాగే వేమునురు పంప్‌హౌస్‌కు 247 క్యూసెక్కులు సరఫరా చేస్తున్నారు. ఇది కాకుండా మిషన్‌భగీరథ స్కీమ్ కింద రామగుండం గ్రిడ్‌కు, మంచిర్యాల గ్రిడ్‌కు కలిపి 80 క్యూసెక్కుల దాకా నీరు అవసరం అవుతుంది. వీటన్నింటినీ నిటిని వదిలితే మరో వారం పదిరోజుల్లో మరో రెండు టీఎంసీలు నీటిమట్టం తగ్గుతుంది. అదే జరిగితే మంచిర్యాలకు తాగునీటి అందజేసే పంప్‌హౌస్(మిషన్ భగీరథ గ్రిడ్) సమీపంలో నీరు లేకుండా పోయే ప్రమాదం ఉంది.
కడెం ప్రాజెక్ట్ పరిధిలోని చివరి ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు ఏర్పాటు చేసిన గూడెం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌కు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ నుంచి 3 టీఎంసీలు నీళ్లు ఇవ్వాలనేది నిబంధన. దీని కింద దండేపల్లి, లక్షెట్టిపేట, హజీపూర్ మండలాల్లో 30వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది. కాకపోతే ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌లో 18 టీఎంసీల నీరు ఉంటేనే గూడెం లిఫ్ట్‌ను నడపాలి. కానీ గత రెండేళ్లు ఎండాకాలం ప్రారంభానికి ముందే ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌లో నీరు 18 టీఎంసీల కంటే దిగువకు చేరుతున్నది. స్థానిక రైతుల డిమాండ్ మేరకు 15వేల ఎకరాల ఆరుతడి పంటలకు నీరు ఇస్తున్నారు. ఈ మేరకు ఇప్పటికీ గూడెం లిఫ్ట్ నుంచి నీరు సరఫరా చేస్తున్నారు. గూడెం నుంచి 290 క్యూసెక్కుల నీరు వదులుతున్నారు. మరో పది రోజుల్లో ఎల్లంపల్లిలో నీరు అడుగంటితే ఈ లిఫ్ట్ ద్వారా సాగునీటి సరఫరా నిలిపివేయాల్సి ఉంటుంది. కానీ అలా చేస్తే మూడు మండలాల్లో చివరి దశలో ఉన్న వరి పంటలు ఎండిపోయే పరిస్థితి ఉంటుంది. రైతుల విజ్ఞప్తి మేరకు గూడెం లిఫ్ట్‌ను నడిపిస్తే మాత్రం మంచిర్యాలకు తాగునీరు ఇవ్వడం కష్టం కానున్నది.
జిల్లాలోని మంచిర్యాల, చెన్నూర్ నియోజకవర్గాల్లోని దాదాపు 330 గ్రామ పంచాయతీలు, మరో 20 తండాలు, గూడేలకు ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌లోని మిషన్ భగీరథ గ్రిడ్ నుంచే తాగునీరు సరఫరా అవుతుంది. జిల్లాలో ప్రతి రోజూ 6.75 ఎంఎల్డీ నీరు అంటే 0.09 టీఎంసీలు తాగడానికి కావాల్సి ఉంటుంది. రెండేళ్ల క్రితం రుతుపవనాలు ఆలస్యమై ఎల్లంపల్లి ప్రాజెక్టులో 8 టీఎంసీల నీరు ఉంది. కానీ అప్పుడు కాళేశ్వరం ఎత్తిపోతల ద్వారా ప్రాజెక్టును నింపుకునే అవకాశం ఉండడంతో ఎల్లంపల్లిలోకి నీరు ఎత్తిపోసి సాగు, తాగునీటికి ఎలాంటి ఢోకా లేకుండా చర్యలు తీసుకున్నారు. కాళేశ్వరంలో ఎత్తిపోస్తే ఎల్లంపల్లి మొత్తం నిండిపోయేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. సాగునీటి నిర్వహణలో పూర్తిగా విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం మేడిగడ్డ ప్రాజెక్టును రిపేర్ చేయకపోవడంతో ఎల్లంపల్లి ఎండాల్సిన దుస్థితి వచ్చింది. రెండేళ్ల క్రితం ఇదే సమయానికి బెడ్ లెవల్ 145 అడుగుల నీటితో నిండుకుండను తలపించిన ఎల్లంపల్లి ఇప్పుడు అడుగంటిపోతున్నది. ఎండల తీవ్రత ఇలాగే ఉంటే మాత్రం రెండు నెలల్లో ప్రాజెక్ట్ డెడ్ స్టోరేజీకి చేరుకోవచ్చని అధికారులు భావిస్తున్నారు. అదే జరిగితే మంచిర్యాల, చెన్నూర్ నియోజకవర్గాల్లోని ప్రజలు తాగునీటి కోసం ఇబ్బందులు పడక తప్పదు. గతేడాది ఇదే పరిస్థితి వచ్చినప్పుడు నీటి కొరత లేకుండా చర్యలు తీసుకున్నా అధికారులు ఈ సారి ఏం చేస్తారు అన్న విషయంపై స్పష్టత లేకుండా పోయింది. ఈ విషయంపై మిషన్ భగీరథ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని అటు రైతులు, ఇటు మంచిర్యాల జిల్లావాసులు కోరుతున్నారు.