కుమ్రం భీం ఆసిఫాబాద్, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ) : ఇటీవల ఆదివాసీ మహిళపై జరిగిన దాడి నేపథ్యంలో జైనూర్‌లో పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఉమ్మడి జిల్లా కలెక్టర్లతో పాటు రాష్ట్ర అడిషనల్ డీజీ మహేశ్భగత్, నార్త్ జోన్ ఐజీ చంద్రశేఖర్, సిరిసిల్ల ఎస్పీ అఖిల్ మహాజన్, జగిత్యాల ఎస్పీ అశోక్ కుమార్, ఆదిలాబాద్ ఎస్పీ గౌస్ ఆలం, బాలానగర్ డీసీపీ సురేశ్‌కుమార్ రెండు రోజులుగా జైనూర్‌లోనే ఉంటూ పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.
144 సెక్షన్ శుక్రవారం కూడా యథావిధిగా కొనసాగింది. ఆధార్ కార్డు ఉంటే తప్ప జైనూర్లోకి ఎవరినీ అనుమతించడం లేదు. శుక్రవారం నుంచి గణేశ్ నవరాత్రోత్సవాలు ప్రారంభంకానుండగా, పోలీసులు మరింత బందోబస్తు పెంచే అవకాశమున్నది. కాగా, ఆసిఫాబాద్ నుంచి జైనూర్ మీదుగా వెళ్లే బస్సులను మూడు రోజులుగా రద్దుచేయడంతో ఆటోలు, ఇతర ప్రైవేట్ వాహనాల డ్రైవర్లు ప్రజల వద్ద అందినకాడికి డబ్బులు దండుకుంటున్నట్లు తెలుస్తున్నది.
ఇంటర్నెట్ లేక అవస్థలు
కౌటాల, సెప్టెంబర్ 6 : జిల్లా వ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలు నిలిపివేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాకలాపాలు నిలిచిపోయాయి. ముఖ్యంగా నగదు రహిత లావాదేవీలపై ప్రభావం పడింది. కౌటాల మండలానికి ఆనుకొని మహారాష్ట్ర ఉండడంతో కొంత మంది యువకులు సరిహద్దు ప్రాంతానికి వెళ్లి సెల్ఫోన్లలో నెట్వర్క్ చేంజ్ చేసుకుని అతికష్టం మీద నెట్ వాడుతున్నారు.
డీఎస్పీ సదయ్యపై బదిలీ వేటు
ఆసిఫాబాద్ అంబేద్కర్ చౌక్, సెప్టెంబర్ 6 : జైనూర్ ఘటన నేపథ్యంలో ఆసిఫాబాద్ డీఎస్పీగా విధులు నిర్వహిస్తున్న పంతాటి సదయ్యపై పోలీస్ ఉన్నతాధికారులు బదిలీ వేటు వేశారు. సదయ్యను కాగజ్‌నగర్ డీఎస్పీగా బదిలీ చేయగా, కాగజ్‌నగర్ డీఎస్పీగా విధులు నిర్వహిస్తున్న కరుణాకర్‌ను ఆసిఫాబాద్ డీఎస్పీగా బదిలీ చేస్తూ మల్టీ జోన్-1 ఐజీ చంద్రశేఖర్‌రెడ్డి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.