మంచిర్యాల, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): మంచిర్యాల జిల్లా గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో పని చేస్తున్న కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్స్(సీఆర్టీలు) ట్రాన్స్ఫర్లలో లోపాలు జరిగినట్లు ఐటీడీఏ పీవో ఖుష్బూగుప్తా గుర్తించారు. సీనియార్టీ లిస్టు, కౌన్సెలింగ్‌లో లోపాలు ఉన్నందున మరోసారి కౌన్సెలింగ్ నిర్వహించాలని నిర్ణయించారు. రెండు రోజుల్లో కౌన్సెలింగ్ తేదీని ప్రకటిస్తామని అప్పటి వరకు సీఆర్టీలు ప్రస్తుతం పని చేస్తున్న పాఠశాలలకే వెళ్లాలని పీవో నుంచి మౌఖిక ఆదేశాలు వచ్చాయి. ‘గిరివిద్య అస్తవ్యస్తం’ శీర్షికన నమస్తే తెలంగాణలో ప్రచురితమైన కథనంపై అధికారులు స్పందించారు. సీఆర్టీల ట్రాన్స్ఫర్లలో అక్రమాలకు పాల్పడ్డారని, గిరిజన సంక్షేమ శాఖలో పని చేస్తున్న ఏసీఎంవోనే ఇందుకు కారణమని ఉపాధ్యాయులు రోడ్డెక్కారు. దీనిపై ‘నమస్తే తెలంగాణ’ సమగ్ర కథనం ప్రచురించడంతో పీవో స్వయంగా జిల్లా గిరిజన సంక్షేమ అధికారి (డీటీడీవో) గంగారం, ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏసీఎంవోతో పాటు ట్రాన్స్ఫర్లలో అన్యాయం జరిగిందని ధర్నా చేసిన సీఆర్టీలను ఉట్నూర్‌లోని పీవో కార్యాలయానికి పిలిపించుకున్నారు. స్వయంగా ఉద్యోగులు, అధికారులతో మాట్లాడిన అనంతరం లోపాలు జరిగినట్లు గుర్తించారు.
అందరికీ న్యాయం చేసేలా రెండు రోజుల్లో కౌన్సెలింగ్ తేదీలు ప్రకటిస్తామని హామీ ఇచ్చారు. అప్పటి వరకు పాత పాఠశాలల్లోనే పని చేయాలని సూచించారు. ఇదిలా ఉంటే బుధవారం ఉపాధ్యాయులు ధర్నా నేపథ్యంలో కలెక్టర్ కుమార్ దీపక్ డీటీడీవో గంగారాంకు ఫోన్ చేసి ట్రాన్స్‌ఫర్‌కు సంబంధించిన ఫైల్ తీసుకురావాలని ఆదేశించారు. ఉదయం 11.30 గంటలకు కలెక్టర్ ఫోన్ చేసి చెప్పి..సాయంత్రం 6.30 గంటల వరకు వెయిట్ చేసినా డీటీడీవో రాలేదని తెలిసింది. దీంతో బాధితులను చాంబర్లోకి పిలిపించుకున్న కలెక్టర్ ఐటీడీఏ పీవో ఖుష్బూగుప్తాతో ఫోన్లో మాట్లాడి జరిగిన విషయాన్ని చెప్పారు. రేపు అందరినీ పిలిపించుకొని సమస్యను పరిష్కరించాలని కోరారు. ఈ క్రమంలో డీటీడీవో పనితీరు ఏం బాగోలేదని కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు బాధితులు చెబుతున్నారు. కలెక్టర్ సార్ పిలిచినా రాని జిల్లా అధికారిని ఎవరినీ చూడలేదంటూ ముక్కున వేలు వేసుకుంటున్నారు. ట్రాన్స్ఫర్ల విషయంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన డీటీడీవోతో పాటు ఏసీఎంవోపైనా చర్యలు తీసుకుంటామని పీవో చెప్పినట్లు బాధిత ఉపాధ్యాయులు తెలిపారు.