మంచిర్యాల, అక్టోబర్ 14(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్, నిజామాబాద్ జిల్లాల్లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల హడావుడి మొదలైంది. ప్రస్తుత ఎమ్మెల్సీ పదవీకాలం వచ్చే ఏడాది మార్చి 29తో పూర్తవనుంది. దీంతో ఈ స్థానానికి ఎన్నికలు నిర్వహించడంపై రాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. సెప్టెంబర్ 30వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేసి ఓటర్ల నమోదు ప్రక్రియను చేపట్టింది.
డిసెంబర్ 6వ తేదీ వరకు ఓటు నమోదు చేసేందుకు అవకాశం కల్పించింది. ఈ మే రకు డిసెంబర్ 30వ తేదీన ఓటర్ జాబితాను విడుదల చే యనుంది. అన్ని జిల్లాల కలెక్టరేట్లు, ఆర్డీవో, తహసీల్దార్ కార్యాలయాల్లో 2021 నవంబర్ 11లోపు డిగ్రీ ఉత్తీర్ణులైనవారు ఓటరుగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఎన్నికల సంఘం వెబ్సైట్లోనూ ఓటు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇవీ కాకుండా ఆశావహులు ఓటరు నమోదు కో సం ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు.
డిగ్రీ మెమో, ప్రొవిజనల్ సర్టిఫికెట్, ఆధార్‌కార్డు, ఎలక్షన్ కార్డు ఎపిక్ నంబర్, ఫోన్ నంబర్, ఈ-మెయిల్ ఐడీ డిటేయిల్స్, పా స్ఫొటో, ఫామ్-18తో ఓటరుగా నమోదు చేసుకోవచ్చు. 2019 ఎన్నికల్లో ఈ స్థానంలో 1.96 లక్షల మంది గ్రా డ్యుయేట్లు మాత్రమే ఓటర్లుగా నమోదు కాగా, ఈసారి ఈ సంఖ్య 9 నుంచి 10 లక్షలకు చేరుకునేలా అవగాహన కార్యక్రమాలు, ఓటరు నమోదు ప్రక్రియను చేపట్టారు.
పార్టీలకు ప్రతిష్ఠాత్మకం
ఈ ఎన్నికలు రాజకీయ పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా మారాయి. ఇదీ అధికార కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ సీటు కావడంతో తిరిగి ఎలాగైనా పాగా వేయాలని ప్రయత్నిస్తున్నది. ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి ఈ ఎన్నికల కీలకంగా మారింది. కాంగ్రెస్ పాలనపై ఉన్న వ్యతిరేకతను ఈ ఎన్నికల్లో గెలిచి జనంలోకి బలంగా వెళ్లాలని బీఆర్ఎస్ భావిస్తున్నది. కాగా.. బీజేపీకి కూడా ఈ ఎన్నికలు కత్తిమీద సాములా మారాయి. ఈ నాలుగు ఉమ్మడి జిల్లాల్లో ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటారు. దీంతో ఎమ్మెల్సీగా తమ పార్టీ అభ్యర్థిని గెలిపించుకునే వ్యూహాల్లో ఆ పార్టీ ఉన్నది.
గంపెడాశల్లో అభ్యర్థులు
రాజకీయ పార్టీలకు కీలకంగా మారిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆశావహులు అన్ని రకాలుగా సిద్ధమవుతున్నారు. అధికార పార్టీ నుంచి పోటీ చేసి గతంలో ఇదే స్థానం నుంచి గెలిచిన జీవన్‌రెడ్డి అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. దీంతో ఈ సారి తిరిగి ఎమ్మెల్సీగా నిలబడాలని ఆసక్తిగా ఉన్నారు. గతంలో ఏడాది కాలంపాటు ఎమ్మెల్సీగా ఉండి రాజీనామా చేసిన ఆర్.సత్యనారాయణ కూడా కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్సీ టికెట్ ఆశిస్తున్నారు. వీరితోపాటు మరికొందరు అధికార పార్టీ నుంచి మాకే టికెట్ వస్తుందంటూ ప్రచారం చేసుకుంటున్నారు.
బీఆర్ఎస్ నుంచి కరీంనగర్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్, మాజీ మేయర్ సర్ధార్ రవీందర్సింగ్ల పేర్లు వినిపిస్తున్నాయి. అధికార పార్టీ అభ్యర్థిని అనుసరించి బలమైన అభ్యర్థిని బరిలోకి దించేందుకు బీఆర్ఎస్ సన్నాహాలు చేస్తున్నది. కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత స్పష్టంగా బయటపడుతున్న నేపథ్యంలో దాన్నే ఈ ఎన్నికల నినాదంగా జనంలోకి బలంగా వెళ్లేందుకు సిద్ధమవుతున్నది. అందుకు తగినట్లుగానే ఆ పార్టీ నుంచి అభ్యర్థిని ప్రకటించనుంది.
ఇక బీజేపీ నుంచి కూడా చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయి. మంచిర్యాల బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి వెరబెల్లి రఘునాథ్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు అధిష్ఠానంతో ఆయన టచ్‌లో ఉన్నట్లు తెలుస్తున్నది. ఈ పార్టీ నుంచి పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి, రాణి రుద్రమదేవీ పేర్లు వినిపిస్తున్నాయి. ఇకపోతే పార్టీలతో సంబంధం లేకుండా కొందరు గ్రాడ్యుయేట్స్ పోటీకి సిద్ధమవుతున్నారు. వీలైతే పార్టీ నుంచి లేనిపక్షంలో ఇండిపెండెంట్‌గా పోటీ చేయాలని చూస్తున్నారు. ఆల్ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ నరేందర్‌రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల రేసులో నిలబడడం దాదాపు కాయమైపోయింది.
ఇక నిర్మల్ జిల్లాకు చెందిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు, సీపీఎస్ ఉద్యమకారుడు కృష్ణారావు ఈసారి బరిలో ఉండనున్నారు. సీపీఎస్ ఉద్యమకారుల ఓటు బ్యాంక్ ఈ నాలుగు జిల్లాల్లో అధికంగా ఉండడంతో ఆయన కూడా ఈ ఎన్నికల్లో కీలకంగా మారారు. ఇలా ఎవరి వారు టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తూనే, ప్రచారం చేస్తున్నారు.
కొందరు అభ్యర్థులైతే ఓటర్ల నమోదు కోసం ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి, గ్రాడ్యుయేట్లను తమవైపు తిప్పుకునే పనుల్లో బిజీగా ఉన్నారు. ప్రభుత్వ ప్రైవేటు టీచర్లు, ఉద్యోగులు, నిరుద్యోగులు ఇలా అన్ని వర్గాలను కవర్ చేస్తూ సమావేశాలు నిర్వహిస్తున్నారు. దీంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల హడావుడి ఐదారునెలల ముందే మొదలైపోయింది.