మంచిర్యాల, ఆగస్టు 31(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు తారాస్థాయికి చేరింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి మంత్రి పదవి కోసం మొదలైన విభేదాలు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటన సాక్షిగా బయటపడ్డాయి. పెద్దపల్లి జిల్లాతోపాటు మంచిర్యాల జిల్లా చెన్నూర్ నియోజకవర్గంలో శనివారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌లు పర్యటించాల్సి ఉంది. కాగా.. రామగుండంలో మంత్రుల పర్యటన ఆలస్యమైంది. దీంతో చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఆయన కుమారుడు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. మంత్రుల పర్యటన సందర్భంగా చెన్నూర్ నియోజకవర్గంలో మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావు భారీ ప్లెక్సీలు ఏర్పాటు చేయడంపై మంత్రుల సమక్షంలోనే వివేక్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈ మేరకు రామగుండం సింగరేణి గెస్ట్‌హౌస్ నుంచి ఎమ్మెల్యే వివేక్, ఎంపీ వంశీ అలిగి చెన్నూర్‌కు బయల్దేరి వచ్చారు. దీంతో డిప్యూటీ సీఎం చెన్నూర్ పర్యటనను అర్ధాతరంగా రద్దు చేసుకున్నారు. రామగుండంలో ఆలస్యం కావడం, భారీ వర్షాలతో ఖమ్మం వెళ్లాల్సి రావడంతో భట్టి పర్యటన రద్దు చేసినట్లు కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నా.. ఎమ్మెల్యే వివేక్, ఎంపీ వంశీ అలిగి వచ్చాక కూడా డిప్యూటీ సీఎం, మంత్రులు రామగుండం పర్యటనను కొనసాగించడం అనుమానాలకు తావిస్తున్నది.
గెలిచిన నాటి నుంచే గొడవలు.. వివేక్ సఫరేట్ మీటింగ్..
అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చిన నాటి నుంచే ఎమ్మెల్యేల మధ్య దూరం పెరుగుతూ వస్తున్నది. జిల్లాలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి, అసెంబ్లీ ఎన్నికల్లో మంచి ఫలితాలు వచ్చేందుకు కృషి చేస్తే క్రెడిట్ మొత్తం చెన్నూర్, బెల్లంపల్లి ఎమ్మెల్యేలు కొట్టేయడంపై ఎమ్మెల్యే పీఎస్ఆర్ ఆగ్రహంగా ఉన్నట్లు సమాచారం. అక్కడ మొదలైన పంచాయతీ పెరుగుతూ వస్తున్నది. మంత్రి పదవి విషయంలో ముగ్గురు ఎమ్మెల్యేలు ఎవరికి వారు సెఫరేట్గా ప్రయత్నాలు చేయడంతో ఒకరంటే ఒకరికి పడని పరిస్థితి నెలకున్నది. ఈ నేపథ్యంలో వచ్చిన ఎంపీ ఎన్నికల్లో తానేంటో అధిష్ఠానానికి చూపించుకోవాలనే ఉద్దేశంతో పీఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోసం కష్టపడ్డారు తప్పితే, వ్యక్తిగతంగా ఆయనకు ఇష్టం లేదనే చర్చ అప్పట్లో నడిచింది. ఇటీవల మంత్రివర్గ విస్తరణ జరుగుతుందన్న సమయంలోనూ ముగ్గురు ఎమ్మెల్యేల పేర్లు వినిపించాయి. ఎవరికి వారు పదవి కోసం పట్టుపడుతున్న నేపథ్యంలో జిల్లా కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు తారాస్థాయికి చేరింది. ఒక రకంగా డిప్యూటీ సీఎం భట్టి చెన్నూర్ పర్యటన రద్దు చేసుకోడానికి కూడా పీఎస్ఆర్ కారణమనే చర్చ నడుస్తున్నది. రామగుండం నుంచి అలిగి వచ్చిన ఎమ్మెల్యే వివేక్, ఎంపీ వంశీకృష్ణ చెన్నూర్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు. త్వరలో సీఎం రేవంత్‌రెడ్డిని చెన్నూర్ పర్యటనకు తీసుకొస్తానని, రాజకీయంగా ఇక నుంచి మరింత గట్టిగా ముందుకెళ్దామని వివేక్ సహచరులతో చెప్పుకొచ్చారు.
ఫ్లెక్సీల పంచాయతీ..
డిప్యూటీ సీఎం భట్టి, మంత్రుల పర్యటన సందర్భంగా ప్రేమ్‌సాగర్‌రావు చెన్నూర్ నియోజకవర్గ పరిధిలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంపై వివేక్ తీవ్రంగా మంత్రుల ముందే ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. అక్కడ మొదలైన పంచాయతీ డిప్యూటీ సీఎం పర్యటన రద్దు అయ్యే దాకా వచ్చింది. కాగా.. చెన్నూర్ కాంగ్రెస్ లీడర్లు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఎమ్మెల్యే పీఎస్ఆర్ సతీమణి కొక్కిరాల సురేఖ ఫొటోలు పెట్టలేదు. ఇది కావాలనే ఉద్దేశపూర్వంగా చేసిందేంటూ పీఎస్ఆర్ వర్గీయులు ఆరోపిస్తున్నారు. రామగుండం నుంచి వివేక్ అలిగి వెళ్లివచ్చాక కార్యకర్తలను ఉద్దేశించి మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. ఉమ్మడి ఆదిలాబాద్‌లో ప్రేమ్‌సాగర్‌రావు నాయకత్వంపై కాంగ్రెస్ అధిష్ఠానానికి, సీఎం రేవంత్‌రెడ్డికి పూర్తి నమ్మకం ఉందన్నారు. పీఎస్ఆర్ అభిమానుల మనోభావాలను అధిష్ఠానం గుర్తించిందని పరోక్షంగా పీఎస్ఆరే పదవి వస్తుందనే సంకేతాలు ఇచ్చారు. దీంతో పీఎస్ఆర్ వర్గం నాయకులు సంబురపడుతున్నారు. ఈ పరిణామాలపై ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కుటుంబం ఎలా స్పందిస్తుంది. జిల్లా కాంగ్రెస్ పార్టీలో పీఎస్ఆర్కు పోటీగా మరో వర్గాన్ని తయారు చేస్తారా? అనే చర్చ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో హాట్ టాపిక్‌గా మారింది.
పర్యటన రద్దుతో జనం అవస్థలు
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెన్నూర్‌లో సోలార్ పవర్‌ప్లాంట్ ప్రారంభోత్సవానికి వ స్తున్నారని తెలిసి కాంగ్రెస్ కార్యకర్తలు, జ నాలు వచ్చారు. మధ్యాహ్నం 1 గంటకు ప్రోగ్రాం అని తెలిసి వచ్చిన జనాలు సా యంత్రం 5 గంటల వరకు ఎదురుచూశా రు. చివరకు డిప్యూటీ సీఎం రావడం లేదని తెలిసి ఆగ్రహంతో వెను తిరిగారు. వచ్చిన కొద్ది పాటి జనాలకు కనీసం భోజనాలు పె ట్టకపోవడంతో ఇబ్బందులు పడ్డారు. రోడ్డు నుంచి ప్రారంభోత్సవ వేదికకు అరకిలోమీటర్ దూరం నడుచుకుంటే వస్తే చివరకు రా రని చెప్తారా.. ఇదేం పద్ధతి అంటూ తిట్టుకుంటూ వెళ్లిపోవడం కనిపించింది. చెన్నూర్‌లో పర్యటన రద్దయినా జైపూర్ ఎస్టీపీపీలోనైనా ఉంటుంది అనుకుంటే చాలా సేపు ఎదురుచూశాక అక్కడ కూడా ప్రోగ్రాం ఉం డదంటూ చెప్పారు. దీంతో చాలా సేపు ఎ దురుచూసిన జిల్లా అధికారులు, మీడియా, కాంగ్రెస్ నాయకులు వెళ్లిపోయారు.