పల్లె, పట్టణాల్లోని పలు వార్డుల్లో గణనాథులు కొలువుదీరారు. మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో మండపాల నిర్వాహకులు, భక్తులు వినాయక ప్రతిమలను ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు చేశారు. వివిధ కళాకృతులతో వినాయక విగ్రహాలు ఆకట్టుకున్నాయి. పలు చోట్ల ప్రసాద వితరణ, అన్నదానాలు చేశారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని విశ్వనాథ ఆలయంలోని గణనాథుడికి మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు రాజకుమారి దంపతులు పూజలు చేశారు.
ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో సమర్థ సాయి గణేశ్ మండపం వద్ద కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే పూజలు చేశారు. బెల్లంపల్లిలో మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, రామగుండం సీపీ శ్రీనివాస్, బీఆర్ఎస్ నాయకులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రజలు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో చల్లంగా చూడాలని వేడుకున్నారు.
గణేశుడి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని, రైతుల కుటుంబాల్లో పాడి, పంటలు సమృద్ధిగా ఉండాలని, వారి కుటుంబాల్లో వెలుగులు నిండాలని కోరుకున్నారు. ఆధ్యాత్మికతను ప్రతి ఒక్కరూ పెంపొందించుకుంటూ భక్తి భావంతో హిందూ ధర్మాన్ని తరాలకు అందజేసేలా వేడుకలు నిర్వహించడం సంతోషకరమన్నారు.