కాసిపేట : కాసిపేట(Kasipet) మండలంలోని దుబ్బగూడెం రహదారిపై సోమవారం ప్రజా సంఘాల నాయకులు, గ్రామస్థులు రాస్తారోకో నిర్వహించారు. బెల్లంపల్లి మున్సిపాలిటీ చెత్తను ( Municipal garbage ) దుబ్బగూడెం శివారులో వేయడం పట్ల అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డుపై బైటాయించి ఆందోళన చేపట్టారు. శివారులో డంపింగ్ యార్డ్ (Dumping Yard) ఏర్పాటు చేసి చెత్తను వేయడం, కాల్చడం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు.
బెల్లంపల్లి మున్సిపాల్టీ పరిధి స్థలాల్లో చెత్తను వేయకుండా తమ శివారులో వేయడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. డంపింగ్‌యార్డును వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. ధర్నాతో రహదారిపై వాహనాలు భారీగా నిలిచిపోవడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు గోనెల శ్రీనివాస్, మాజీ సర్పంచ్ సపాట్ శంకర్, దుర్గం గోపాల్, బోగె పోశం, సిలోజ్ మురళి, కొయ్యాడ శ్రీనివాస్, సంతోష్, విజయ లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.