బేల, ఫిబ్రవరి 10 : సరిగ్గా 39 ఏళ్లక్రితం.. ఆ గ్రామం ప్రాజెక్టు ముంపునకు గురైంది. సర్కారు ఇచ్చిన పునరావాసంతో స్థానచలనం పొందింది. గ్రామస్తులంతా ఎక్కడెక్కడికో వెళ్లి తోచిన ఉపాధితో బతుకులీడుస్తున్నారు. కాగా.. తమ సొంత పల్లె మధుర జ్ఞాపకాల కోసం, ఆ మట్టి పరిమళాలను ఒకసారి ఆస్వాదించాలనే తపనతో శుక్రవారం ఒక్కటయ్యారు. సమ్మేళనం పేరిట అందరూ కలిశారు. ఆదిలాబాద్ జిల్లా బేల మండలం పాతతోయిగూడ గ్రామం 1984లో (ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎం జలగం వెంగళరావు) సాత్నాల ప్రాజెక్టులో ముంపునకు గురవుతుందన్న ఉద్దేశంతో ఖాళీ చేశారు. దాదాపు 1,300 ఎకరాల భూమిని రైతులు ఈ ప్రాజెక్టు కోసం వదులుకున్నారు. అప్పుడు తరాలుగా అనురాగాలు, ఆప్యాయతతో ఉన్న కుటుంబాలు ఒక్కసారిగా చెల్లాచెదురయ్యాయి.
మండలంలో అతిపెద్ద గ్రామమైన తోయిగూడ, అప్పటి హెచ్ 4 రకం పత్తిపంట తీసిన మొట్టమొదటి గ్రామంగా గుర్తింపుపొందింది. కాగా, ఆనాటి పల్లె స్మతులను ఆస్వాదించేందుకు పాతతోయిగూడ వాసులంతా శుక్రవారం వివిధ ప్రాంతాలనుంచి వచ్చి ఒకచోట కలిశారు. ఆనాటి తమ ఇండ్లు, కొట్టాలు, చేలు ఎక్కడుండేనో చూసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. అప్పటి రోజులు, పండుగలు, పబ్బాలు చేసుకున్న తీరును తలుచుకున్నారు.
బాల్యంలో, యవ్వనంలో ఆడుకున్న చోటును చూసి ఆనందపడ్డారు. అప్పటి మందిరాలను దర్శించుకున్నారు. పాత బావి దగ్గర దాహం తీర్చుకున్నారు. ఇలా.. తీపి, చేదు అనుభవాలను మననం చేసుకున్నారు. వంటావార్పు చేసుకొని సహపంక్తి భోజనాలు చేశారు. ‘మరోసారి మళ్లీ కలుద్దాం’ అంటూ ఎక్కడివారక్కడ వెళ్లిపోయారు. వారి ఆత్మీయ సమ్మేళనంలో పల్లెతల్లి కథలెన్నో గోచరించాయి. సమ్మేళనానికి హాజరైన వారిలో కంటం రాజారెడ్డి, ఏనుగు హన్మంత్రెడ్డి, గద్దల శంకర్, బండాల కిష్టారెడ్డి, సందరగిరి వెంకన్న, తిరుపతి, నరహరి, కమ్మరి రాములు, బండాల కిష్టు, మహిళలు, పిల్లలు, వృద్ధులున్నారు.