తాంసి : గ్రామంలో నెలకొన్న తాగునీటి ఎద్దడిని పరిష్కరించాలని తాంసి మండలం లీంగూడ (Leemguda) గ్రామస్థులు గురువారం ఎమ్మెల్యే అనిల్ జాదవ్‌ను ( MLA Anil Jadav) కలిసి వినతి పత్రం అందజేశారు. గత కొంత కాలంగా తాగునీటి కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం గ్రామంలో ఉన్న రెండు బోర్లు ( Bores ) నీటి అవసరాలను తీర్చలేకపోతున్నాయని పేర్కొన్నారు. వేసవి సమీపిస్తున్న తరుణంలో ఈ సమస్య మరింత తీవ్రతరం అవుతుందని వివరించారు.
పాత బోర్లు పూర్తిగా పొడిగా మారటంతో తాగునీటి కోసం ప్రజలు గ్రామం బయట ఉన్న బావిపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. నీటి సరఫరా మెరుగుపరిచేందుకు గ్రామంలో కొత్త బోర్లు వేయించాలని కోరారు. గ్రామ శివారులో ఉన్న బావి నుంచి గ్రామానికి పైప్‌లైన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. తాగునీటి ఎద్దడి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యేను కోరారు.
గ్రామస్థుల వినతిపై సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ త్వరలోనే తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సంబంధిత అధికారులను గ్రామానికి పంపి , నీటి వనరులు అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం తగిన నిధులను కేటాయించేలా చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మాజీ సర్పంచ్ స్వప్న రత్న ప్రకాష్ శంభు, లక్ష్మణ్, భీం రావ్, సంజీవ్, గ్రామానికి చెందిన పెద్దలు పాల్గొన్నారు.