నార్నూర్, ఫిబ్రవరి 6: గాదిగూడ మండలంలోని 25 గ్రామ పంచాయతీల్లో 2021-22 సంవత్సరానికి నిర్ధేశించిన ఇంటి పన్నుల లక్ష్యాన్ని పూర్తి చేయడంలో గ్రామ స్థాయి అధికారులు ముందున్నారు. మండల వ్యాప్తంగా 7,889 కుటుంబాలు, 9,445 గృహాలు ఉన్నాయి. వీటి పరిధిలో ఈ ఏడాది ఇంటి పన్నుల రూపేణా రూ.16, 24,761 వసూలు చేయాల్సి ఉండగా, ఈ నెల 6వ తేదీ నాటికి రూ.14,62,515 వసూలు చేశారు. వందశాతం లక్ష్యానికి గాను. ఇప్పటి వరకు 90.01శాతం వసూలు చేశామని, మిగిలిన 10శాతం ఈ నెలాఖరుకి పూర్తి చేస్తామని అధికారులు పేర్కొంటున్నారు.
వసూళ్లలో ముందంజ…
గత నవంబర్ నుంచి ఇంటి పన్నుల వసూళ్ల కార్యక్రమాన్ని మండల వ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఆయా పంచాయతీలకు చెందిన కార్యదర్శులు ఉదయాన్నే గ్రామాలకు చేరుకోవడం, ఇంటి యజమానులను పన్నులు చెల్లించేలా వారికి అవగాహన కల్పిస్తూ వసూళ్ల కోసం ఇంటింటికీ తిరుగుతున్నారు. జిల్లా, డివిజన్ పంచాయతీ అధికారి తనిఖీలు, ఆదేశాలు, సమావేశాలతో వందశాతం పన్నులు వసూలయ్యేలా ముందంజలో ఉన్నారు.
17 పంచాయతీల్లో వంద శాతం
మార్చి నాటికి వంద శాతం లక్ష్యాన్ని పూర్తి చేయాల్సి ఉండగా. ఇప్పటికే 17 గ్రామ పంచాయతీలు తమ లక్ష్యాన్ని 100 శాతం పూర్తి చేసి ముందంజలో నిలిచారు. మరో తొమ్మిది పంచాయతీలు 96 నుంచి 98 శాతం మేర లక్ష్యా న్ని ఇప్పటికే పూర్తి చేశాయి. ఆద్యిమాన్ (55.32శాతం), డొంగర్గావ్ (83.14), గాదిగూడ (59.73), ఖండో(78శాతం), కొలామా(66.21), లోకారి (81.02), లోకారి(కే)(75.78). రాంపూర్ (84.82), సాంగ్వీ(88.33శాతం) పూర్తి చేసి లక్ష్యానికి చేరువలో ఉన్నాయి.
వందశాతం పూర్తి చేస్తాం
మార్చి నాటికి వంద శాతం పూర్తి చేయాల్సి ఉంది. పంచాయతీ కార్యదర్శులు ఉదయాన్నే గ్రామాలకు చేరుకొని పకడ్బందీగా ఇంటి పన్నులు వసూలు చేస్తున్నారు. డీపీవో, డీఎల్పీవో అధికారుల తనిఖీలతో త్వరగా వసూలు చేయగలుతున్నాం. త్వరలోనే మిగిలిన పంచాయతీల్లో పూర్తి చేస్తాం.
–సాయిప్రసాద్, మండల పంచాయతీ అధికారి, గాదిగూడ