మంచిర్యాల, జూలై 1(నమస్తే తెలంగాణ ప్రతినిధి) ; తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే విజయ డెయిరీ పాలను అన్ని ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలు(హాస్టళ్ల)లకు సరఫరా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కస్తూర్బా పాఠశాలలు, కళాశాల హాస్టళ్లలో వినియోగాన్ని తప్పనిసరి చేశారు. మంచిర్యాల జిల్లాలోనూ ప్రసుత్తం అన్ని హాస్టళ్లకు పాలను సరఫరా చేస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాలను ఆసరా చేసుకుని మంచిర్యాల జిల్లాలో విజయ డెయిరీ అధికారులు, ఏజెన్సీలతో కుమ్మక్కై ప్రతి లీటర్ పాలపై అదనంగా రూ.2 వసూలు చేస్తున్నారు. విజయ టోన్డ్ మిల్క్ లీటర్ ధర రూ.60 ఉంటే, సంక్షేమ హాస్టళ్లకు రూ.62 చొప్పున ఇస్తున్నారు. జిల్లాలో ప్రతి రోజు అన్ని హాస్టళ్లకు 2 వేల లీటర్ల పాల నుంచి 2500 లీటర్లు అవసరం అవుతాయని సమాచారం. ఈ లెక్కన లీటర్‌పై రూ.2 చొప్పున రోజు రూ.4 వేల నుంచి రూ.5 వేల అవుతాయి. నెలకు రూ.1.20 లక్షల నుంచి రూ.1.50 లక్షలు అదనంగా అవుతాయి. హాస్టళ్లు నడిచే 10 నెలల కాలానికి రూ.12 లక్షల నుంచి రూ.15 లక్షలు అవుతున్నాయి. ఈ మొత్తం ఎవరికి జేబుల్లోకి వెళ్తున్నాయి? ఉన్నతాధికారుల నుంచి హాస్టల్ స్థాయి దాకా ఇందులో ఎవరి వాటా ఎంత? దాదాపు కొన్నేళ్లుగా జరుగుతున్న ఈ తతంగానికి బాధ్యులు ఎవరు? అన్నది తేలాల్సి ఉంది.
విజయ టోన్డ్ మిల్క్ లీటర్ ధర రూ.60 ఉంటే, సంక్షేమ హాస్టళ్లకు రూ.62 లీటర్ చొప్పున ఇస్తున్నారు. మంచిర్యాల జిల్లాలో రోజు అన్ని హాస్టళ్లకు 2 వేల లీటర్ల పాల నుంచి 2500 లీటర్ల పాలు అవసరం అవుతాయని సమాచారం. ఈ లెక్కన లీటర్‌పై రూ.2 చొప్పున రోజు రూ.4 వేల నుంచి రూ.5 వేల చొప్పున నెలకు రూ.1.20 లక్షల నుంచి రూ.1.50 లక్షలు అవుతున్నాయి. హాస్టళ్లు నడిచే 10 నెలల కాలానికి రూ.12 లక్షల నుంచి రూ.15 లక్షలు అవుతున్నాయి.
కలెక్టర్ ప్రొసీడింగ్స్‌తో వెలుగులోకి..
మంచిర్యాల జిల్లాలోని పది తెలంగాణ సోషల్ వెల్ఫేర్ ఇనిస్టిట్యూషన్లకు విజయ పాలను సరఫరా చేసేందుకు ఇటీవల కలెక్టర్ కుమార్ దీపక్ ఉత్తర్వులు జారీ చేశారు. 2025-26 విద్యా సంవత్సరానికి లీటర్‌కు రూ.62 చొప్పున పాలు సరఫరా చేసేందుకు ఆదిలాబాద్ జిల్లా విజయ డెయిరీ డిప్యూటీ డైరెక్టర్ సూచనల మేరకు ఓ డిస్ట్రిబ్యూటర్(సంస్థ)కు ఈ బాధ్యతలు అప్పగిస్తున్నట్లు పేర్కొన్నారు. అది కూడా టెండర్ లేకుండా చేయాలని విజయ డెయిరీ డిప్యూటీ డైరెక్టర్ కోరారని, ఈ మేరకు సదరు సంస్థకు టెండర్ లేకుండానే పాల సరఫరా చేసేందుకు అనుమతులు ఇస్తున్నట్లు అందులో స్పష్టంగా పేర్కొన్నారు.
ఇక్కడే విజయ డెయిరీ అధికారులు కలెక్టర్‌ను తప్పుతోవ పట్టించినట్లు తెలిసింది. లీటర్ పాల ధర రూ.60 ఉంటే, రూ.62(ఇన్క్లూడింగ్ ట్రాన్స్పోర్ట్ చార్జి) అని చెప్పి అధిక ధరకు ప్రొసిడింగ్స్ ఇప్పించుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిబంధనల ప్రకారం హాస్టళ్లకు విజయ పాలు సరఫరా చేసేందుకు టెండర్లు పిలవాలి. అందులో ఎవరు తక్కువకు కోట్ చేసిన వారికి అవకాశం కల్పించాలి. అది చేయకుండా ఆదిలాబాద్ డీడీ చెప్పడం, దాన్ని అనుసరించి జిల్లా పర్చేజ్ కమిటీ చైర్మన్‌గా ఉన్న కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేయడం అనుమానాలకు తావిస్తున్నది.
ఉమ్మడి జిల్లాతోపాటు ఇతర జిల్లాల్లోనూ ఇదే తంతు?
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన విజయ డెయిరీ డిప్యూటీ డైరెక్టర్(డీడీ) ఆదిలాబాద్‌లో ఉన్నారు. విజయ డెయిరీ డీడీ చేసిన సిఫార్సుల ఆధారంగానే మంచిర్యాల కలెక్టర్ ప్రొసీడింగ్స్ ఇచ్చినట్లు తెలిసింది. ఉమ్మడి జిల్లాలో ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల(లక్షెట్టిపేట)లో విజయ డెయిరీ బీఎంసీ(బల్క్ మిల్క్ చిల్లింగ్ సెంటర్లు) ఉన్నాయి. జిల్లాలో ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో ముగ్గురు డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారు. ఈ డిస్ట్రిబ్యూటర్లలో మంచిర్యాలలో ఉన్న వారు మంచిర్యాల, నిర్మల్ జిల్లాలో ఉన్న డిస్ట్రిబ్యూటర్ నిర్మల్‌తోపాటు జగిత్యాల జిల్లా, ఆదిలాబాద్ డిస్ట్రిబ్యూటర్ ఆదిలాబాద్‌తోపాటు ఆసిఫాబాద్, పెద్దపల్లి జిల్లాల్లోని సంక్షేమ హాస్టళ్లకు పాలు సరఫరా చేస్తున్నారు. వీటన్నింటినీ ఆదిలాబాద్ డీడీనే పర్యవేక్షిస్తున్నారు.
మంచిర్యాల జిల్లా కలెక్టర్‌కు ఎలాగైతే డీడీ తప్పుతోవ పట్టించారో అలాగే మిగిలిన జిల్లాల కలెక్టర్లను తప్పుతోవ పట్టించి ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. డిస్ట్రిబ్యూటర్లతో కుమ్మక్కై ఒక జిల్లాలో చేసిన వారు మిగిలిన జిల్లాల్లోనూ అదే చేసి ఉండవచ్చని, దీనిపై సమగ్ర విచారణ జరపాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. 2020 నుంచి జిల్లాలో ఈ తంతు కొనసాగుతున్నట్లు తెలిసింది. అప్పటి నుంచి ఉమ్మడి జిల్లా విజయ డెయిరీ ఇన్చార్జిగా ఉన్న అధికారే ఈ వ్యవహారంలో చక్రం తిప్పుతున్నారని తెలిసింది. ప్రస్తుతం హైదరాబాద్‌కు బదిలీపై వెళ్లిపోయిన సదరు అధికారి, ఇన్చార్జిని గుప్పిట్లో పెట్టుకుని ఈ దందాను కొనసాగిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. విజయ పాలు సరఫరా చేసేందుకు కొత్త డిస్ట్రిబ్యూటర్లు ముందుకు వస్తున్నప్పటికీ వారికి అవకాశం ఇవ్వకుండా, కొన్నేళ్లుగా పాత డిస్ట్రిబ్యూటర్లనే కొనసాగిస్తుండడం ఈ ఆరోపణలకు బలం చేకూరుస్తున్నది.
రవాణా చార్జీలు, కమిషన్ కలుపుకునే రూ.60
వాస్తవానికి విజయ డెయిరీ డిస్ట్రిబ్యూటర్లకు లీటర్ పాలను రూ.53కే సరఫరా చేసింది. ఎంఆర్పీ రూ.60లో రూ.2 రవాణా చార్జీలు, మిగిలిన రూ.5 డిస్ట్రిబ్యూటర్‌కు కమిషన్ కింద ఇస్తారు. అంటే నిబంధనల ప్రకారం.. ఎంఆర్పీ ధరకు మించి పాలు విక్రయించడానికి లేదు. హైదరాబాద్ నుంచి పాలు వేరే ప్రాంతానికి తీసుకువెళ్లాల్సి వస్తే ఎంఆర్పీపై అదనంగా రూ.2 తీసుకోవచ్చని విజయ డెయిరీ ఉన్నతాధికారులు తెలిపారు. గతంలో మంచిర్యాల జిల్లాకు విజయ డెయిరీ బీఎంసీ యూనిట్ లేనప్పుడు నిజామాబాద్ నుంచి పాలు సరఫరా చేశారు.
ఆ సమయంలో రూ.2 అదనంగా తీసుకున్నారు. మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేటలో 2016లోనే బీఎంసీ యూనిట్ ఏర్పాటైంది. నిత్యం 4వేల లీటర్ల పాలు ఇక్కడి నుంచి వస్తున్నాయి. ప్రస్తుతం మంచిర్యాలలోని హాస్టళ్లకు డిస్ట్రిబ్యూటర్ సరఫరా చేసే పాలు ఇక్కడి నుంచే వస్తున్నాయి. అలాంటప్పుడు రూ.2 రవాణా చార్జీలు అదనంగా చెల్లించాల్సిన అవసరం లేదు. పాత పద్ధతిలోనే కొన్నేళ్లుగా లీటర్ పాలపై రూ.2 అదనపు దోపిడీకి పాల్పడుతుండడం గమనార్హం. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ చేసి, అక్రమాలకు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్ వినిపిస్తున్నది.
ఎంఆర్పీకి ఇచ్చేలా చేస్తాం..
చాలా సంవత్సరాల నుంచి ఎంఆర్పీపై రూ.2 అదనంగా చెల్లిస్తున్నారు. అదే పద్ధతుల్లో మేము చేశాం. విజయ డెయిరీ ఆదిలాబాద్ డీడీ చేసిన ప్రపోజల్స్ మేరకు ఆదేశాలు ఇచ్చాం. ఎంఆర్పీకి ఇవ్వాలన్న విషయంపై ఆరా తీస్తున్నాం. విజయ డెయిరీ అధికారులతో మాట్లాడి, రానున్న రోజుల్లో ఎంఆర్పీ ధరకు పాలు సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటాం.
– కుమార్ దీపక్, కలెక్టర్, మంచిర్యాల