ఖానాపూర్ రూరల్, మార్చి 21: నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్ మండలంలో సత్తనపల్లిలో అధికార పార్టీ నాయకుడికి చెందిన రైస్ మిల్లులపై విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులతో పాటు స్పెషల్ టాస్ ఫోర్స్ బృందం ఆధ్వర్యంలో తనిఖీలు చేశారు. గురువారం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు తనిఖీలు చేశారు.
ఇందుకు సంబంధించిన వివరాలను శుక్రవారం అధికారులు వెల్లడించారు. ఈ తనిఖీల్లో 12,202.203 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం తేడాగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీని విలువ సుమారు రూ.26 కోట్ల వరకు ఉంటుందన్నారు. ఏఆర్ఎస్ ఇండస్ట్రీయల్ మిల్లులో రబీ సీజన్ 2022-2023- సంవత్సరానికి 5535.394 మెట్రిక్ టన్నులు, రబీ సీజన్ 2023-2024 సంవత్సరానికి 2783.060 మెట్రిక్ టన్నులు తేడాగా ఉందని గుర్తించారు.
ఏఆర్ఎస్ ఆగ్రో మిల్లులో రబీ సీజన్ 2022-2023 సంవత్సరానికి 3883.749.మెట్రిక్ టన్నులు తేడాగా ఉన్నట్లు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు గుర్తించారు. పూర్తి విచారణ అనంతరం రెవెన్యూ రీకవరి యాక్ట్ ప్రకారం అవసరమైతే యాజమాన్యంపై కేసులను నమోదు చేస్తామని అధికారులు తెలిపారు. ఈ దాడుల్లో ఓఎస్డీ స్పెషల్ టీం అధికారి శ్రీధర్ రెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ రంజిత్ కుమార్, టెక్నికల్ అసిస్టెంట్లు తిరుపతి, అజిశ్, తదితరులు ఉన్నారు.