నమస్తే తెలంగాణ ఆదిలాబాద్ ఫొటోగ్రాఫర్/జైనథ్, సెప్టెంబర్ 9 : ఆదిలాబాద్ జిల్లా భోరజ్ మండలంలోని తర్నం వంతెన ప్రమాదకరంగా మారింది. చిన్నపాటి వర్షాలతోపాటు సాత్నాల ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో నీరు వంతెన పైనుంచి ఉధృతంగా ప్రవహిస్తున్నది. దీంతో ఆదిలాబాద్ నుంచి మహారాష్ట్రకు వెళ్లే వాహనాలు నిలిచిపోయాయి. మంగళవారం వంతెన పైనుంచి వాహనాలు వెళ్తుండగా.. నీటి ప్రవాహం ఒక్కసారిగా రావడంతో లారీలు వంతెన నీటి ప్రవాహంలో చిక్కుకున్నాయి. ముందుగా నీటి ప్రవాహాన్ని గమనించిన డ్రైవర్లు వాహనాలను నిలిపి బయటకొచ్చారు.
పోలీసుల సహకారంతో క్రెయిన్ ఏర్పాటు చేసి వరద నీటిలో చిక్కుకున్న లారీలను బయటకు తీసుకొచ్చారు. కార్లు, ద్విచక్ర వాహనాలు, ఆటోలను దారి మళ్లీంచి లాండసాంగ్వి మీదుగా పంపించారు. దీంతో బ్రిడ్జికి ఇరువైపులా భారీ సంఖ్యలో లారీలు నిలిచిపోయాయి. బ్రిడ్జికి రెండు వైపుల ప్రమాద సూచీలను పోలీసులు ఏర్పాటు చేశారు. ఇటీవల రెండు లారీలు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయిన విషయం విధితమే. రూ.4.50 కోట్లతో గతేడాది నిర్మించిన ఈ వంతెన వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని స్థానికులు చర్చించుకుంటున్నారు.