కుమ్రం భీం ఆసిఫాబాద్, డిసెంబర్ 19 (నమస్తే తెలంగాణ) : “ఆరుగాలం శ్రమించి పండించిన పత్తిని ఓ రైతు జిన్నింగ్ మిల్లులో అమ్మేందుకు తీసుకువచ్చాడు. అధికారి పత్తిలోని తేమను పరీక్షించాడు. తేమ శాతం ఎక్కువగా ఉంది సీసీఐ ద్వారా కొనలేమని చెప్పాడు. అంతలోనే పక్కనున్న దళారీ క్వింటాలుకు రూ. 6500 చొప్పున కొంటానని ముందుకొచ్చాడు. గత్యంతరం లేని పరిస్థితిలో ఆ రైతు దళారీకి 30 క్వింటాళ్ల పత్తిని విక్రయించాడు. ఆపై దళారీ అదే జిన్నింగ్ మిల్లులో క్వింటాలుకు రూ. 7521 చొప్పున సీసీఐకి పత్తిని అమ్మేశాడు. రైతు చూస్తుండగానే సదరు వ్యాపారి రూ. 30 వేలకు పైగా లాభాన్ని పొందగా, రైతు మాత్రం తీవ్రంగా నష్టపోయాడు.” సాక్షాత్తూ సీసీఐ అధికారుల సహకారంతో జిన్నింగ్ మిల్లులో తిష్టవేసిన దళారులు(జిన్నింగ్ మిల్లుల యజమానులు ఏర్పాటు చేసుకున్న వ్యక్తులు) రైతులను నిండా ముంచుతున్నారు. తేమ పేరుతో సీసీఐ అధికారులు పత్తిని కొనేందుకు నిరాకరించడం.. వెంటనే దళారులు రైతుల వద్ద పత్తిని కొనుగోలు చేయడం. అదే పత్తిని సీసీఐకి ఎక్కువ ధరకు దళారులు విక్రయించడం.. ఇక్కడ పరిపాటిగా మారింది.
దళారుల నిలువుదోపిడీ..
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 17 జిన్నింగ్ మిల్లులు ఉన్నాయి. ఆలస్యంగా సేకరణ ప్రారంభించిన సీసీఐ రై తుల నుంచి పత్తి కొనుగోలు చేసేందుకు అనేక ఆంక్షలు పెడుతున్నది. దళారులతో కలిసి పత్తి రైతులను నిలువు నా ముంచుతున్నది. సీసీఐ 8 శాతం తేమ ఉన్న ఏ గ్రేడ్ పత్తి క్వింటాలుకు రూ. 7521, 9 నుంచి 12 శాతం తే మ ఉంటే ఒక్కో శాతానికి రూ. 75 ధర తగ్గించి కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఒకసారి పత్తిని రైతు మార్కెట్‌కు తీసుకువచ్చిన తర్వాత దానిని తిరిగి తీసుకుపోవ డం ఉండదు. అధికారులు తేమ పేరుతో నిరాకరించినప్పటికీ పత్తిని తప్పని సరిగా అమ్ముకొని పోవాల్సి ఉం టుంది. పత్తిలో తేమ ఎక్కువగా ఉందని చెబితే దానికి తిరిగి తీసుకువెళ్లి ఆరబెట్టుకోవడం కుదరదు.
ఒకవేళ తిరిగి తీసుకుపోవాలనుకున్నా శ్రమతో పాటు వాహన ఛార్జీలు ఎక్కువగా అవుతాయి. దీంతో జిన్నింగ్ మిల్లుకు పత్తి తీసుకువచ్చిన రైతులు తప్పనిసరి పరిస్థితుల్లో పత్తిని అమ్ముకుంటారు. ఇదే అదనుగా భావించి దళారులు ప త్తిలో తేమ ఎక్కువగా ఉందనో, ఇటీవల వర్షాలకు రంగుమారిందనో సాకులు చూపి కొనుగోలు చేసేందుకు సీసీ ఐ అధికారులు నిరాకరిస్తుండగా, అదేపత్తిని దళారులు అక్కడే కొని అదే జిన్నింగ్ మిల్లుల్లో విక్రయిస్తూ అందినకాడికి దండుకుంటున్నారు. దళారులు తమకు తెలిసిన రైతుల పట్టాపాస్ బుక్కులు, ఆధార్‌కార్డు, బ్యాంకు ఖాతాలను ఆన్లైన్లో అనుసంధానం చేయిస్తూ పత్తిని దర్జాగా విక్రయిస్తున్నారు. ఇదంతా మార్కెట్ అధికారుల ముందే జరుగుతున్నప్పటికీ ఎవరూ పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి.