సీసీసీ నస్పూర్, మార్చి 31 : నస్పూర్ మున్సిపాలిటీ పరిధి సీసీసీ సింగరేణి స్థలం, సీతారంపల్లి గోదావరి రేవులో వైకుంఠధామాల నిర్మాణాలకు బ్రేకులుపడ్డాయి. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో మంజూరైన పనులకు.. ప్రస్తుత సర్కారు అలసత్వం.., అధికారుల నిర్లక్ష్యానికి తోడు మున్సిపాలిటీ కాస్త కార్పొరేషన్‌గా మారడంతో నిధులు నిలిచిపోయి నీలినీడలు కమ్మకున్నాయి. కాగా, శ్మశానవాటికలు అందుబాటులోకి రాకపోవడంతో పాత పద్ధతిలోనే దహన సంస్కారాలు కొనసాగిస్తున్నామని, వెంటనే కొత్తవి అందుబాటులోకి తేవాలని ప్రజల నుంచి డిమాండ్లు వినిపిస్తున్నాయి.
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో 2022లో అన్ని మున్సిపాలిటీల్లో వైకుంఠధామాలు నిర్మించాలని సంకల్పించింది. ఈ మేరకు అత్యధిక జనాభా ఉన్న నస్పూర్‌లో రెండు నిర్మించాలని అప్పటి పాలకవర్గం నిర్ణయించింది. ఈ మేరకు మున్సిపాలిటీ పరిధిలోని పలు ప్రాంతాల్లో స్థలాలను పరిశీలించారు. చివరికి సీసీసీ టౌన్‌షిప్‌లోని కేజీబీవీ వెనుక భాగంలో గల సింగరేణి స్థలంలో ఇప్పటికే ఉన్న స్మశానవాటికను, సీతారాంపల్లి గోదావరి వద్ద ఉన్న మరో స్మశానవాటిక స్థలాన్ని ఎంపిక చేశారు. సీసీసీలో ఒక వైకుంఠదామం, గోదావరి రేవులో మరోటి నిర్మాణం చేపట్టారు. అయితే ఎన్నికలు రావడం.., ప్రభుత్వం మారడంతో వీటిపై నీలినీడలు కమ్మకున్నాయి. నిధులు నిలిచిపోయాయి. ప్రస్తుతం మున్సిపాలిటీ కాస్తా మున్సిపల్ కార్పొరేషన్‌గా మారడంతో పనులు అసంపూర్తిగానే మిగిలిపోయాయి. నిధులు వస్తేనే పనులు జరగాలి, ఒక వేళ విడుదల చేయకుంటే వీటి నిర్మాణం ప్రశ్నార్థకమే.
నస్పూర్ పట్టణంలో 80 వేల పైచిలుకు జ నాభా ఉంది. 60 వేల మందికిపైగా ఓటర్లు ఉన్నారు. సింగాపూర్, నస్పూర్, తాళ్లపల్లి, తీగల్పహాడ్లు గ్రామ పంచాయతీలుగా కొనసాగాయి. ప్రత్యేకంగా వైకుంఠధామాలు లే వు. సీతారాంపల్లి గోదావరి ఇన్‌టెక్‌వెల్, శ్రీ రాంపూర్, కృష్ణకాలనీ, సీసీసీ టౌన్షిప్, విలేజ్నస్పూర్, ఫ్లడ్కాలనీ ఇలా ఎవరి ప్రాంతా ల్లో వారు దహన సంస్కారాలు చేసేవారు. నీటి లభ్యత ఉండడంతో ఎక్కువ శాతం మం ది సీతారాంపల్లి గోదావరి ఇన్‌టెక్‌వెల్ వద్దకు వెళ్లేవారు. నస్పూర్ మున్సిపాలిటీగా ఏర్పడ డం.. తెలంగాణ తొలిముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని మున్సిపాలిటీల్లో వైకుంఠదామాలుని ర్మించి చివరి మజిలికి చిరు కానుకగా ఇవ్వాలనే సంకల్పించడంతో నస్పూర్‌కు వైకుంఠధామం మంజూరైంది. ఎక్కువ జనాభా ఉం డడంతో టీయూఎఫ్ఐడీసీ రూ.2 కోట్లతో నిర్మిస్తున్నారు.
ఇందులో సీసీసీలో ఒకటి, గో దావరి ఒడ్డున మరోటి రూ.కోటి నిధుల చొ ప్పున నిర్మిస్తున్నారు. సీసీసీలో 50 శాతం.., గోదావరి వద్ద 15 శాతం వరకు పనులు జరిగాయి. ప్రభుత్వం మారడంతో గతంలో వీటికి కేటాయించిన నిధులు విడుదల కాలేదు. దీంతో కాంట్రాక్టర్ పనులను నిలిపివేశారు. వైకుంఠధామాలు అందుబాటులోకి రాకపోవడంతో పాత పద్ధతిలోనే దహన సంస్కారాలు కొనసాగిస్తున్నామని, వెంటనే పనులు పూర్తిచేసి అందుబాటులోకి తీసుకురావాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.