మంచిర్యాల ప్రతినిధి/కుమ్రం భీం ఆసిఫాబాద్, సెప్టెంబర్ 13(నమస్తే తెలంగాణ) : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా యూరియా కొరత వేధిస్తున్నది. అవసరాలకు సరిపడా నిల్వలు లేకపోవడంతో రైతులు అరిగోస పడుతున్నారు. సాగుకు ఎరువులు వేసే సమయం దాటిపోతుండడంతో రైతులు వేకువజామునే సహకార సంఘాలు, ఆగ్రోస్ సెంటర్లు, డీసీఎంఎస్ కేంద్రాల వద్ద బారులుదీరుతున్నారు. వచ్చిన కొద్దిపాటి స్టాక్ గంటల వ్యవధిలోనే అయిపోతుండడంతో సాయంత్రం వరకు ఎదురు చూసి చివరకు రిక్త హస్తాలతోనే ఇంటిబాట పడుతున్నారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా శనివారం రైతులు యూరియా కోసం బారులుదీరారు. సొసైటీలకు వచ్చిన బస్తాల కంటే రైతులు అధిక మంది వస్తుండడంతో ఏం చేయాలో తోచక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. క్యూలో రైతులు ఉండగానే స్టాక్ అయిపోవడంతో టోకెన్లు రాసి ఇవ్వడం, రేపు రావాలని చెప్తుండడంతో నిరాశతో వెళ్తున్నారు. ఎరువులు సమయానికి చల్లక పంటలో ఎదుగుదల లోపించిందని, పంటలు చేతికి రాకపోతే రోడ్డున పడుతామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఒక యూరియా బస్తా బ్లాక్‌లో రూ.700 పలుకుతున్నది. అది కూడా ఇతర ఎరువులు కొంటేనే ప్రైవేటు డీలర్లు యూరియా ఇస్తున్నారు. రెండు రోజుల క్రితం బూరుగూడాకు చెందిన రైతు యూరియా కోసం సబ్సిడీ కేంద్రం ఎదుట రోజుల తరబడి నిరీక్షించాడు. దొరుకకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో జిల్లా కేంద్రంలోని ఓ ఫర్టిలైజర్ షాపులో కొనగోలు చేశాడు. యూరియా బస్తాతోపాటు మరో 20:20 ఎరువుల బస్తాను రైతుకు అంటగట్టిన ఫర్టిలైజర్ దుకాణ నిర్వాహకుడు రూ.1500 బిల్లు వసూలు చేశారు. గత్యంతరం లేక రైతు రూ.700 పెట్టి యూరియా కొనుగోలు చేయాల్సి వచ్చింది.
వర్షాకాలం ప్రారంభంలో యూరియాను అధికారులు సబ్సిడీ కేంద్రాలైన హాకా కేంద్రాలు, పీఎసీఎస్, ఆగ్రోస్ సెంటర్లు, డీసీఎంఎస్‌లకు ఇష్టానుసారంగా కేటాయించారు. వ్యాపారులు వాటిని రైతులకు సబ్సిడీపై ఇవ్వకుండా ప్రైవేటు ఫర్టిలైజర్ దుకాణాలకు తరలించి బ్లాక్ చేశారు. తీరా యూరియా అవసరం అయ్యాక సబ్సిడీ కేంద్రాల్లో కొరత ఏర్పడింది. దీనిని ఆసరాగా చేసుకుంటున్న వ్యాపారులు ధరలు పెంచేసి రైతులకు అమ్ముతున్నారు. వ్యవసాయ అధికారుల సహకారంతో బ్లాక్ దందా కొనసాగిస్తున్నారు. ఫలితంగా శనివారం దహెగాం, కౌటాల, సిర్పూర్-టి, చింతలమానెపల్లి, తిర్యాణి, బెజ్జూర్, పెంచికల్పేట్ మండలాల్లోని పీఏసీఎస్ కేంద్రాల ఎదుట వేల సంఖ్యలో రైతులు బారులుదీరడం కనిపించింది.
కాగజ్‌నగర్ రూరల్ సెప్టెంబర్ 13 : కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ మండలంలోని జంబుగా రైతువేదిక వద్ద శుక్రవారం అర్ధరాత్రి నుంచే రైతులు క్యూ కట్టారు. ఆగస్టులో టోకెన్లు తీసుకున్న రైతులకు మాత్రమే యూరియా పంపిణీ చేసినట్లు వ్యవసాయ అధికారి రామకృష్ణ తెలిపారు.
చెన్నూర్ రూరల్, సెప్టెంబర్ 13 : చెన్నూర్ మండలంలోని ఆస్నాద్ గ్రామంలో రైతులందరికీ యూరియా అందించాలని అధికారులను నిలదీస్తూ ఆందోళనకు దిగారు. ఆస్నాద్ గ్రామానికి 222 యూరియా బస్తాలు రాగా.. సుమారుగా 600 నుంచి 700 మంది రైతులు ఉదయాన్నే రైతువేదిక వద్ద బారులుదీరారు. వందల మంది ఉన్న గ్రామానికి యూరియా తక్కువగా కేటాయించడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఏఈవో సాగర్, పీఏసీఎస్ సిబ్బంది అక్కడి నుంచి వెళ్లిపోయారు. నాగాపూర్‌లో కూడా 222 బస్తాలే రావడం తో అక్కడ కూడా ఏఈవో శివరంజనిని నిలదీశారు. ఎస్ఐ సుబ్బారావు రైతులకు నచ్చచెప్పి యూరియా పంపిణీ కొనసాగించారు.
ఖానాపూర్, సెప్టెంబర్ 13 : నిర్మల్ జిల్లా ఖానాపూర్, సత్తనపెల్లి పీఏసీఎస్ కార్యాలయాల వద్దకు 400లకు పైగా రైతులు యూరియా కోసం తరలివచ్చారు. అందరికీ యూరియా అందడం లేదంటూ సత్తనపెల్లి పీఏసీఎస్ ఎదుట ఆందోళనకు దిగారు. ఒక లారి యూరియా(450 బస్తాలు) రాగా అవి సరిపోవడం లేదని మండిపడ్డారు. అధికారులు, పాలకులు స్పందించి యూరియా కొరత తీర్చాలని రైతులు డిమాండ్ చేశారు.
రెబ్బెన, సెప్టెంబర్ 13 : కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన పీఏసీఎస్‌కు రెండు లారీల యూరియా లోడ్ రావడంతో మహిళలు, రైతులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఒక్కో రైతుకు రెండు బస్తాలు పంపిణీ చేశారు. కొంతమందికి అందకపోవడంతో వారికి సోమవారం పంపిణీ చేస్తామని రెబ్బెన వ్యవసాయశాఖ అధికారి దిలీప్ తెలిపారు.
దహెగాం, సెప్టెంబర్ 13 : కుమ్రం భీం ఆసిఫా బాద్ జిల్లా దహెగాం పీఏసీఎస్ వద్దకు శనివారం ఉదయం ఆరు గంటల నుంచే మహిళలు, రైతులు దాదాపు 2 వేల మంది తరలివచ్చారు. 440 బస్తాలే రావడంతో ఒక్కొక్కరికీ ఒక్కటే బస్తా అందించారు. అయినా వందల మంది నిరాశతో వెనుదిరిగారు. గిరివెల్లి రైతు వేదిక వద్ద లారీ లోడు యూరియా బస్తాలను పంపిణీ చేయగా అక్కడ కూడా చాలా మందికి యూరియా దొరకలేదు.
భైంసా, సెప్టెంబర్ 13 : నిర్మల్ జిల్లా భైంసా పట్ణణంలోని రాహుల్‌నగర్‌లో గల మిర్జాపూర్ పీఏసీఎస్ గోదాం వద్ద యూరియా కోసం రైతులు ఇబ్బందులు పడ్డారు. శనివారం యూరియా వచ్చిందని తెలియడంతో కామోల్‌కు చెందిన దాదాపు 160 మందికిపైగా రైతులు ఉదయాన్నే వచ్చి గంటల తరబడి క్యూలో నిలబడ్డారు. ఒక్కొక్కరికి మూడు చొప్పున పంపిణీ చేశారు. దాదాపు 15 మంది దొరకక పోవడంతో వెనుదిరిగారు.
స్థానిక పీఏసీఎస్ కేంద్రంలో యూరియా కోసం నెల రోజుల క్రితం డబ్బులు చెల్లించి టోకెన్ తీసుకున్నా. ఇప్పటికీ ఎరువులు మాత్రం అందలేదు. పొలాలను వదిలేసి నెల రోజుల సంది పీఏసీఎస్ కేంద్రం చుట్టే తిరుగుతున్నా. యూరియా వేయకపోవడం వల్ల దిగుబడిపై తీవ్రమైన ప్రభావం చూపుతుంది. ఇగ, చేసిన అప్పులు ఎలా తీర్చాలో అర్థం కావడం లేదు.
– గంగారాం, లగ్గాం, దహెగాం మండలం.
మా నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలో వరి అధికంగా సాగవుతుంది. నాకున్న ఏడెకరాల భూమిలో వరి వేశా. ఇప్పుడు వరి పొట్ట దశలో ఉంది. సరైన మోతాదులో యూరియా వేస్తేనే మంచి దిగుబడి వస్తుంది. ఖానాపూర్ సొసైటీలో యూరియా దొరకడం లేదు. మా కుటుంబం మొత్తం వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తం. కొరత ఉండడంతో ఏం చేయాలో తోచడం లేదు. ఉన్నతాధికారులు సరిపడా అందేలా చర్యలు తీసుకోవాలి.
– బొరువొంతుల రమణ, రైతు, తర్లపాడు
మా సొంత భూమిలో నాలుగెకరాలో వరి వేశా. నాట్లు పూర్తి చేసి నెల రోజులు గడవంతో మొదటి దఫా యూరి యా వేయలేదు. సత్తనపెల్లి పీఏసీఎస్ చుట్టూ తిరుగుతు న్నా. వరి ఎదుగుదల కోసం యూరియా చాలా అవసరం. సత్తనపెల్లి సొసైటీ వద్ద ఆధార్ కార్డు, పాస్ బుక్ క్యూలో పెట్టి రెండు బ్యాగులు తీసుకున్నా. ఇంకా రెండు బ్యాగులు ఇస్తే మొదటి దఫా మందు చల్లడానికి సరిపోతుంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఈ విధంగా లేదు. కావాల్సినంత ఎరువులు లభించాయి.
– ఈసారపు నవీన్, యువ రైతు, గోసంపల్లె