నెన్నెల, ఆగస్టు 31 : మంచిర్యాల జిల్లా నెన్నెల మండలంలోని ఓ డీసీఎంస్ సెంటర్ నుంచి పెద్ద మొత్తంలో యూరియా మాయమైనట్లు తెలుస్తున్నది. ఒక్కో రైతుకు ఒకటీ.. రెండు బస్తాలే ఇచ్చి.. 20 వరకూ అందించినట్లు ఆన్లైన్లో నమోదు చేసి.. మిగతావి బ్లాక్ మార్కెట్‌కు తరలించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు ఒక్కో ఆధార్ కార్డుపై 10 నుంచి 20 బస్తాలకు పైగా తీసుకున్నట్లు నమోదైన వారి వివరాలను వ్యవసాయ శాఖ అధికారులు తీసుకుంటుండగా, పలు అనుమానాలకు తావిస్తున్నది. నేరుగా రైతులకు ఫోన్లు చేసి ఎంత భూమి సాగు చేశారు.. ఎన్ని బస్తాల యూరియా తీసుకున్నారు.. అంటూ ఆరా తీస్తున్నారు.
ఆధార్ కార్డులు, భూమి పట్టా పాస్ బుక్‌లు తీసుకొని జిల్లా కార్యాలయానికి వచ్చి వివరణ ఇవ్వాలని కోరుతున్నారు. తమకు ఆధార్ కార్డు మీద రెండే బస్తాలు ఇచ్చారని.. కానీ 20 వరకూ తీసుకున్నట్లు నమోదు చేసిన విషయం తమకు తెలియదని రైతులు ఆందోళన చెందుతున్నారు. వ్యవసాయ శాఖ నిబంధనల ప్రకారం ఎకరం భూమి ఉన్న వారికి ఒకే బస్తా ఇవ్వాలి. ఒక నెలలో ఒకసారి ఆధార్‌కార్డు నమోదు చేసుకుంటే తిరిగి మరో నెలలోనే అవకాశముంటుంది. కానీ, నిర్వాహకులు భూమిలేకున్నా ఆధార్‌కార్డులు తీసుకొని బస్తాలు అమ్మినట్లు చూపిస్తున్నారు. తెలిసిన వారి ఆధార్ నంబర్లను డైరీలో రాసుకొని.. ప్రతి నెలా వారికి ఫోన్ చేసి ఓటీపీలు అడిగి మరీ బస్తాలు మాయం చేశారని తెలుస్తున్నది. ఇక్కడి నుంచి బస్తాలను మహారాష్ట్రకు సైతం తరలించినట్లు సమాచారమున్నది.
గొల్లపల్లి గ్రామానికి చెందిన పలువురు రైతులు ఇప్పటికే వ్యవసాయ అధికారులను కలిసి వివరణ ఇచ్చారు. కొందరు రైతులు నిర్వాహకులకు ఫోన్ చేసి మాకెప్పుడు అన్ని బస్తాలిచ్చారని నిలదీయగా, కంగుతిన్న వారంతా.. మీకు ఏమీ కాకుండా చూస్తానంటూ తప్పించుకున్నట్లు తెలిసింది. ఒక్క నెన్నెల మండలం నుంచే సుమారు ఆరు లారీల (48 టన్నులు) యూరియా బ్లాక్ మార్కెట్‌కు తరలించినట్లు తెలుస్తుండగా, జిల్లాలోని మిగితా సెంటర్ల నుంచి ఎన్ని వందల టన్నుల యూరియా స్వాహా చేశారోనన్న అనుమానాలున్నాయి.
ఇటీవల కోటపల్లిలోని అంతర్రాష్ట్ర చెక్ పోస్టు సమీపంలో మహారాష్ట్రకు తరలిస్తున్న యూరియాను పోలీసులు పట్టుకున్న విషయం విదితమే. ఇలా ఎంతపెద్ద మొత్తంలో యూరియా తరలివెళ్లిందో అధికారులు తీగ లాగితే కాని తెలియదు. ఈ విషయమై ఏవో పుప్పాల సృజనను సంప్రదించగా.. రైతుల నుంచి వివరణ తీసుకుంటున్నామని, నిజంగా రైతులు యూరియా తీసుకున్నారా.. లేక ఎవరైనా బ్లాక్ మార్కెట్‌కు తరలించారా అన్న కోణంలో వివరాలు తెలుసుకుంటున్నామన్నారు.