“రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు అధిక ధరలకు విక్రయించినా.. కృత్రిమ కొరత సృష్టించినా.. వ్యాపారులపై కఠిన చర్యలు ఉంటాయి. ఎరువులు, విత్తనాల స్టాక్ నిల్వలు, ధరల పట్టికలను ప్రతి ఫర్టిలైజర్ దుకాణం ఎదుట ప్రదర్శించాలి. అధిక ధరలకు విక్రయించినట్లు తెలిసినా, బ్లాక్ చేసిన, ఇతర అక్రమ మార్గాల్లో తరలించిన కేసులు నమోదు చేస్తాం.”
– వాంకిడి, రెబ్బెన మండలాల్లో ఫర్టిలైజర్ షాపుల తనిఖీలో ఆసిఫాబాద్ కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే.
“వ్యాపారులు యూరియాను రూ.400 అమ్ముకోవచ్చు. వ్యాపారులకు లోడింగ్, అన్ లోడింగ్, ట్రాన్స్పోర్ట్ చార్జీలు ఉంటాయి. అందుకే యూరియా బస్తా రూ.400లకు విక్రయించుకోవచ్చు”.
– కౌటాలలోని రైతు వేదికలో చింతలమానేపల్లి మండల వ్యవసాయ అధికారి, ప్రితీష.
కుమ్రం భీం ఆసిఫాబాద్, జూలై 8(నమస్తే తెలంగాణ) : రాష్ట్రవ్యాప్తంగా 45 కిలోల యూరియా బస్తా ఎంఆర్పీ రూ.270. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో మాత్రం రూ.270కి విక్రయించాల్సిన బస్తాను రూ.400లకు విక్రయిస్తూ రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారు. రవాణా చార్జీ పేరిట బస్తాపై రూ.20 నుంచి రూ.30 వరకు అదనంగా వసూలు చేసేవారు. ఇప్పుడు ఏకంగా బస్తాపై రూ.130 అదనంగా తీసుకోవడంపై రైతులు భగ్గుమంటున్నారు.
సబ్సిడీపై యూరియా అందించాల్సిన హాకా సెంటర్లను బినామీ పేరిట ఫర్టిలైజర్ దుకాణాల యాజమానులే నడిపిస్తున్నారు. హాకా కేంద్రాలకు వచ్చే టన్నుల కొద్ది యూరియాను బ్లాక్ చేసి ఫర్టిలైజర్ షాపులకు తరలిస్తున్నారు. సబ్సిడీపై ఇవ్వాల్సిన యూరియాను రూ.130కి అదనంగా విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. పక్షం రోజుల క్రితం పెంచికల్పేట్ మండలంలోని ఓ హాకా సెంటర్‌కు వచ్చిన 160 టన్నుల సబ్సిడీ యూరియాను ఆ హాకా సెంటర్ నిర్వహకుడు తన ఫర్టిలైజర్ దుకాణానికి తరలిస్తూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుపడ్డాడు. ఆ సెంటర్ నిర్వాహకుడిపై చర్యలు లేవు.
ఇలాంటి బ్లాక్ మార్కెట్ దందాను అడ్డుకోవాల్సిన అధికారులే పైపెచ్చు యూరియా బస్తాను రూ.400లకు అమ్ముకోవచ్చంటూ ప్రకటనలు చేస్తున్నారు. బ్లాక్ చేసిన, పట్టుబడిన వ్యాపారులపై చర్యలు తీసుకోకుండా “వ్యాపారులు నిజాయితీ పరులే.. రైతులే అసత్యపు ఆరోపణలు చేస్తున్నారు. వ్యాపారులు సబ్సిడీ యూరియాను బ్లాక్‌మార్కెట్‌కు తరలించడం లేదు”. అంటూ మొన్నటికి మొన్న కెరిమెరి మండల వ్యవసాయ అధికారి ప్రకటించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని కలెక్టర్ చెబుతుంటే.. వ్యవసాయశాఖ అధికారులు మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. అధికారుల అంతర్గత సహకారంతోనే యూరియా దొరక్క జిల్లాలోని రైతులు రోడ్డెక్కుతున్నారు. ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా వ్యవసాయ శాఖ, జిల్లా ఉన్నతాధికారులు పట్టించుకున్న పాపాన పోవడం లేదు.
యూరియా అందించడంలో విఫలం
ఈ వానకాలంలో 60 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవరమవుతుందని అంచనా వేసిన అధికారులు రైతుల అవసరానికి తగ్గట్టుగా యూరియాను అందుబాటులో ఉంచడంలో విఫలమయ్యారు. జిల్లాలో 18 ఆగ్రో సెంటర్స్, 25 డీసీఎంఎస్ సెంటర్లు, 12 పీఏసీఎస్‌లు, 12 హాకా కేంద్రాలు, 4 రైతు ఫార్మర్ సొసైటీలు ఉన్నాయి.
ఇప్పటివరకు 25 వేల మెట్రిక్ టన్నుల యూరియా జిల్లాకు వచ్చినట్లు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీనివాసరావు తెలిపారు. రైతులకు సబ్సిడీపై యూరియా అందించే హాకా కేంద్రాల నిర్వాహకులే ఫర్టిలైజర్ షాపుల యజమానులు కావడంతో జిల్లాకు వచ్చిన మెజార్టీ సబ్సిడీ యూరియా ఫర్టిలైజర్ దుకాణాలకు తరలించి అధిక ధరలకు విక్రయిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
జిల్లాలో ఉన్న 12 హాకా సెంటర్లకు ఈ వానకాలంలో రైతులకు సబ్సిడీపై అందించేందుకు 1,540 మెట్రిక్ టన్నుల యూరియాను అధికారులు కేటాయించారు. హాకా సెంటర్ల నిర్వహకులు దాదాపుగా చాలా చోట్ల ఫర్టిలేజర్ దుకాణాలు ఉన్నవాళ్లే. తమ బినామీలతో హాకా సెంటర్ల లైసెన్స్‌లు పొంది సబ్సిడీ యూరియాను పక్కదారి పట్టిస్తున్నారు. హాకా సెంటర్లకు వచ్చే సబ్సిడీ యూరియాను రూ.270కి రైతులకు అందించాల్సి ఉన్నప్పటికీ ఫర్టిలైజర్ దుకాణాలకు తరలిస్తూ ఇష్టానుసారంగా దోపిడీ చేస్తున్నారు. దీంతో సబ్సిడీ యూరియా రైతులకు అందుబాటులో లేకుండా పోతున్నది.
హాకా సెంటర్లలో యూరియా హ్యాక్..
కుమ్ర భీం ఆసిఫాబాద్ జిల్లాలో హాకా సెంటర్ల ద్వారా రైతులకు అందించాల్సిన సబ్బిడీ యూరియా పక్కదారి పట్టించడం అంతా సాధారణ విషయంగా మారింది. గ్రామాల్లో హాకా కేంద్రాలు ఉన్నట్లే రైతులకు తెలియకుండా మేనేజ్ చేస్తున్నారు. ఫర్టిలైజర్ దుకాణాలు నిర్వహించేవారికి, వ్యవసాయ శాఖలో పనిచేసే ఉద్యోగులకు సంబంధించి బినామీల పేర్లమీదే హాకా కేంద్రాలు ఉండడంతో అధికారులు, వ్యాపారులు కుమ్మక్కై సబ్సిడీ యూరియాను పక్కదారి పట్టిస్తున్నారు. కోట్ల రూపాయల విలువైన సబ్సిడీ యూరియా అటు వ్యాపారులు, ఇటు అధికారులకు లాభాల పంట పండిస్తున్నది. పీఏసీఎస్ కేంద్రాల వద్ద రైతులు రెండు యూరియా బస్తాల కోసం గంటల తరబడి నిరీక్షిస్తుంటే.. హాకా సెంటర్లకు వస్తున్న సబ్సిడీ యూరియాను అధికారులు వ్యాపారులు కలిసి పక్కదారి పట్టిస్తున్నారు. ఫిర్యాదులు రానిదే చర్యలు తీసుకోలేమని చెబుతున్న వ్యవసాయ అధికారులు వాటిపై ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు.
జూలై వరకు సరిపడా నిల్వలు ఉన్నాయి..
– శ్రీనివాస రావు, జిల్లా వ్యవసాయ అధికారి, కమ్రం భీం ఆసిఫాబాద్.
జూలై నెల వరకు సరిపడే ఎరువుల నిల్వలు ఉన్నాయి. 60 వేల మెట్రిక్ టన్నుల యూరియా ఈ వానకాలంకు అవసరం. కాగా ఇప్పటివరకు 25 వేల మెక్రిట్ టన్నుల యూరి యా జిల్లాకు వచ్చింది. రైతుల అవసరాలకు అనుగుణంగా జిల్లాకు తెప్పిస్తున్నాం. రైతులకు సబ్సిడీపై యూరియా అందించే కేంద్రాలకు సంబంధించి యూరియా ఎక్కువ ధరకు అమ్ముతున్నట్లుగాని, ఇతర షాపులకు తరలించినట్లుగా ఫిర్యాదులు రాలేదు. పెంచికల్పేట్లోని హాకా కేంద్రంలో 160 టన్నులు యూరియా పక్కదారి పట్టింది. అని వచ్చిన ఆరోపణలకు సంబంధించి విచారణ చేపడుతున్నాం. దీనికి సంబంధించిన నిర్వాహకులు ప్రస్తుతం అందుబాటులో లేరు.