కుమ్రం భీం ఆసిఫాబాద్, జూలై 3 (నమస్తే తెలంగాణ) : జిల్లాలోని హాకా సెంటర్లకు వస్తున్న టన్నుల కొద్ది యూరియా పక్కదారి పడుతుండగా, వ్యవసాయ అధికారులు మాత్రం వాటి నిర్వాహకులు నిజాయితీ పరులేనని, హాకా కేంద్రాల ద్వారా యూరియా రైతులకు సక్రమంగా అందుతున్నదని సర్టిఫికెట్ ఇవ్వడం స్థానికంగా చర్చనీయాంశమవుతున్నది. హాకా కేంద్రాలకు వస్తున్న సబ్సిడీ యూరియా బ్లాక్‌లో విక్రయిస్తున్నారంటూ వస్తున్న కథనాలకు స్పందించిన కెరమెరి మండల వ్యవసాయాధికారి యుగంధర్ స్థానికంగా ఉన్న హాకా సెంటర్‌ను తనిఖీ చేసి అన్నీ సక్రమంగా ఉన్నాయంటూ క్లీన్‌చీట్ ఇవ్వడం విమర్శలకు తావిస్తున్నది. యూరియా పంపిణీలో ఎలాంటి అవకవతకలు జరుగులేదని.. నిర్వాహకుడి తప్పేమీలేదని, కావాలనే కొంతమంది రైతులు, స్థానిక నాయకులు అసత్య ఆరోపణలు చేస్తున్నారంటూ జిల్లా వ్యవసాయ శాఖ కార్యాలయం నుంచి ప్రెస్‌నోట్ విడుదల చేయించడం వెనుక మతలబేమిటన్న ప్రశ్న రైతుల్లో తెలెత్తుతున్నది.
ఇది కెరమెరి మండల కేంద్రంలోని హాకా సెంటర్లో ఓ రైతు తీసుకున్న ఎరువులకు సంబంధించిన బిల్లు. 3 యూరియా బస్తాలు, మరో 3 ఇతర ఎరువులు తీసుకున్నట్లు.. బిల్లు చెల్లించినట్లు నిర్వాహకుడు ఓ తెల్లకాగితంపై రాసిచ్చాడు. రైతులు కొనుగోలు చేసే ఎరువులు, విత్తనాలకు సరైన బిల్లులు ఇవ్వకుండా ఇలా తెల్లకాగితంపై రాసి ఇవ్వడం ఆ వ్యవసాయ అధికారికి సక్రమంగానే కనిపించిందా అన్న ప్రశ్న తలెత్తుతున్నది. రైతు తీసుకున్న ఎరువులకు ఎంత ధర వేశాడు.. రైతు నుంచి ఎన్నిడబ్బులు తీసుకున్నాడు అనే వివరాలేవీలేవు. హాకా కేంద్రంలో తీసుకున్న ఎరువులు ఒకవేళ నకిలీవీ అయితే ఆ రైతు ఎవరిని ప్రశ్నించాలి..? రైతుకు తెల్లకాగితం రాసి ఇచ్చిన బిల్లు చెల్లుబాటవుతుందా..! అధికారుల కళ్లముందే రైతులు దోపిడీకి గురవుతుంటే అధికారులు మాత్రం అంతా సక్రమంగానే ఉందంటూ సర్టిఫికెట్ ఇవ్వడం వెనుక ఆంతర్యమేమిటని రైతులు ప్రశ్నిస్తున్నారు. వ్యవసాయ అధికారులే అక్రమ వ్యాపారులను వెనుకేసుకొస్తున్నారనే విమర్శలకు వస్తున్నాయి.
‘ఇది రెబ్బెనలోని పీఎసీఎస్ (ప్రాథమిక వ్యవసాయ సహాకార సంఘం) కేంద్రం. గురువారం యూరియా కోసం పెద్ద సంఖ్యలో రైతులు తరలిరాగా, వారిని అదుపు చేసేందుకు పోలీసు భద్రత కల్పించాల్సి వచ్చింది. బుధవారం ఈ కేంద్రానికి వచ్చిన యూరియాను రోడ్డు పైనే దింపేసిన అధికారులు గురువారం యూరియా పంపిణీ చేస్తామని చెప్పడంతో ఉదయం నుంచి బారులు తీరారు. మధ్యాహ్నం 12 గంటలైనా అధికారులు రాకపోయేసరికి రైతులు రాస్తారోకో చేపట్టారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి ధర్నా చేస్తున్న రైతులను సముదాయించి విరమింపజేశారు. కేంద్రం వద్ద రైతుల రద్దీ ఎక్కువగా ఉండడంతో పోలీసు భద్రత మధ్య అధికారులు టోకెన్లు రాసి ఇచ్చారు. ఈ ఘటనను చూస్తే పదేళ్ల క్రితం ఎరువుల కోసం రైతులు ఎదుర్కొన్న ఇబ్బందులు గుర్తుకువచ్చాయి.
జిల్లాలో సాగవుతున్న పంటలకు సరిపడా ఎరువులను సరఫరా చేయడంలో సర్కారు లోపం స్పష్టంగా కనిపిస్తున్నది. పంటల సాగును బట్టి ఎరువులు అవసరాన్ని గుర్తించడంలో.. జిల్లాకు ఎరువులు తెప్పించడంలో అధికారులు విఫలమయ్యారనే విమర్శలు వస్తున్నాయి. తెలంగాణ రాకముందు ఎరువుల కోసం రైతులు చేపట్టిన ధర్నాలు, ఆందోళనలు పునరావృతమవుతున్నాయి. పోలీసుల భద్రత లేనిదే సబ్సిడీ ఎరువులు పంపిణీ చేయలేని పరిస్థితి నెలకొంది. మరో పక్క హాకా కేంద్రాలకు వచ్చే టన్నుల కొద్ది సబ్సిడీ యూరియా అక్రమంగా ఫర్టిలైజర్స్ దుకాణాలకు తరలిస్తూ ఎక్కువ ధరలకు విక్రయిస్తున్నా పట్టించుకునే నాథుడు లేకుండా పోయాడు.
యూరియా కోసం కేంద్రానికి వచ్చే రైతుకు అవసరం మేరకు యూరియా బస్తాలు ఇవ్వడం లేదు. ఒక పట్టాసాస్ బుక్కు రెండు యూరియా బస్తాలే ఇస్తుండడం రైతులను ఇబ్బందులకు గురిచేస్తోంది. ఎకరం ఉన్న రైతుకు రెండు యూరియా బ్యాగులే.. అంతకంటే ఎక్కువ సాగు భూమి ఉన్న రైతులకు కూడా రెండే బస్తాలు ఇస్తున్నారు. ఎక్కువ యూరియా కోసం అడగకుండా పోలీసులను పెట్టి రైతులను అడ్డుకుంటున్నారు. అధికారులు అందించే యూరియా బస్తాలు ఎటూ సరిపోక.. తప్పనిసరి పరిస్థితుల్లో ఫర్టిలెజర్స్ దుకాణాల వద్ద ఎక్కువ ధరకు కొనాల్సి వస్తుందని రైతులు వాపోతున్నారు.