మంచిర్యాల, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ప్రభుత్వం తన ఆదాయాన్ని పెంచుకునేందుకు కొత్త పోకడలకు పోతున్నది. ఇందులో భాగంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మూడు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలు ఏర్పాటు చేసేందుకు కసరత్తు మొదలు పెట్టింది. అభివృద్ధి కోసమే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు సర్కారు చెబుతుండగా, ఈ విధానం వల్ల గ్రామ పంచాయతీల ఆదాయానికి గండి పడి, వాటి మనుగడ ప్రశార్థకంగా మారే ప్రమాదముందన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మూడు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలు ఏర్పాటు కాబోతున్నాయి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో నిర్ణయం తీసుకోగా ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాలకు సంబంధించి జీవోలు జారీ అయ్యాయి. ఆదిలాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలోకి ఆదిలాబాద్ మున్సిపాలిటీతో పాటు ఆరు మండలాల్లోని 107 పల్లెలు, మంచిర్యాల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలోకి మంచిర్యాల, చెన్నూర్, బెల్లంపల్లి, నస్పూర్, క్యాతనపల్లి, లక్షెట్టిపేట మున్సిపాలిటీలతో పాటు జిల్లాలోని అన్ని మండలాల్లోని 350 పల్లెలు, నిర్మల్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలోకి నిర్మల్, ఖానాపూర్, భైంసా మున్సిపాలిటీలతో పాటు జిల్లాలోని అన్ని మండలాల్లోని 420 పల్లెలోను చేర్చింది.
ఇప్పటికే ఆర్థిక లేమితో కొట్టుమిట్టాడుతున్న పంచాయతీలకు అథారిటీలు కొత్త కష్టాలను తెచ్చిపెట్టనున్నాయి. గ్రామ పంచాయతీల్లో భవన నిర్మాణ అనుమతుల నుంచి వచ్చే బెటర్మెంట్, డెవలప్ మెంట్ ఫీజులు ఇప్పటి వరకు పంచాయతీల ఖాతాల్లోనే జమ అవుతుండగా, అర్బన్ అథారిటీ పరిధిలోకి వచ్చిన తర్వాత మాత్రం డెవలప్ మెంట్ ఫీజులన్నీ అథారిటీ అకౌంట్కు చేరనున్నాయి. దీని వల్ల పంచాయతీలకు ఆదాయం పూర్తిగా తగ్గిపోతుంది. అప్పుడు పంచాయతీలు కేవలం ఆస్తి పన్నులు, చెత్త సేకరణ యూజర్ చార్జీల మీదే ఆధార పడాల్సి వస్తుంది. దీంతో పాటు అథారిటీలు రూపొందించే మాస్టర్ ప్లాన్ విషయంలోనూ ఎకువగా మండలాలను పరిగణలోకి తీసుకుంటారు. దీంతో రెసిడెన్షియల్, కమర్షియల్, ఇండస్ట్రియల్, మిక్స్డ్ జోన్లుగా ప్రాంతాలు విభజన చేయాల్సి ఉంటుంది. ఫలితంగా ఎవరి ఇష్టానుసారం వాళ్లు నిర్మాణాలు చేసుకోవడానికి ఆసారం ఉండదు. పంచాయతీలు అనుమతులు ఇవ్వడానికి అథారిటీ చట్టాలు ఒప్పుకోవు. దీని వల్ల సమస్యలు వచ్చే ప్రమాదాలు ఉన్నాయి. అలాగే, పంచాయతీల్లో వివిధ నిర్మాణ అనుమతుల ద్వారా వచ్చే ఆదాయాలను అథారిటీలు అదే పంచాయతీల్లో వెచ్చించే అవకాశాలు చాలా తకువగా ఉంటాయి.
ఈ రంగంలోని నిపుణులు చెబుతున్న దాని ప్రకారం చూస్తే అర్బన్ అథారిటీ అమల్లోకి వచ్చిన తర్వాత ఏ పంచాయతీలైనా సరే 300 చదరపు మీటర్లకు మించి విస్తీర్ణంలో నిర్మాణం చేయాలంటే ఆయా అర్బన్ అథారిటీల నుంచి అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే, జీ ప్లస్ 3 దాటే నిర్మాణాల అనుమతుల కోసం అర్బన్ అథారిటీకి వెళ్లాల్సిందే. అలాగే అర్బన్ అథారిటీ పరిధిలోకి వచ్చే ఏ పంచాయతీలో అయినా వాణిజ్య నిర్మాణాలు చేపడితే తప్పనిసరిగా అథారిటీకి వెళ్లాల్సిందే. అది ఏ చిన్న వాణిజ్య నిర్మాణమైనా సరే… ఉదాహరణకు కోళ్ల షెడ్స్ వంటి ఇతర ఎలాంటివైనా అథారిటీ నుంచి అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. దీనికి ఆయా అథారిటీల్లో నిర్ణయించిన మేరకు ఫీజులు కూడా భారీగానే ఉండే అవకాశం ఉంది. అలాగే, ఇంటి పన్నులు భారీగా పెరగనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అన్ని జిల్లాల్లోని పంచాయతీల్లో మాస్టర్ ప్లాన్ అమలు చేయడం కోసం జిల్లా టౌన్ కంట్రీ, ప్లానింగ్ ఆఫీసర్(డీటీసీపీ) ఉన్నారు. ప్రస్తుతం జిల్లా మొత్తాన్ని అర్బన్ అథారిటీ పరిధిలోకి తీసుకుంటున్న పరిస్థితుల నేపథ్యంలో ఈ విభాగం పరిస్థితి ఏమిటన్న ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి.
అర్బన్ డెవలప్మెంట్ అథారిటీల పేరుతో తీసుకుంటున్న ఈ నిర్ణయం వెనుక ప్రభుత్వం ఆదాయం పెంచుకోవాలన్న ఎత్తుగడ కనిపిస్తున్నా పంచాయతీల మనుగడ ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఈ రంగంలోని వివిధ నిపుణుల ద్వారా సేకరించిన సమాచారం చూస్తే.. అథారిటీలు అమల్లోకి వస్తే పంచాయతీలు ఆర్థికంగా పూర్తిగా చితికిపోయే ప్రమాదం ఉందని పేరొంటున్నారు. ప్రస్తుతం పంచాయతీలకు వివిధ రూపేణా వస్తున్న పన్నులు, ఇతర ఆదాయాల్లో ఇక నుంచి మెజార్టీ శాతం అర్బన్ అథారిటీలకు సమకూరనున్నాయి. పల్లె ప్రజలు పంచాయతీలను విడిచి తమ పనులకోసం అథారిటీల వెంట తిరగాల్సి వస్తుందని తెలుస్తోంది. అథారిటీల ఏర్పాటు, దాని వెనుక దాగి ఉన్న అంశాలను లోతుగా విశ్లేషించి చూస్తే పంచాయతీల మనుగడకు ఇబ్బంది తప్పదని తెలుస్తోంది.
అర్బన్ అథారిటీల విస్తరణతో గ్రామ పంచాయతీల ఆదాయాలకు కోతలు పడనున్నాయి. వీటితోపాటు ఒక స్థాయి దాటిన భవన నిర్మాణ అనుమతుల కోసం, వాణిజ్య అవసర నిర్మాణ అనుమతుల కోసం ఇక ముందు అర్బన్ అథారిటీల వద్దకు వెళ్లాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల ఆయా గ్రామ పంచాయతీల పరిధిల్లో ఉన్న ప్రజలకు ఇబ్బందులు వచ్చే ప్రమాదాలు ఉన్నాయి. ప్రస్తుతం పంచాయతీ పరిధిలో గృహ నిర్మాణాలు, వాణిజ్య నిర్మాణాలు ఏవి చేసినా పంచాయతీ కార్యాలయంలో దరఖాస్తు చేసుకొని అకడి నుంచే అనుమతులు తీసుకుంటున్నారు. ఆయా ప్రాంతాల్లో స్థానికంగా ఉండే అవసరాలకు అనుగుణంగా, పంచాయతీ రూపొందించిన ప్లాన్ ప్రకారం రోడ్ల విస్తీర్ణం వాటిని పరిగణనలోకి తీసుకొని నిర్మాణ అనుమతులు ఇస్తున్నారు. కాగా అర్బన్ అథారిటీ పరిధిలోకి వస్తే 30 ఫీట్లకు తకువగా రోడ్డు ఉండే అనుమతులు దొరకడం కష్టమే. అలాగే అర్బన్ అథారిటీ మాస్టర్ ప్లాన్ ప్రకారమే నిర్మాణాలు చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇది పూర్తిగా స్థానికంగా ఉండే ప్రజలకు ఇబ్బందులు తీసుకువచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.