ఆదిలాబాద్ ప్రతినిధి, మార్చి 25(నమస్తేతెలంగాణ ): ధాన్యం కొనుగోళ్ల విషయంలో తెలంగాణపై వివక్ష చూపుతున్న కేంద్రం.. ఇప్పుడు ఏకంగా మరో అడుగు ముందుకేసి అన్నదాతలను అవమానపరుస్తున్నది. ‘నవ్విపోదురు గాక నాకేంటి సిగ్గు’ అన్న చందంగా వ్యవహరిస్తూ.. ‘రాష్ట్ర ప్రజలు నూకలు తినండి’ అంటూ కించపరిచేలా మాట్లాడుతున్నది. గురువారం కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చేసిన అహంకారపూరిత వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం కాగా, తెలంగాణ రైతులు, ప్రజలు మండిపడుతున్నారు. వాతావారణ పరిస్థితుల వల్లే యాసంగిలో నూకలు అవుతున్నాయని శాస్త్రవేత్తలు పదే పదే చెబుతున్నా పట్టించుకోకుండా హేళన చేస్తున్న తీరుపై భగ్గుమంటున్నారు. ఇంత అహంకారం పనికిరాదని, పీయూష్ గోయల్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఇకనైనా కేంద్రం దిగిరావాలని, లేదంటే తెలంగాణ తరహాలో మరో పోరాటం చేస్తామని, తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరిస్తున్నారు.
నిజానికి దేశంలోనే తెలంగాణ వాతావారణ పరిస్థితులు, శీతోష్ణ స్థితిగతులు వేరు. ఈ పరిస్థితులే వరిపై ప్రభావం చూపుతున్నాయి. వానకాలంలో పండే వరితో పోలిస్తే.. యాసంగిలో పండే ధాన్యం సమయం ఎక్కువగా తీసుకుంటుంది. మార్చి నుంచే ఎండలు మొదలవుతుండగా, ఉష్ణోగ్రతలు 35 డిగ్రీలు దాటుతాయి. దీని వల్ల వడ్ల గింజలు పగులుతున్నాయి. ఫలితంగా వాటిని మర వేసినప్పుడు నూకల శాతం పెరుగుతున్నది. ఇక్కడి వాతావారణ పరిస్థితులే తప్ప.. పండించే విధానంలో మార్పు లేదు. అలాగని రైతు నూకలు అయ్యే పంటలు వేయడం లేదు. యాసంగిలో పండే పంట ఇలాగే ఉంటుంది. ఈ పరిస్థితులను అధిగమించాలంటే.. యాసంగిలోనూ నూకలు రాకుండా ఉండే ధాన్యం సీడ్ మార్కెట్లోకి రావాలి. దీనిపై వ్యవసాయ సంస్థలు పరిశోధన చేస్తున్నాయి. రాష్ట్రంలో యాసంగిలోనూ రా రైస్ వచ్చే విధంగా విత్తనోత్పత్తి చేసే పనిలో పడ్డాయి. అయితే ఈ ప్రయోగాలు విజయవంతం కావడానికి సమయం పడుతుంది. నిజానికి ఈ తరహా పరిశోధనలు చేయాల్సింది కూడా కేంద్రమే. కానీ, ఈ దిశగా ఏనాడూ ప్రయత్నం చేయలేదు. కనీసం ఇక్కడి పరిస్థితిని అర్థం చేసుకోవడం లేదు. ‘ఎవరి చావు వారు చస్తారులే’ అన్న చందంగా వ్యవహరిస్తున్నది. ఎందుకని అడిగితే.. నూక వస్తున్నదని, అందుకే కొనలేమని చేతులెత్తేస్తున్నది.
అహంకారపూరిత వ్యాఖ్యలు..
ఇన్నాళ్లూ ధాన్యం కొనుగోలు విషయంలో కొర్రీలు పెడుతున్నది కేంద్రం.. ఇప్పుడు ఏకంగా తెలంగాణ ప్రజానీకాన్ని హేళన చేసింది. ‘మీ రాష్ట్ర ప్రజలకు నూకలు తినడం అలవాటు చేయండి. సమస్య పరిష్కారమవుతుంది.’ అంటూ కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలంగాణ ప్రజలను, అన్నదాతలను అవమానించేలా, అహంకారపూరితమైన వ్యాఖ్యలు చేయడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతున్నది. ‘నవ్విపోదురు గాక నాకేంటి సిగ్గు’ అన్నట్లుగా.. ధాన్యం కొనకపోగా.. ఆపై వ్యంగ్యపు మాటలతో అవమానపరచడాన్ని రాష్ట్ర ప్రజలు, రైతులు సహించలేక పోతున్నారు. దేశంలోని ఆయా రాష్ర్టాల్లో వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటలు పండుతాయని, దిగుబడి సైతం అలాగే వస్తుందని, తెలంగాణలో యాసంగిలో పండే ధాన్యం నూకలు అవుతుందని, ప్రకృతి రీత్యా జరిగే ఈ మార్పులను అడ్డుకునే శక్తి ప్రస్తుతం ప్రభుత్వాలకు, రైతులకు లేదని చెబుతున్నారు. శాస్త్రీయంగా చూసినా ఇందులో మానవ తప్పిదం లేదని, అలాంటప్పుడు పండించిన పంటను మద్దతు ధరకు కొని బియ్యంగా మార్చుకునే ప్రక్రియపై కేంద్రం దృష్టిపెట్టాల్సింది పోయి.. ‘తెలంగాణ ప్రజలు నూకలు తినుండ్రి’ అంటూ హేళన చేయడంపై మండిపడుతున్నారు. రైతు వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న మోదీ సర్కారు తీరును రైతులు ఎండగడుతున్నారు. ఇప్పటికైనా తీరు మార్చుకోకుంటే తగిన బుద్ధి చెబుతామని హెచ్చరిస్తున్నారు.
ప్రణాళిక లోపమే ప్రధాన శాపం..
రైతును రాజును చేయాలన్న సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం ముందుకెళ్తున్నది. గడిచిన ఏడేళ్ల కాలంలో ప్రణాళికాబద్ధంగా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ వచ్చింది. భారీ ఎత్తున ప్రాజెక్టులను నిర్మించింది. ప్రపంచమే అబ్బుర పడేలా కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని అనతి కాలంలో పూర్తి చేసింది. చెరువులను పునరుద్ధరించి జీవం పోసింది. కాలువలకు మరమ్మతులు చేసింది. వరద కాలువను జీవనదిలా మార్చింది. వీటన్నింటితో భూగర్భజలాలను పెంచింది. దేశంలో ఎక్కడా లేని విధంగా 24 గంటలపాటు ఉచిత కరెంటు ఇచ్చింది. రైతు బంధు కింద పంట పెట్టుబడికి సాయం అందిస్తున్నది. రైతుకు ఏమైనా జరిగితే ఆదుకునేందుకు రైతు బీమాను తెచ్చింది. వ్యవసాయ విధానాలను అనుకూలంగా మార్చడంతో రైతుల ఆత్మహత్యలు పోయి.. రైతు రాజు అయ్యే పరిస్థితి వచ్చింది. ఒక్క మాటలో చెప్పాలంటే దేశానికి అన్నం పెట్టే రాష్ర్టాల్లో తెలంగాణ ఒకటిగా నిలిచింది. ఈ పరిస్థితుల్లో యాసంగిలో పండించిన ధాన్యాన్ని కేంద్రం మద్దతు ధరతో కొనుగోలు చేస్తే రైతుల ఇబ్బందులు తొలిగిపోతాయి. కానీ, మోదీ సర్కారు మోకాలడ్డుతోంది. దీనికి ప్రధాన కారణం ప్రణాళికలు లేకపోవడమే. పంటల ఎగుమతులు, దిగుమతులను చూసుకోవాల్సింది, మద్దతు ధర ప్రకటించి కొనుగోలు చేయాల్సింది కేంద్రమే. రాష్ర్టాలు తీసుకుంటున్న చర్యలతో పెరిగిన దిగుబడులకు అనుగుణంగా ధాన్యం ఎగుమతులను చూసుకొని ఉంటే.. ఈ రోజు ఈ దైన్య పరిస్థితి వచ్చేది కాదు. కేంద్రం తన ప్రణాళిక లోపాన్ని ఒప్పుకోకుండా.. నూకల పేరిట తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో యాసంగిలో 1.46 లక్షల ఎకరాల్లో రైతలు వరిని సాగు చేశారు. ఈ సీజన్లో 2.95 లక్షల మెట్రిక్ టన్నుల పంట దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు.
ప్రజలు తగిన గుణపాఠం చెబుతారు
మన రాష్ట్రంలో వడ్లు ఎక్కువగా పండుతాయి. బీజేపీ ప్రభుత్వం వాటిని కొనుగోలు చేయకుండా మొండి వైఖరి ప్రదర్శిస్తున్నది. పంజాబ్‌లో పండిన వడ్లను కొంటూ తెలంగాణలోని ధాన్యాన్ని కొనకుండా రైతులను ఇబ్బందులు పెడుతున్నది. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేక తెలంగాణపై కక్షగట్టింది. వడ్ల కొనుగోలు విషయంలోనూ కొర్రీలు పెడుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసిన వడ్ల నుంచి వచ్చే బియ్యాన్ని సేకరించాల్సిన కేంద్ర ప్రభుత్వం ఈ ప్రక్రియ నుంచి వైదొలుగుతున్నది. వన్ నేషన్ వన్ ప్రొక్యూర్మెంట్ ఉండాలి. ధాన్యం కొనుగోలుపై రైతాంగాన్ని, మంత్రులను అవహేళన చేస్తూ మాట్లాడిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌కు, కేంద్ర ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయి.
– మోటపలుకుల గురువయ్య, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు, మంచిర్యాల
నూకలకు వాతావరణ పరిస్థితులే కారణం
యాసంగి సీజన్లో నూకలు కావడానికి వాతావరణ పరిస్థితులే కారణం. నిజానికి తెలంగాణలో యాసంగి పంట కాలం నవంబర్ 15 నుంచి మొదలవుతుంది. డిసెంబర్ 10 వరకు నార్లు పోస్తారు. నవంబర్, డిసెంబర్లో చలితీవ్రత ఎక్కువగా ఉండి నారు పెరుగదు. ఫలితంగా నాట్లు వేయడం ఆలస్యవుతుంది. వానకాలం పంటకా లంతో పోలిస్తే యాంసంగి పంటకు ఇరవై నుంచి ఇరువైదు రోజులు ఎక్కువ సమయం పడుతుంది. ఈ సమయంలో ఎండలు ముదిరి పోయి పంటపై ప్రభావం పడుతుంది. దీని వల్ల నూక శాతం ఎక్కు వగా ఉంటుంది. మన రాష్ట్రంలో ఉన్న భౌగోళిక వాతావరణం, దాని ఆధారంగా ఉండే శీతోష్ణస్థితి వల్ల ఈ పరిస్థితులు ఉంటాయి. వీటిని మార్చడం మన చేతుల్లో లేదు. పంజాబ్ లాంటి రాష్ర్టాల్లో యాసంగి సీజన్ ధాన్యానికి బదులు గోధుమలను సాగు చేస్తారు. అయితే మన వద్ద యాసంగిలోనే కాదు, వానకాలంలో సైతం గోధుమ సాగు సాధ్యం కాదు. ఒక ప్రాంతంలో ఉన్న భౌగోళిక వాతావరణం, వాటిపై ఆధారపడిన శీతోష్ణస్థితి, మృత్తిక రకాలు అక్కడ పండించాల్సిన పంటలను నిర్దేశిస్తాయే తప్ప మరే ఇతర అంశాలు పంటలను నిర్దేశించలేవు.
– పొలాస వ్యవసాయ శాస్త్రవేత్త శ్రీనివాస్
కేంద్రానిది రెండు నాల్కల ధోరణి
కేంద్రంలోని బీజేపీ సర్కారు రైతులపై రెండు నాల్కల ధోరణి అవలంబిస్తున్నది. యాసంగిలో వరికి ప్రత్యామ్నాయంగా ఇతర పంటలు వేయాలని సీఎం కేసీఆర్ సూచిస్తే, వరినే వేయాలని, కేంద్రం ద్వారా తాము వడ్లు కొనిపిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చెప్పి రైతులను మోసం చేశారు. ఇతర రాష్ర్టాల వడ్లను కొంటూ, తెలంగాణలోని ధాన్యా న్ని కొనబోమని కేంద్రం తెగేసి చెబుతున్నది. అయినా ఇక్కడి బీజేపీ నేతలు మాత్రం ఏమీ పట్టనట్లు ఉంటున్నారు. వడ్ల కొను గోలుపై కేంద్ర వైఖరిని నిరసిస్తూ రైతులు పోరాటాలు ఉధృతం చేశారు. తెలంగాణ ఉద్యమ తరహాలో మహోధృత ఉద్యమాన్ని నిర్మించేలా అన్నదాతలు సమాయత్తం అవుతున్నారు.
– తిప్పని లింగయ్య, డీసీఎంఎస్ చైర్మన్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా
గోయల్ క్షమాపణ చెప్పాలే..
తాంసి, మార్చి 25: తెలంగాణ ప్రజానీకాన్ని కించ పర్చేలా మాట్లాడిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వెంటనే క్షమాపణ చెప్పాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయశాఖ మంత్రి ఐకే రెడ్డి డిమాండ్ చేశారు. తాంసి మండలం పొన్నారిలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ దిష్టిబొమ్మను బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్‌తో కలిసి శుక్రవారం దహనం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణలో పండించిన యాసంగి వడ్లను కొనాలని రాష్ట్ర మంత్రుల బృందం కేంద్ర మంత్రి అవమానించేలా మాట్లాడడం సరికాదన్నారు. పంజాబ్, గుజరాత్లో పంటలు కొని, తెలంగాణకెందుకు అన్యాయం చేస్తున్నారో చెప్పాలని ప్రశ్నించారు. యాసంగి వడ్లను కేంద్రమే కొనాలని డిమాండ్‌చేశారు. 5 రాష్ర్టాల ఎన్నికలు అవ్వగానే పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలు పెంచి, ప్రజలను దోచుకుంటున్నారని మండిపడ్డారు. పెంచిన ధరలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్, డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, టీఆర్ఎస్ మండల కన్వీనర్ అరుణ్‌కుమార్, ప్రధాన కార్యదర్శి రమణ, రైతు బంధు సమితి మండల అధ్యక్షుడు కంది గోవర్ధన్‌రెడ్డి, సర్పంచ్‌లు సంజీవ్‌రెడ్డి, సదానందం, గంగయ్య, ఎంపీటీసీలు రేఖారఘు, అశోక్, నాయకులు రమేశ్, పరమేశ్, మహేందర్, మ ల్లయ్య, ఆనంద్, చంద్రన్న, వెంకటరమణ, లింగారెడ్డి, లింగన్నఉన్నారు.