బాసర, జూన్ 28 : బాసర ప్రభుత్వ పాఠశాలలో గుర్తు తెలియని వ్యక్తులు రెచ్చిపోయారు. నాలుగు సీసీ కెమెరాలను ధ్వంసం చేసి, మరో రెండింటిని ఎత్తుకెళ్లారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నర్సయ్య తెలిపిన వివరాల ప్రకారం.. పాఠశాలలో శ్రీ పథకం కింద వచ్చిన నిధులతో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశాం. శుక్రవారం రాత్రి కొందరు గుర్తు తెలియని ఆకతాయిలు పాఠశాలలో ప్రవేశించి నాలుగు సీసీ కెమెరాలను ధ్వంసం చేసి, మరో రెండు సీసీ కెమెరాలను ఎత్తుకెళ్లినట్లు తెలిపారు.
రాత్రిపూట అసాంఘిక కార్యలాపాలకు అడ్డగా మారుతుందని, ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు విన్నవించిన ఫలితం లేకుండా పోయిందన్నారు. ఈ విషయమై బాసర ఎస్సై శ్రీనివాస్ విచారణ చేపట్టారు. పాఠశాలను పరిశీలించి పలు సీసీ ఫుటేజీలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ ఘటనలో ఆకతాయిలను గుర్తించామని, వారు మైనర్స్ కావడం వల్ల వివరాలు బయటకి చెప్పడం లేదని, వారి భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని వారి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చామన్నారు.