మంచిర్యాల ప్రతినిధి/ఆదిలాబాద్, జూలై 10(నమస్తే తెలంగాణ) : పదవీకాలం ముగిసినా ప్రజాప్రతినిధులకు గౌరవ వేతనం అందడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎంపీపీ, ఎంపీటీసీ, జడ్పీటీసీలు గౌరవ వేతనం అందుకోకుండానే పదవీకాలం ముగిసిపోయింది. గత ప్రభుత్వాల హయాంలో ప్రజాప్రతినిధులకు నామమాత్రపు వేతనాలు అందేవి. కేసీఆర్ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రజాప్రతినిధులకు ప్రత్యేక గుర్తింపు ఇవ్వాలని భావించారు.
ఎంపీటీసీలకు నెలకు రూ.750 ఉన్న గౌరవ వేతనాన్ని రూ.5వేలు, ఎంపీపీలకు రూ.1500ల నుంచి రూ.10వేలు, జడ్పీటీసీలకు రూ.2,250ల నుంచి రూ.10 వేలకు పెంచారు. ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ పెరిగిన నేపథ్యంలో మరోసారి వారి వేతనాలను 30 శాతం పెంచాలని కేసీఆర్ సంకల్పించి పెంచారు. దీంతో రూ.5 వేలు ఉన్న ఎంపీటీసీల గౌరవ వేతనం రూ.6500లకు, జడ్పీటీసీ, ఎంపీపీలకు రూ.5 వేలు ఉన్న గౌరవ వేతనాన్ని రూ.13 వేలకు కేసీఆర్ ప్రభుత్వం పెంచింది. అప్పటి వరకు రూ.7,500 గౌరవ వేతనం అందుకునే జడ్పీ చైర్మన్లకు కూడా రూ.ఒక లక్షకు పెంచి అందరూ ప్రజా ప్రతినిధులను గౌరవం కల్పించి వారికి వేతనాలను సకాలంలో అందించేవారు. సమైఖ్య పాలనలో నామమాత్రపు జీతానికి పరిమితమైన ప్రజాప్రతినిధులు కేసీఆర్ పాలనలో గౌరవ వేతనం ప్రకటించి వారి కష్టానికి తగినట్లు వేతనాలు అందిచడంపై ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజాప్రతినిధులకు వేతనాలు రావడం లేదు. కాగా, గౌరవ వేతనం పొందకుండానే తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎంపీపీ, జడ్పీ చైర్మన్లు పదవీ నుంచి దిగిపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు జరిగినప్పటి నుంచి ఒక్క రూపాయి కూడా గౌరవ వేతనం అందకపోవడంతో కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎంపీపీ, ఎంపీటీసీ, జడ్పీటీసీలు గుర్రుగా ఉన్నారు. కేసీఆర్ ప్రభుత్వం తమకు గౌరవ వేతనం అందించి తగిన గుర్తింపును అందించిందని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తమ గౌరవ వేతనాలను నిలిపివేసిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఎంపీపీ, ఎంపీటీసీ, జడ్పీటీసీల పదవీకాలం ముగియగా ఆరు నెలలుగా పెండింగ్లో ఉన్న వేతనాలు తమకు వస్తాయా? రావా? అనే సందిగ్ధంలో ఉన్నారు.
ఇటీవల ఆదిలాబాద్ జిల్లా పర్యటనకు వచ్చిన గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కకు ఎంపీపీ, జడ్పీటీసీలు వినతిపత్రం అందించారు. తమకు పెండింగ్లో ఉన్న వేతనాలను ఇప్పించాలని వేడుకున్నారు. అయినప్పటికీ గౌరవ వేతనం అందకపోవడంపై మాజీలు కాంగ్రెస్ సర్కారు పాలనపై అసంతృప్తితో ఉన్నారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నలుగురు జడ్పీ చైర్మన్లతోపాటు 59 మంది జడ్పీటీసీలు, 64 మంది ఎంపీపీలు, 507 మంది ఎంపీటీసీలకు గౌరవ వేతనం అందలేదు. కేసీఆర్ ప్రభుత్వంలో క్రమం తప్పకుండా వేతనాలు పొందిన జడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీలు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఆరు నెలలుగా గౌరవ వేతనాలు పొందలేదు. జూలై 4వ తేదీతో పదవీకాలం ముగిసి వీరంతా మాజీ ప్రజా ప్రతినిధులు అయినా కాంగ్రెస్ సర్కారు మాత్రం కనికరం చూపకపోవడంపై విమర్శలు వెలువడుతున్నాయి.
కుభీర్, జూలై 10 : కాంగ్రెస్ పాలన అంతా అస్తవ్యస్తం గా మారింది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎంపీటీసీల గౌరవ వేతనం చెల్లించేం దుకు ముందుకు రాకపోవడం విడ్డూరం. కేసీఆర్ ప్రజామోద పాలనలో సర్పంచ్లు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులందరికీ గౌరవం లభించింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడు నెలల పాలన ఏడుపు తెప్పిస్తోంది. పదవీ కాలం ముగిసినా గౌరవ వేతనం చెల్లించలేని దుస్థితిలో రేవంత్రెడ్డి ప్రభుత్వం కొట్టుమిట్టాడుతున్నది. ఇక పనులు చేసిన వాటికి ఇంతవరకు బిల్లులు కూడా అందడం లేదు. ఇలాంటి ప్రభుత్వం తామెన్నడూ చూడలేదు.
– షేక్ మొహియొద్దీన్, మాజీ ఎంపీటీసీ, కుభీర్.
కుభీర్, జూలై 10 : ఆరు నెలలు గడిచినా తమకి చ్చే గౌరవ వేతనం ఇవ్వడంలో కాంగ్రెస్ ప్రభుత్వం తాత్సారం చేస్తున్నది. పదేళ్ల కేసీఆర్ పాలనలో ఏనాడూ జీతాలు ఆపలేదు. జీపీలకు నిధులు లేవు. సర్పంచ్ల ఎన్నికలు నిర్వహించే సాహసం చేయడం లేదు. పరిపాలన స్తంభించింది. పల్లెల్లో పారిశుధ్యం పడకేసింది. గ్రామాలు కంపు కొడుతున్నా రేవంత్రెడ్డి ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదు. వెంటనే ఎంపీటీసీల గౌరవ వేతనం విడుదల చేయాలి. లేని పక్షంలో ఆందోళనలకు వెనుకాడేది లేదు.
– దొంతుల దేవీదాస్, మాజీ ఎంపీటీసీ, నిగ్వ.
సోన్, జూలై 10 : గత సర్కారు ఎంపీటీసీకు గౌరవ వేతనం కింద నెలకు రూ.6,500 అందిస్తామని చెప్పడంతో కొత్తగా ఎన్నికైన తమకు సంతోషం అనిపించింది. అయితే గత ఐదేళ్లలో నెలనెల వేతనం ఇవ్వకున్నా.. ఒకేసారి రెండు, మూడు నెలలవి ఖాతాల్లో జమ చేస్తుండే. గత ఆరు నెలల నుంచి ఎంపీటీసీ సభ్యులకు గౌరవ వేతనం ఇప్పటివరకు ఖాతాల్లో వేయడం లేదు. మా పదవి కూడా అయిపోయింది. వెంటనే ఆ డబ్బులను వెంటనే మా ఖాతాల్లో జమ చేయాలని కోరుతున్నా.
– నాగయ్య, మాజీ ఎంపీటీసీ, న్యూ వెల్మల్.