మంచిర్యాలటౌన్, మార్చి 13 : మంచిర్యాల పట్టణంలోని ఇక్బాల్ అహ్మద్‌నగర్‌లో అనుమతులు లేకుండా నిర్మించిన భవనం పై అంతస్తును గురువారం మున్సిపల్ అధికారులు కూల్చివేశారు. షహనాజ్ తబస్సుమ్ అనే వ్యక్తి తాను తీసుకున్న అనుమతుల ప్రకారం కాకుండా అదనంగా పై అంతస్తు నిర్మించారు. అంతకుముందే సెల్లార్‌ను నిర్మించారు. సెల్లార్ నిర్మాణ సమయంలో పక్కన ఉన్న డాక్టర్ చంద్రశేఖర్ భవనానికి సంబంధించిన ప్రహరీ పడిపోవడం, దాంతో పాటే కింద తవ్విన సమయంలో ఆ భవనం పిల్లర్లు బయటకు కనిపించడంతో వారు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేశారు.
ఆ సమయంలో విచారణకు వచ్చిన అధికారులు నిబంధనలకు విరుద్ధంగా భవనాన్ని నిర్మించారని నిర్ధారణకు వచ్చారు. సంబంధిత భవన యజమానికి నోటీసులు అందజేశారు. నెలలు గడుస్తున్నా సెల్లార్ నిర్మాణం వల్ల డాక్టర్ చంద్రశేఖర్ భవనానికి సంబంధించి ఎలాంటి మరమ్మతులు చేపట్టక పోవడంతో తన భవనం కూలిపోయే ప్రమాదమున్నదని, తనకు న్యాయం చేయాలని హైకోర్టును ఆశ్రయించారు. కాగా, కోర్టు ఆదేశాల మేరకు అనుమతి లేకుండా నిర్మించిన పై అంతస్తును కూల్చివేస్తున్నట్లు టౌన్‌ప్లానింగ్ సూపర్వైజర్ శ్యాంసుందర్ తెలిపారు.