పంచాయతీలు, మండల పరిషత్‌లలో ఏకగ్రీవ తీర్మానాలు
వడ్లు కొనే వరకూ పోరాటాలు చేయాలని సభ్యుల నిర్ణయం
దిలావర్పూర్ మండలంలో వినూత్నంగా గుజరాతీలో పత్రం
పీఎం దిష్టిబొమ్మల దహనాలు.. పత్రాల కాపీలు మోడీకి పోస్ట్..
ఆదిలాబాద్, మార్చి 26(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు నిరసనగా తెలంగాణ తరహాలో మహోధృత ఉద్యమం కొనసాగుతున్నది. పంజాబ్, హర్యానా తరహాలో మన ధాన్యం కొనేవరకూ విశ్రమించొద్దని, ఆందోళనలు ఉధృతం చేయాలని సీఎం కేసీఆర్ పిలుపు ఇచ్చిన విషయం విదితమే. ఈ మేరకు శనివారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా గ్రామ పంచాయతీల్లో సభ్యుల ఆధ్వర్యంలో సర్పంచ్‌లు.. ఎంపీటీసీల ఆధ్వర్యంలో ఎంపీపీలు ఏకగ్రీవ తీర్మానాలు చేశారు. నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలంలోని న్యూలోలంలో గుజరాతీలో తీర్మాన పత్రం తయారు చేసి ప్రధానమంత్రి మోదీకి పోస్ట్ చేశారు. మరికొన్ని చోట్ల పోస్టాఫీసుల ద్వారా తీర్మాన కాపీలను మోదీకి పంపించారు. రైతులను ఎడిపించిన రాజ్యం విలసిల్లలేదని.. రైతుతో పెట్టుకున్నోళ్లు చరిత్రలో కొసెల్లలేదని.. రైతు కన్నెర్రజేస్తే మాడిమసైపోతారని సభ్యులు, రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేంద్ర ప్రభుత్వం వడ్ల కొనుగోలు చేయాలంటూ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. నిబంధనల ప్రకారం బీజేపీ ప్రభుత్వం ధాన్యం సేకరించాలంటూ ఈ నెల 31 వరకు గ్రామ పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్‌లు, డీసీసీబీ, డీసీఎంస్ఎస్ పాలకవర్గాలు, రైతుబంధు కమిటీలు, మున్సిపాలిటీల ఆధ్వర్యంలో తీర్మానాలు చేసి ప్రధాన మంత్రి నరేంద్రమోదీకి పంపనున్నారు. ఇందులో భాగంగా శనివారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా పంచాయతీలు, మండల పరిషత్‌లలో తీర్మానాలు చేసి ప్రధానికి పంపారు. వడ్ల కొనుగోళ్ల విషయంలో కేంద్ర వైఖరిని నిరసిస్తూ సమావేశాలు నిర్వహించి బీజేపీ ప్రభుత్వ తీరును తీవ్రంగా ఎండగట్టారు. నిబంధనల ప్రకారం వడ్లను కొనుగోలు చేయాల్సిన బీజేపీ సర్కారు తెలంగాణ రైతులపై వివక్ష ప్రదర్శిస్తున్నదని పంచాయతీ పాలకవర్గాల సభ్యులు తెలిపారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు వడ్లను కొనుగోలు చేసేంత వరకు తమ నిరసనలు కొనసాగుతాయని సభ్యులు తెలిపారు. నిర్మల్ జిల్లా దిలావార్పూర్ మండలం న్యూలోలం గ్రామ పంచాయతీలో వినూత్న రీతిలో తీర్మానం చేశారు.
ప్రధాన మంత్రి నరేంద్రమోదీకి అర్థమయ్యే విధంగా గుజరాతి భాషలో తీర్మానం చేసి పంపారు. వడ్ల కొనుగోళ్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న పోరాటానికి రైతులు అండగా నిలుస్తున్నారు. కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలంగాణ ప్రజలకు నూకలు తినడం అలవాటు చేయాలని చేసిన వ్యాఖ్యలపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముక్రా(కే)లో రైతులు, స్థానికులు మంత్రి పీయూష్ గోయల్ దిష్టిబొమ్మను దహనం చేశారు. మంచిర్యాల జిల్లాకేంద్రంలో శనివారం జిల్లా పరిషత్ కార్యాలయ సమావేశమందిరంలో స్థాయీ సంఘాల సమావేశాలు నిర్వహించారు. అంతకముందు వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని కోరుతూ పలువురు సభ్యులు తీర్మాన పత్రాన్ని జడ్పీ చైర్ పర్సన్ భాగ్యలక్ష్మికి వైస్ చైర్మన్ సత్యనారాయణ అందజేశారు. కోటపల్లి సర్పంచ్ రాజక్క, షట్పల్లి సర్పంచ్ ఉమల ఆధ్యక్షతన గ్రామసభలు జరిగాయి. వరిధాన్యం కొనుగోలు కేంద్రమే కొనుగోలు చేయాలని తీర్మానం చేశారు. ఈ ప్రతులను పీఎం, కేంద్ర మంత్రులకు చేరాలా కోటపల్లి పోస్టాపీసులో వేశారు. అలాగే కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లావ్యాప్తంగా కూడా తీర్మానాలు చేశారు.
ప్రధానికి అర్థమయ్యేలా తీర్మానం
వడ్ల కొనుగోళ్ల విషయంలో ప్రధానికి అర్థమయ్యేలా గుజరాతీ భాషలో గ్రామ పంచాయతీల తీర్మానం చేసి పంపాం. నిబంధనల ప్రకారం వడ్లు కొనుగోలు చేయాల్సిన బీజేపీ ప్రభుత్వం మొండి వైఖరి ప్రదర్శిస్తున్నది. పంజాబ్‌తో పాటు ఇతర రాష్ర్టాల్లో రెండు పంటల వడ్లు కొనుగోలు చేస్తూ తెలంగాణ రైతులకు అన్యాయం చేస్తుంది. వడ్లను కొనుగోలు చేసేదీ లేదని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అనడం వారి అహంకార ధోరణికి నిదర్శనం. బీజేపీ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసే వరకూ నిరసన కార్యక్రమాలు చేపడుతాం.
– ఓడ్నం సవిత, సర్పంచ్, న్యూలోలం, దిలవార్పూర్ మండంల. నిర్మల్ జిల్లా
వడ్లుకొనే దాకా ఉద్యమిస్తాం
కేంద్ర ప్రభుత్వం వడ్లు కొనే దాకా ఉద్యమిస్తాం. మా ఏరియాలో వరి సాగు బాగా పెరిగింది. రైతులు ఇప్పుడిప్పుడే ఆర్థికంగా ఎదుగుతున్నారు. ఇలాంటి సమయంలో కేంద్ర ప్రభుత్వం రైతులు పండించిన వరిని కొనుగోలు చేయమంటూ చేతులెత్తేయడం సరికాదు. ఇకనైనా బీజేపీ ప్రభుత్వం దిగి రావాలి. లేదంటే తగిన గుణపాఠం తప్పదు.- దాదా భీమయ్య, రైతు, లగ్గాం, దహెగాం
ధాన్యం కొనాలని తీర్మానం చేసినం
ధాన్యం కొనుగోలుపై కేంద్ర సర్కారోళ్లు రైతులను తికమక పెడుతున్నారు. మా మండల సభ్యులతో ఈ విషయమై చర్చించి ఏకగ్రీవ తీర్మానం చేశాం. కేంద్రం ధాన్యం కొనితీరాలని, నూకలు తినాలన్న కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలంగాణ ప్రాంత రైతులు, ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని తీర్మానించాం. ఈ ప్రతులను టీఆర్ఎస్ కన్వీనర్‌కు అందజేశాం. ఆయన మా ఎమ్మెల్యే జోగురామన్నకు ఇస్తారు. మా మండలంలో అనేక గ్రామ పంచాయ తీల్లోనూ తీర్మానాలు చేస్తున్నారు. ఇవి ప్రధానమంత్రికి చేరుతయి. ధాన్యం కొనకుంటే ఢిల్లీకి పోయి ఆందోళన చేసేందుకు సిద్ధం.
– ఠాక్రే వనిత, ఎంపీపీ, బేల
కేంద్రానికి రైతుల ఉసురు తగులుతది
మా గ్రామ పంచాయతీల రైతులందరి సమ్మతితో తీర్మానం జేసినం. కేంద్ర సర్కారోళ్లు రైతులను ఇబ్బందులు పెడుతున్నరు. వడ్లు కొనమని తీర్మానం చేసుడు గిదే మొదటిసారి. అందరికీ జవాబుదారీగా ఉండాల్సిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ రైతులు, ప్రజలను అవమానించేలా మాట్లాడిండు. తెలంగాణ ప్రజలు నూకలు తినాలనడం అహంకారమే. ఒకప్పుడు కరువు కాలంల అందరూ నూకలే తినేటోళ్లు. మా రైతుల ఉసురు తగులుతది. గాయన కూడా నూకలే తినాల్సిన పరిస్థితి వస్తది.
– కుడ్మెల యశోద, సర్పంచ్, పొనాల, బేల మండలం