ఉట్నూర్ రూరల్, జూన్ 3: వ్యవసాయానికి పెట్టిన పెట్టుబడులకు చేసిన అప్పులు, కుటుంబ బాధ్యతలు పెరిగిపోవడంతో ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలంలోని శంభుగుడా గ్రామానికి చెందిన రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఉట్నూరు మండలంలోని శంభుగూడ గ్రామానికి చెందిన సెడ్మకి పులాజీ రాం (45) సోమవారం గ్రామానికి సమీపంలో ఉన్న పంట చేనులో పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలో పడిపోయాడు. రాత్రి అయినప్పటికీ ఇంటికి రాకపోవడంతో భార్య విజ్జు బాయి బంధువులకు సమాచారం అందించి పంట చేనులోకి వెళ్లి చూడగా సృహతప్పి పడి ఉన్నట్లు గుర్తించారు.
వెంటనే ఉట్నూర్ దవాఖానకు తరలించి ప్రాథమిక చికిత్స అనంతరం జిల్లా కేంద్రంలో రిమ్స్ దవాఖానాకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. మృతుడి తమ్ముడు సెడ్మకి బాధిరావు గత మూడు నెలల క్రితం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడగా ఆయన భార్య పిల్లలను వదిలి వెళ్లిపోయింది. దీంతో తమ్ముడికి ఉన్న ఇద్దరు సంతానం తో పాటు తమ్ముడు చేసిన అప్పులతో పాటు తను చేసిన అప్పుల భారం పెరిగిపోవడంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు గ్రామస్తులు తెలిపారు.